రాయని డైరీ: అమిత్‌ షా (బీజేపీ అధ్యక్షుడు)

3 Nov, 2019 01:18 IST|Sakshi

‘‘పులి ప్రెసిడెంట్‌ రూల్‌కి భయపడదు అమిత్‌జీ. అదిగో పులి అంటారు కానీ, అడుగో ప్రెసిడెంట్‌ అని ఎవరూ అనరు’’ అన్నాడు ఉద్ధవ్‌ ఠాక్రే సడన్‌గా ఫోన్‌ చేసి. 
‘‘నేను అమిత్‌షాని ఉద్ధవ్‌’’ అన్నాను. 
‘‘బిడ్డకు పాలిచ్చి వస్తానని ఆవు పులికి ప్రామిస్‌ చేసింది కానీ, బిడ్డకు పాలిచ్చి వచ్చే వరకు నిన్నేమీ చెయ్యను పో అని పులి ఆవుకు ప్రామిస్‌ చెయ్యలేదు అమిత్‌జీ’’ అన్నాడు! 
‘‘నేను అమిత్‌షాని ఉద్ధవ్‌’’ అన్నాను. 
‘‘నేను మిమ్మల్ని అమిత్‌జీ అంటున్నానంటే మీరు అమిత్‌షా అని తెలిసే మాట్లాడు తున్నానని అర్థం అమిత్‌జీ. మీతో మాట్లాడుతున్నది ఉద్ధవ్‌ ఠాక్రేనేనా అని మీకు తెలుసుకోవాలని ఉంటే మాత్రం చెప్పండి. ‘నేను ఉద్ధవ్‌ ఠాక్రేని మాట్లాడుతున్నాను’ అని చెప్పి మీతో మాట్లాడ తాను’’ అన్నాడు! బాగా ప్రశాంతంగా ఉన్నట్లున్నాడు!
‘‘పులి ప్రశాంతంగా ఉంటే పులిగా దానిని గుర్తు పట్టడం కష్టం ఉద్ధవ్‌’’ అన్నాను.
‘‘అర్థం కాలేదు అమిత్‌జీ!’’ అన్నాడు.
‘‘పులెప్పుడూ పులుల గురించి మాట్లాడదు ఉద్ధవ్‌. మనుషులే పులుల గురించి మాట్లాడ తారు. అందుకే కన్‌ఫ్యూజ్‌ అయ్యాను.. మాట్లాడుతున్నది మీరేనా అని’’ అన్నాను. 
‘‘అమిత్‌జీ.. ఈ పులి.. పులుల గురించి ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే.. మనుషులు పులిని పట్టించుకోవడం మానేశారు! అది నేను నమ్మలేకపోతున్నాను. ఎన్నికల ముందు ఒక మనిషి పులి ఇంటికి వచ్చాడు. ‘పులీ పులీ.. ఎన్నికలయ్యాక అడవిని కొన్నాళ్లు నువ్వు పాలించు, కొన్నాళ్లు నేను పాలిస్తా’ అన్నాడు. పోనీలే పాపం.. మనిషి కదా, ఆశలు ఉంటాయి కదా అని ‘సరే’ అన్నాను. ఎన్నికలయ్యాక ఇప్పుడు.. ‘నేనొక్కడినే పాలిస్తా. నువ్వు నీ బిడ్డకు పాలివ్వడానికి వెళ్లు. బిడ్డకు పాలిచ్చి మళ్లీ రానక్కర్లేదు’ అని పులికే అభయం ఇస్తున్నాడు. ‘పులేంటి, బిడ్డకు పాలివ్వడం ఏంటి?’ అని అడిగాను. ‘ఇంకేం మాట్లాడకు. ప్రెసిడెంట్‌ వచ్చాడంటే నీకూ ఉండదు, నాకూ ఉండదు. అడవి ప్రెసిడెంట్‌ది అయిపోతుంది’ అని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు’’ అన్నాడు ఉద్ధవ్‌. 
అతడు చెప్పిన కథలో, చెప్పకూడదనుకున్న నీతి ఏమిటో నాకు అర్థమైంది. ‘నా కొడుకు సి.ఎం. కాకుండా వేరెవరైనా సి.ఎం. ఎలా అవుతారో నేనూ చూస్తాను’ అని అంటున్నాడు! 
‘‘అమిత్‌జీ.. ఈరోజు పేపర్‌ చూశారా? నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి మరాఠ్వాడా ప్రాంతంలో పెద్ద పులి జాడ కనిపించిందట! పొలాల్ని, పెన్‌గంగా నదినీ దాటేసింది. ఐదు నెలల్లో రెండు వందల మైళ్లు ప్రయాణించింది! పార్ట్‌నర్‌ కోసం, కొత్త ప్లేస్‌ కోసం పులులు మైళ్లకు మైళ్లు నడుస్తాయట. సి1 అని పేరు పెట్టారు ఆ పులికి. నన్నడిగితే ఆదిత్యా ఠాక్రే అని పెట్టమని చెప్పేవాడిని. పేరుకు తగ్గ పులిలా ఉండేది’’ అన్నాడు ఉద్ధవ్‌. 
పుత్రోత్సాహం పీక్స్‌కి వెళ్లినట్లుంది!
‘‘పులి కొత్త ప్లేస్‌ వెతుక్కుంటూ వెళ్లే మాట నిజమే ఉద్ధవ్‌. అయితే ఫలానా కొత్త ప్లేస్‌ మాత్రమే కావాలని వెతుక్కుంటూ వెళ్లదు. ముఖ్యమంత్రి ప్లేసా, ఉప ముఖ్యమంత్రి ప్లేసా అని పులి చూసుకోదు’’ అన్నాను. 
ఉద్ధవ్‌ ఏమీ మాట్లాడలేదు. 
‘‘పులి పార్ట్‌నర్‌ని వెతుక్కుంటూ వెళ్లే మాట కూడా నిజమే ఉద్ధవ్‌. అలాగని పులులు కాని వాటిని పులి పార్ట్‌నర్స్‌గా చేర్చుకోదు. ఎన్సీపీకి, కాంగ్రెస్‌కి ఉన్నవి పులిచారలే తప్ప, అవి పులులు కావు’’ అన్నాను. 
ఉద్ధవ్‌ ఏమీ మాట్లాడలేదు.
ఫోన్‌ కట్‌ అయిందేమో చూశాను. లైన్‌ లోనే ఉన్నాడు! కానీ మాట్లాడ్డం లేదు. ‘హలో ఉద్ధవ్‌!’ అన్నాను. నో రెస్పాన్స్‌! ఉలిక్కిపడ్డాను.
పులి కంటే పులిజాడ ఎక్కువ భయపెడుతుంది. 
-మాధవ్‌ శింగరాజు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా