వైద్యరంగానికి వన్నెతెచ్చిన రాయ్‌

30 Jun, 2018 03:38 IST|Sakshi
బిధాన్‌ చంద్రరాయ్‌

డాక్టర్‌ బీసీ రాయ్‌గా ప్రసిద్ధిగాంచిన బిధాన్‌ చంద్రరాయ్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. వైద్యరంగానికి వన్నెతెచ్చిన బీసీ రాయ్‌ 1882 జులై 1వ తేదీన బిహార్‌ రాష్ట్రంలోని పాట్నాజిల్లా బంకింపూర్‌లో జన్మించారు. కలకత్తా మెడికల్‌ కళాశాలలో మెడిసిన్‌ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం 1909లో ఇంగ్లాండ్‌ లోని బర్త్‌ హోమ్‌ హాస్పిటల్‌లో అతి కష్టంమీద సీటు సాధించిన రాయ్‌ కేవలం రెండేళ్ల మూడునెలల స్వల్పకాలంలోనే ఎం.ఆర్‌.సి.పి, ఎఫ్‌.ఆర్‌. సీ.ఎస్‌ డిగ్రీలు పూర్తిచేసి, ఇంత తక్కువకాలంలో ప్రతిష్టాత్మకమైన రెండు డిగ్రీలు పూర్తిచేసిన అరుదైన వ్యక్తిగా చరిత్రలో స్థానం సంపాదించాడు. 1911లో స్వదేశానికి తిరిగొచ్చి కలకత్తా వైద్య కళాశాలలో కొంతకాలం అధ్యాపకుడిగా పని చేశారు. పేదరోగులకు ఏదో చేయాలన్న తపనతో జాదవ్‌ పూర్‌ టీ.బీ హాస్పిటల్, ఆర్‌.జి.ఖార్‌ మెడికల్‌ కాలేజ్, కమలా నెహ్రూ హాస్పిటల్, విక్టోరియా ఇనిస్టిట్యూట్, చిత్తరంజన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ తదితర సంస్థల్ని నెలకొల్పాడు. 1922 నుంచి, 1928 వరకు ఆరేళ్లకు పైగా కలకత్తా మెడికల్‌ జర్నల్‌కు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించాడు.


1925లో రాజకీయ రంగప్రవేశం చేసి, బార క్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌గా పేరుగాంచిన సురేంద్రనాథ్‌ బెనర్జీపై గెలుపొందిన రాయ్‌ అనేక రాజకీయ, అకడమిక్‌ పదవులు చేపట్టారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా పేరుగాంచిన బీసీ రాయ్‌ 1948 జనవరి 13న పశ్చిమబెంగాల్‌ రెండో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. రోజులో కనీసం ఒక్క గంట యినా పేద రోగులకోసం కేటాయించాలనే భావనతో, ఎన్ని పని ఒత్తిడులున్నప్పటికీ ఖచ్చితంగా పేద రోగులకు వైద్యసేవలందించేవాడు. విద్య, వైద్యరంగాల్లో ఆయన చేసిన సేవలకు 1944 లో గౌరవ డాక్టరేట్‌ పట్టా అందుకున్నాడు. 1961లో ఫిబ్రవరి 4న డా‘‘ బీసీరాయ్‌ను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. ప్రజా నేతగా, ప్రజావైద్యుడిగా రాయ్‌ చేసిన కృషికి, త్యాగానికి గుర్తుగా, ఆయన స్మారకార్థం ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీని జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకోవాలని భారతప్రభుత్వం 1962లో ప్రకటించింది. వివిధ రంగాల్లో సేవలందించిన వారికి 1976 నుండి డాక్టర్‌ బీసీ రాయ్‌ పేరుమీద అవార్డులు అందజేస్తున్నారు.

ప్రజల రోజువారీ జీవితాల్లో కీలకపాత్ర పోషించే వైద్యుల సేవలను గుర్తించి, వారి గొప్పతనం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడంకోసం ఈ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కనుక బీసీ రాయ్‌ స్ఫూర్తితో వైద్యరంగంలో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి వైద్యులు కృషిచేయాలి. వైద్యుణ్ణి దైవసమానుడుగా గుర్తించే స్థాయి నుంచి, వైద్యుడంటే పేదల రక్తం పీల్చే పిశాచి అన్న స్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య మహోదయులపై ఈ దురభిప్రాయాన్ని తొలగించాల్సిన బాధ్యత మరింత అధికంగా ఉంది. కార్పొరేట్‌ కల్చర్‌కు అలవాటు పడిన అధికశాతం మంది వైద్యులు మానవీయ కోణాన్ని విస్మరించి ఎన్నిరకాల అవకాశాలుంటే అన్నిరకాలుగా రోగుల్ని పిండుతున్నారు. కొంతమంది అత్యాశాపరుల వల్ల పూర్తి వ్యవస్థకే చెడ్డపేరు వస్తున్న పరిస్థితిని నివారించాల్సిన అవసరం ఉంది. స్వాభావికంగా సేవాభావం లేని వారు, వైద్యేతర రంగాల్లోని కార్పొరేట్‌ వ్యాపారులు వైద్యవృత్తిలోకి ప్రవేశించి వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారన్న బలమైన వాదనపైనా దృష్టి సారించాలి. వైద్యులు రోగులపట్ల తమ దృక్పథాన్ని మార్చుకొని, ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలి. ప్రజా వైద్యుడిగా విశేషఖ్యాతి గడించిన డా‘‘ బీసీ రాయ్‌ను ఆదర్శంగా తీసుకొని వైద్యవృత్తిపై పడిన కళంకాన్ని తొలగించడానికి ప్రతి ఒక్కవైద్యుడూ ఆచరణాత్మక కృషి చేయాలి.
(జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవం)
యండి. ఉస్మాన్‌ ఖాన్,
సీనియర్‌ జర్నలిస్టు ‘ 99125 80645

మరిన్ని వార్తలు