రాహుల్‌ గాంధీ రాయని డైరీ

26 May, 2019 01:38 IST|Sakshi

కష్టకాలంలో పక్కన ఉండాలి కానీ, ‘కష్టం కలిగించానే’ అని పక్కకు తప్పుకోకూడదు. ఎన్నికల ఫలితాలు ఎప్పుడొస్తాయా, ఎప్పుడు తప్పుకుందామా అన్నట్లు.. కౌంటింగ్‌ పూర్తయీ కాగానే రాజ్‌బబ్బర్‌ తప్పుకున్నాడు. హెచ్‌.కె.పాటిల్‌ తప్పుకున్నాడు. నిరంజన్‌ పట్నాయక్‌ తప్పుకున్నాడు. ‘‘మరి మీరెప్పుడు తప్పుకుంటారు రాహుల్‌జీ?’’ అని మీడియా ప్రతినిధులు మూకుమ్మడిగా వచ్చి, మీద పడి అడిగారు.. సీడబ్ల్యూసీ సమావేశం నుంచి నేను బయటికి రాగానే.  పార్టీ పవర్‌లోకి రాకపోయినా, మీద పడి మరీ పార్టీ అధ్యక్షుడిని వాళ్లు ప్రశ్నలు అడుగుతుండటం చూస్తూంటే పార్టీ పవర్‌లోకి వచ్చినంత సంతోషంగా అనిపించింది నాకు. ‘‘ఈ సంతోషానికి అర్థముందా మమ్మీ’’ అని అడిగాను. 

‘‘అర్థం లేకుండా ఈ సృష్టిలో ఏముం టుంది రాహుల్‌! అలాగే నీ సంతోషంలోనూ అర్థం ఉండే ఉంటుంది’’ అన్నారు మమ్మీ. అమేథీలో నా ఓటమిని నేనింకా అర్థం చేసుకోక ముందే రాయ్‌బరేలీ అభివృద్ధి పనుల్లో మునిగిపోయి అలసటగా కనిపిస్తున్నారు మమ్మీ! ‘‘సృష్టిలో ప్రతి దానికీ అర్థం ఉన్నట్లే.. సృష్టికి కూడా ఒక అర్థం ఉంటుందా మమ్మీ’’అని అడిగాను. ఏదైనా పూర్తిగా అర్థమయ్యేంత వరకూ అడుగుతూనే ఉండాలని మమ్మీ నాకు చెబుతుండేవారు. ‘‘సృష్టిలో ఉన్నదానికీ అర్థం ఉంటుంది, సృష్టికీ అర్థం ఉంటుంది. ఎన్నికలు దగ్గరికి వచ్చినప్పుడు, ఎన్నికల షెడ్యూల్‌ వచ్చినప్పుడు, ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు మాత్రం మనం అర్థం చేసుకునేదాన్ని బట్టి.. సృష్టి అర్థాలు, సృష్టిలోని అర్థాలు ఉంటాయి’’ అన్నారు మమ్మీ. యూపీ మొత్తం మీద మమ్మీ ఒక్కరే కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. ఒక్కరినైనా గెలిపించానని మితి మీరిన ఆత్మవిశ్వాసంతో ఉండాల్సింది పోయి, మిగతా వాళ్లెవర్నీ గెలిపించలేకపోయానే అనే బాధతో రాజ్‌బబ్బర్‌ పక్కకు తప్పుకోవడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. యూపీ అధ్యక్షుడు ఆయన. తన వల్లే యూపీలో పార్టీ కొట్టుకుపోయిందని గిల్టీగా ఫీలవుతున్నాడు!

ఏదైనా ఒక్కరి కారణంగానే జరుగుతుందా? ఇంకొకరెవరో కూడా కారణంగా ఉండి ఉండాలి. ఆ ఇంకొకరెవర్నో వెతికి పట్టుకుంటే ఫీలింగ్‌ ఉండదు. పక్కకు తప్పుకోవాలనిపించదు. పాటిల్, పట్నాయక్‌ కూడా రాజ్‌బబ్బర్‌ ఫీలైనట్లే ఫీలౌతున్నారు. పాటిల్‌ కర్ణాటక క్యాంపెయిన్‌ మేనేజర్‌. పట్నాయక్‌ ఒడిశా పార్టీ చీఫ్‌. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ తప్పుకోడానికి కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండేదే. అది అవమానం కాదు. ఏపీలో తప్పుకోడానికి కూడా ఎవరూ లేరు! అది పెద్ద ఇన్‌సల్ట్‌. పార్టీ అధ్యక్షుడిగా దానికి నేనెంత ఫీలవ్వాలి? నేనెక్కడికి తప్పుకోవాలి? ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్‌?’’ అన్నారు మమ్మీ. మమ్మీ పని చేసుకుంటూ కూడా నన్ను గమనిస్తున్నారన్నమాట! 

‘‘పక్కకు తప్పుకోవడం అనే సబ్జెక్ట్‌ గురించి ఆలోచిస్తున్నాను మమ్మీ. పార్టీ ఓడిపోయిందని తెలిసి పార్టీని వదిలేసి ప్రెసిడెంట్లు పక్కకు తప్పుకుంటుంటే.. పార్టీ ఓడిపోయిందని తెలిసి కూడా పార్టీ ప్రెసిడెంట్‌ను మాట్లాడించేందుకు వచ్చేవాళ్లను చూస్తే నాకు సంతోషంగా ఉంది. ఆ సంతోషానికి అర్థం ఉండే ఉంటుందని నువ్వు అన్నావు కదా, ఆ ‘ఉండే ఉంటే’ అర్థం ఏమిటా అని ఆలోచిస్తున్నాను’’ అన్నాను. 
మమ్మీ నవ్వారు. ‘‘నీ పక్కన ఎప్పుడూ ఒకరుండాలని నీ మనసు కోరుకుంటోంది’’ అన్నారు మమ్మీ. ‘‘ఎందుకు మమ్మీ’’ అన్నాను. ‘‘పక్కన ఒకరుంటే.. ధైర్యంగా పక్కకు తప్పుకోవచ్చని..!’’ అన్నారు మమ్మీ! 

మరిన్ని వార్తలు