కార్పొరేట్ల లాభాలకే విత్తన చట్టం!

11 Dec, 2019 00:55 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం 2019 ముసాయిదాను విడుదల చేస్తూ నవంబర్‌ 15 నాటికి సూచనలు, సలహాలు, సవరణలు పంపాలని వెబ్‌సైట్‌లో పెట్టారు. చిత్తశుద్ధిలేని ప్రభుత్వం విత్తన బిల్లు తేవడానికి 2004 నుండి మల్లగుల్లాలు పడుతూనే వుంది. విత్తన కార్పొరేట్లకు లొంగి ప్రభుత్వాలు విత్తన చట్టం చేయడానికి ముందుకు రావడం లేదు.  

ఇదే సందర్భంలో దేశీయ పరిశోధనల వల్ల విత్తనోత్పత్తి భాగా పెరిగింది. 1995లో దేశంలో ప్రవేశపెట్టిన సరళీకృత వ్యవసాయ విధానాల వల్ల, డబ్ల్యూటీఓ షరతులు అమలు జరపడం వల్ల విదేశీ బహుళజాతి సంస్థలు తమ టెక్నాలజీతో వచ్చి ఇక్కడ విత్తనం ఉత్పత్తి చేయడమే కాక రైతులు వాణిజ్య పరంగా సాగుచేయడానికి విత్తనాలను అమ్ముతున్నారు. ప్రస్తుతం మోన్‌శాంటో, డూపాయింట్, సింజెంటా, కార్గిల్‌ లాంటి కంపెనీలు భారతదేశంలో 20 శాతం విత్తనాలు అమ్ముతున్నాయి.

లాభాలు ఆశిస్తున్న బహుళజాతి కంపెనీలు రైతులకు నాణ్యతలేని విత్తనాలను, కల్తీ విత్తనాలను సరఫరా చేసి వేల కోట్లు లాభాలార్జిస్తున్నారు. ఏటా ఉభయ తెలుగు రాష్ట్రాలలో 5.6 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతింటున్నాయి. దీనిపై రైతు సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేసి, మారిన పరిస్థితులకు అనుగుణంగా విత్తన చట్టం తేవాలని కోరారు. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం విత్తన ముసాయిదా చట్టం తెచ్చింది. దానికి రైతులు, రైతు సంఘాలు, లా కమిషన్‌ చేసిన  సూచనలను జతపరిచి బిల్లుగా రూపొందించి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందకుండా బహుళజాతి సంస్థలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, ఆమోదాన్ని నిలిపివేశారు. 

ఆ తర్వాత రైతుల ఆందోళన ఫలితంగా 2010లో మరొకసారి సవరణలతో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మళ్లీ అదే ఒత్తిడి రావడంతో బిల్లును ఆమోదానికి పెట్టలేదు. రాజ్యాంగంరీత్యా విత్తన చట్టం రాష్ట్ర ప్రభుత్వాలు తేవాలి. కానీ కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చి వారు చేయకుండా తానే చేస్తానని అన్ని రాష్ట్రాలను ఆదేశిస్తూ లేఖలు రాసింది. అయినప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతు సంఘం ఆందోళన ఫలితంగా 2012లో శాసనసభలో బిల్లును  ప్రవేశపెట్టింది. తరువాత కేంద్రం ఒత్తడితో రాష్ట్రం బిల్లును ఉపసంహరించుకుంది. 2015లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముసాయిదాను చర్చల కోసం సూచనలు చేయాలని విడుదల చేసింది. కానీ శాసనసభలో నేటికి పెట్టలేదు. 

తిరిగి 2019 విత్తన ముసాయిదాలో కార్పొరేట్‌లకు స్వేచ్ఛ కల్పిస్తూ,  రైతులు నష్టపోయిన ఎడల వినియోగదారుల కోర్టుకు వెళ్లమని బిల్లులో పెట్టింది. గత పదేళ్లలో వరంగల్, గుంటూరు వినియోగదారుల కోర్టుల్లో వేలాది కేసులు వేయడం జరిగింది. 80 శాతం కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తీర్పు వచ్చిన 20 శాతం కేసులపై కంపెనీలు హైకోర్టులో అప్పీల్‌ చేశాయి. మొత్తంపై కంపెనీలు పరిహారం నుంచి తప్పించుకున్నాయి. కోరలు తీసిన ఈ బిల్లు రైతులకు ఏమాత్రం ఉపయోగపడదు. బహుళజాతి సంస్థలకు లాభాలు తెవడానికి మరోవైపున రైతులకు బిల్లు తెచ్చామని చెప్పుకోవడానికి ఉభయతారకంగా ఈ బిల్లు తెచ్చారు.

వ్యాసకర్త
సారంపల్లి మల్లారెడ్డి, 
అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు,

మొబైల్‌ : 94900 98666 

మరిన్ని వార్తలు