ప్రైవేటు ఉపాధ్యాయులకు భరోసా ఏది?

27 Nov, 2018 01:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సమాజం గాడి తప్పకుండా, సక్రమమైన మార్గంలో పయనించాలంటే, మనుషులు క్రమశిక్షణతో మెలగాలి. అందుకు తరగతి గదిలో నేర్చు కున్న క్రమశిక్షణ అవసరం. అంటే ఇదంతా ఒక ఉపాధ్యాయునిపైనే ఆధారపడి ఉంటుంది. 

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు మంచి వేతనాలిస్తూ గౌరవిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రైవేటు ఉపాధ్యాయులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఎక్కువ శాతం ఉద్యోగులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలోనే చదివిస్తున్నారనంటే ఆ ఉపాధ్యాయులపై వుండే నమ్మకం ఎలాంటిదో తెలియకనే తెలుస్తుంది. కానీ విద్యార్థులను తీర్చిదిద్దే ప్రైవేటు ఉపాధ్యాయుల అంతరంగంలోకి తొంగిచూస్తే ఆందోళన కలిగించే అంశాలెన్నో. 

విద్య నేర్పే విద్యాలయాలు, వ్యాపార సంస్థలుగా మారి, విద్యార్థుల తల్లిదండ్రులను ఒకింత మాయాజాలానికి గురిచేసి, తియ్యని మాట లతో అబ్బురపరిచి, పాఠశాలలోని సిబ్బందిని అష్టకష్టాలకు గురిచేస్తూ కాలం గడుపుతున్నాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.  

నేడు వివిధ కార్పొరేటు సంస్థలు ఎక్కువ లాభార్జన కోసం పాఠశాలలనే ఎంచుకుంటున్నాయి. తమ డబ్బును పెట్టుబడిగా పెట్టి నైపుణ్యం కలిగిన, ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులను ఉపయోగించుకుంటూ, సమాజంలో ఎప్పటికప్పుడు నూతన ఒరవడితో పోటీని తట్టుకుంటూ, వ్యాపార మార్గంలో దూసుకుపోతున్నాయనడంలో  ఎలాంటి అతిశయోక్తిలేదు. కానీ, అదే ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల పరిస్థితి దయ నీయంగా ఉంది. వీరి కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోయినా, యాజమానుల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఒకప్పుడు ఉపాధ్యాయుడంటే సమాజంలో ఎంతో గౌరవం ఉండేది. కానీ నేడు గౌరవించకపోయినా ఫర్వాలేదు. కనీస మర్యాద ఇవ్వకపోగా హీనంగా చూసే దురదృష్టకర పరిస్థితి నెలకొంది. పాఠశాలలో విద్యార్థులను మందలించకూడదు. విద్యార్థే మన సంస్థకు దేవుడు. ఎందుకంటే ఫీజులు కడుతున్నాడు. వాడు ఉపాధ్యాయుని మాట వినడు, చదవడు, పరీక్షలు అయిపోయిన తర్వాత పేపర్సును ఇంటికి పంపించి, ఫలితాలు బాగాలేకపోయినా ఉపాధ్యాయుడే కారణాలు చెప్పాలి. అలా అని చెప్పిన వాటిని వినరు, విన్న వాటిని గురించి పట్టించుకోరు . 

ఉదయం 8 గంటలకు ప్రారంభమైతే అయిదారు గంటలదాకా పాఠశాలలో నిలబడే పాఠాలు బోధించాలి. పొరపాటున అలసటతో విశ్రాంతి తీసుకుంటే, పూర్తి కాలం విశ్రాంతి తీసుకోవా ల్సిందే. ఎన్నో చీవాట్లు, చీదరింపులకు గురి కావాల్సిందే. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి, అతని గురించి వివరిస్తూ, పాఠశాలను పొగుడుతూ, నూతన ప్రవేశాల కోసం ఆరా తీయాలి.  నెలకు ఒకటి, రెండు అడ్మిషన్స్‌ తేవాలన్న డిమాండును కఠినంగా అమలుపరుస్తారు. తేడాలొస్తే జీతంలో కోతలు తప్పవు.  

ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ప్రైమరీ, ప్రీప్రైమరీ ఉపాధ్యాయుల వేతనాలను పరిశీలిస్తే ఆశ్చర్యమేయక తప్పదు. కొన్ని యాజమాన్యాలు వారిపట్ల కనీస కరుణ చూపక, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయి. ఉదయం జరిగే ప్రార్థనకు కనీసం ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా ఎర్ర చుక్క పడుతుంది. ఆలా రెండుసార్లు వస్తే ఒక సెలవు పూర్తవుతుంది. మళ్లీ అది కొనసాగిస్తే జీతంలో కోత పడుతుంది.  
ప్రైవేటు యాజమాన్యాలు సంస్థలు ఏర్పాటు చేసుకొని, మేము ఇంత మందికి కొలువులు కల్పించామని, వారు మేము చెప్పినట్లే వింటారని, ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని చెప్పుకుంటూ వివిధ రాజకీయ పార్టీల మన్ననలు పొందుతుంటారు. ప్రస్తుత సమాజంలో ప్రైవేటు విద్యా సంస్థలలోని విద్యార్థులు రాణిస్తున్నారంటే కారణం అందులో పనిచేసే ఉపాధ్యాయుల కృషి ఫలితమే. కానీ అదే ఉపాధ్యాయున్ని ఇటు యాజమాన్యం కానీ, అటు సమాజం కానీ గుర్తించకపోవడం, ప్రాధాన్యతనివ్వకపోవడం దురదృష్టకరం.  

నేడు ప్రైవేటు ఉపాధ్యాయుని జీవితం అరిటాకులా తయారయింది. ముళ్ళు వచ్చి ఆకుపై పడినా, ఆకు పోయి ముల్లుపై పడినా ఆకుకే ప్రమాదం. ఇప్పటికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చే తాయిలాలను ఆశించ కుండా, ఉపాధ్యాయులపై దృష్టి కేంద్రీకరించి, వారి శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వడమేగాకుండా ఉద్యోగభద్రత కల్పిస్తూ, గౌరవప్రదంగా జీవించేందుకు చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయుల పిల్లలకు ఉచిత విద్యనందించే విధంగా కృషి చేస్తూ, ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ వారి జీవితాలకు భరోసాను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైవేటు విద్యాసంస్థలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు ప్రైవేటు విద్యాసంస్థలలో పనిచేసే ఉపాధ్యాయుల పక్షాన నిలిచి, వారిని ప్రోత్సహిస్తూ, వారి జీవితాలకు భరోసా కల్పించేవిధంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
-డా‘‘ పోలం సైదులు, సామాజిక విశ్లేషకులు

మరిన్ని వార్తలు