నీ మరణాన్ని నీవే చూస్తున్నప్పుడు...

28 Jan, 2019 01:14 IST|Sakshi

కొత్త బంగారం

‘నీ భార్యతో పాటు ఇంటి బయటకి వెళ్తావు. తోట మధ్యకు చేరుకున్నప్పుడు, టెన్నిస్‌ రాకెట్టు ఇంట్లో మరచిపోయావని ఆమెకి చెప్తావు. దానికోసం వెనక్కి వెళ్ళి,‘నీవు’ రాకెట్టుని పెట్టే ప్రవేశద్వారం వద్దున్న అల్మారాకి వెళ్ళకుండా, బేస్‌మెంటు వైపు దారి తీస్తావు. బయటే ఉన్న నీ భార్య, తుపాకీ శబ్దం విని, ఇంట్లోకి పరిగెత్తి నిన్ను పిలుస్తుంది. బేస్‌మెంట్‌ తలుపు తెరిచుందని గమనించి, కిందకెళ్తుంది. నీవు, రైఫిల్ని నీ కణత మీద పెట్టుకుని కాల్చుకున్నావని చూస్తుంది.’ మధ్యమ పురుషలో ఉండే ‘సూయిసైడ్‌’ నవల ప్రారంభం ఇది. 

యీ ఫ్రెంచ్‌ పుస్తకంలో ఉన్న మాటలు, 20 ఏళ్ళ క్రితం–తను పాతికేళ్ళకన్నా ఎక్కువ జీవించనని చాటి, తన 25వ ఏటే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని ఉద్దేశించి కథకుడు చెప్పినవి. మొదట్లో యధార్థ జీవితకథ అనిపించే నవల–20 పేజీల తరువాత కథకుని ఉనికి గురించిన ప్రశ్నలు లేవనెత్తుతుంది. ‘నీవు బతికే ఉంటే నాకు అపరిచితుడివి అయి ఉండేవాడివి. మరణించిన తరువాత స్పష్టంగా కనిపిస్తున్నావు’ అన్న మాటలు, కథకునికీ ‘నీవు’కీ ఉన్న సంబంధాన్ని వివరించవు. అయితే, ‘నీ ఆత్మహత్యను వివరిస్తూ, కామిక్‌ పుస్తకపు పేజీ ఒకటి తెరిచి పెడతావు. నీ భార్య చేయి తగిలి, పుస్తకం మూసుకుపోతుంది. ఏ పేజీ నీ ఆత్మహత్యను ఉదహరించిందో, ఎవరికీ తెలియకుండా పోతుంది’ అన్న మాటలు ఆతృత హెచ్చిస్తాయి. ‘ఆమె నిన్ను తన చేతుల్లోకి తీసుకుని వెక్కుతూ, నీ మీదకి వాలుతుంది. నీ శరీరం చల్లబడ్డం గమనిస్తుంది... నీ అంతాన్ని నీవే యోచించి పెట్టుకున్నావు. నీ మరణానికి వెనువెంటనే, నీ శరీరం కనుక్కోబడే ఏర్పాట్లు చేసుకున్నావు. అదక్కడే కుళ్ళుతూ పడి ఉండటం నీకిష్టం లేకపోయింది’ అన్నలాంటి– నీవు జీవితపు ఉదంతాలను, అనుభూతులను, అలవాట్లను, వస్త్రధారణను, పడగ్గది వివరాలను – ఒకదానికొకటి సంబంధం లేకుండా చెప్పే కథనం కాబట్టి, కథకుడికి ‘నీవు’ గురించిన వ్యక్తిగత వివరాలు ఎలా తెలుసా!’ అన్న అనుమానం కలుగుతుంది.

నవల ఆత్మహత్య అనే చర్యను ప్రశ్నించదు. కానీ, ఆ నిర్ణయం తీసుకున్న మనిషిని నిలదీస్తుంది. అయితే ఏ సమాధానమూ దొరకదు. యీ 104 పేజీల నవలికలో ఉన్న అధ్యాయాల చివర్న, నీవు కుండే ఇష్టాయిష్టాలు కనబడతాయి: ‘నవ్వు రక్షిస్తుంది. సంతోషం నిరాశ పరుస్తుంది. వార్తాపత్రికలు విసుగు పుట్టిస్తాయి’. ‘నీ మరణం తరువాత ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకుందా? ఆమె శృంగారం జరుపుతున్నప్పుడు నీవు గుర్తుకొస్తావా! నీ పుట్టిన రోజున ఆమె ఏమిటి చేస్తుంది? నీ వర్ధంతి దినాన, నీ సమాధి మీద పూలు ఉంచుతుందా! ఇంకా నీ బట్టలు అట్టేపెట్టిందా?’ అన్న క్రూరమైన ప్రశ్నలు హృదయవిదారకంగా అనిపిస్తాయి.

పుస్తకంలో కథకుడి వివరాలేవీ లేనప్పటికీ నవల వెనుక అట్టమీదున్న, ‘తన యీ చివరి పుస్తకపు అచ్చుప్రతి పబ్లిషరుకి ఇచ్చిన పది రోజులకి, రచయిత ఎద్వార్ద్‌ లేవే ఉరి వేసుకున్నాడు’ అన్న వాక్యాలే – నవలను పాఠకులు ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాయి. ‘నీవు’ అన్న పేరులేని వ్యక్తంటూ ఎవరూ లేరనీ, రచయితే తన రెండు పక్షాల వ్యక్తిత్వాలనీ సమర్థించుకుంటూ, అంతర్గత సంభాషణలు జరిపినవాడనీ అన్నవారు అనేకమంది. భయం పుట్టించే పుస్తకం కాదిది. జాలి కలిగించే ప్రయత్నం చెయ్యదు. వ్యాకులత, నిస్పృహతో బాధను విపరీతం చేయదు. వచనం సరళంగా, సాఫీగా ఉంటుంది. జాన్‌ సై్టన్, ఇంగ్లిషులోకి  అనువదించిన యీ నవలికను 2011లో డాకీ ఆర్కైవ్స్‌ ప్రెస్‌ ప్రచురించింది.  కృష్ణ వేణి


 

>
మరిన్ని వార్తలు