ఆ కార్చిచ్చుకు బాధ్యులెవరు?

21 Jan, 2020 00:28 IST|Sakshi

ఇన్‌బాక్స్‌

ఆస్ట్రేలియా అడవుల్లో కారు చిచ్చుకు బాధ్యులెవరు? అసలు నిప్పు ఎలా రాజుకుంది? నిప్పు మానవ పరిణామ గమనాన్నే మార్చిందని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. అదే నిప్పు ఇప్పుడు కోట్లాది వృక్షాలను, లక్షలాది మూగజీవాలను బూడిద చేస్తూ ప్రపంచానికే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆస్ట్రేలియా...ప్రపంచంలోనే అత్యధికంగా బొగ్గును వెలికి తీసే దేశం. సహజసిద్ధ గనుల్లో బొగ్గు నిక్షేపాలు తగ్గుముఖం పట్టడంతో కొత్త వాటి అన్వేషణలో అక్కడ అడవులను ఇష్టారాజ్యంగా నరికివేస్తున్నారు. ఇక్కడ బొగ్గే ప్రధాన ఇంధన వనరు కావడంతో కేవలం రెండున్నర కోట్ల జనాభా గల ఈ దేశం ఏకంగా 16 శాతం  కార్బన ఉద్గారాలను విడుదల చేస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తోంది. ఆ దేశ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించే నాయకులకు శిలజ ఇంధన వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉండడంతో చట్టాలు దారి తప్పుతున్నాయి. ఇంధనం, విద్యుత్, ఔషధాలు, ఆయుధాలు, ఆడవాళ్ళు ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు మొదలుకొని.. మగవారు వాడే అనేక విలాస వస్తువుల తయారీ వరకు.. మనిషి రూపకల్పన చేసే ప్రతీ సృష్టి వెనుకాల కనిపించని, వినిపించని అరణ్య రోదన దాగుంది.

ఈ కారణంగా ఏర్పడుతున్న వాతావరణ అసమతుల్యతతో ఉష్ణోగ్రతలు, భూతాపం పెరగడంతో సాధారణ కారు చిచ్చులు కూడా ఉగ్ర రూపం దాల్చి విలయ తాండవం చేస్తున్నాయి. అభివృద్ధి, ఫ్యాషన్, సౌకర్యాలు పేరిట మనం చేస్తున్న విధ్వంసానికి.. భూమాత పరిరక్షణకు వెలకట్టలేని ప్రకృతి సంపదను కాపాడుకోవడం ఒక్కటే మార్గం. ఆస్ట్రేలియా, అమెజాన్‌ అడవుల కార్చిచ్చు, జపాన్‌ అణు రియాక్టర్ల పేలుడు, ఇండోనేషియా సునామీతో మనందరికీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సప్త వర్ణాల పుడమిని, మీరు మురిపెంగా పెంచుకునే టామీని, మీతో ఊసులాడే రంగురంగుల పక్షులను మన భవిష్యత్తు తరాలకు  కానుకగా ఇవ్వాలంటే కొన్ని సౌకర్యాలను త్యాగం చేయాల్సిందే.
సంజయ్‌ శంకా, జర్నలిస్టు మొబైల్‌ : 88972 72199

మరిన్ని వార్తలు