విషమ పరీక్షలు

31 Mar, 2018 01:55 IST|Sakshi

అక్షర తూణీరం
రెండు వారాలపాటు దేశ పార్లమెంటులో ఒక తీర్మానం బరిమీదకు రాకుండా చేశారే? మోదీ తెలుగు ప్రజల్ని అంచనా వేయడంలో పొరపాటు పడలేదు కదా?

ఒక్కోసారి ఇలాగే దారుణంగా ఉంటుంది. నిన్న ఇస్రో సాధించిన ఘన విజయాన్ని ఆస్వాదించి ఆనందించి ఆ స్ఫూర్తిని సంపూర్తిగా మన యువతకు, బాలలకు అందించాల్సిన సందర్భంలో అవాకులు చెవాకులు అదే పనిగా వింటున్నాం. మిగతా అవినీతులు ఎట్లా ఉన్నా, కనీసం దిగువ స్థాయి నించి పై స్థాయి దాకా జరిగే పరీక్షల్ని లీకుల బారిన పడకుండా, సజావుగా నిర్వహించుకోలేక పోతున్నాం. పెద్దలంతా విద్యార్థి దశనించి వచ్చినవారే. ఒకసారి పరీక్షలు అయిపోయాక విద్యార్థులు ఒక దీక్షలోంచి లేదా ఒక ట్రాన్స్‌లోంచి దిగిపోతారు. మళ్లీ ఎక్కడో లీక్‌ అంటారు. ప్రశ్నపత్రాలు పునర్లిఖితమవుతాయి. హాయిగా ఊపిరి పీల్చుకున్న మెదళ్లు ఒక్కసారి ఉలిక్కిపడతాయి. 

అయితే జరిగిన పరీక్షలు ఒక కలా అనుకుంటారు. మళ్లీ కాడి భుజాన వేసుకుంటారు నిర్లిప్తంగా. ఏ మాత్రం ఉత్సాహం ఉండదు. ఉల్లాసం ఉండదు. యువత మనస్సుల్లో కసి, కార్పణ్యం తప్ప పాఠాలుండవ్‌. ఎవరో చేసిన తప్పుకి మాకేంటి ఈ శిక్ష అని వాపోతారు. అసహాయంగా తిట్టుకుంటారు. పాలనా యంత్రాంగాన్ని శపిస్తారు. దేశంమీద గౌరవం ఒక్కసారిగా సన్నగిల్లుతుంది. పరీక్షలు అయ్యాక నిజంగా అయిపోయాయని విద్యార్థులు అనుకుని కంటినిండా నిద్రపోయే శుభ ఘడియలు ఎప్పటికి వస్తాయో? ఎజెండాలో పెట్టండి. 

ఏ పార్టీ అయినా దీనిపై హామీ ఇవ్వండి. దీనికి వేరే శిక్షలుండాలి. ‘నరకంలో ఉంటాయని చెప్పుకునే శిక్షల్ని కారకులపై బహిరంగంగా అమలుచేసి మాకు కాస్తయినా ఊరట కల్పించాలని’ లీకులకు బలి అయిన విద్యార్థులు, వారితోపాటు శ్రమించిన వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. లేదంటే పరీక్షల నిర్వహణ బరువు బాధ్యతల్ని డిఫెన్స్‌ శాఖకు అప్పగించండని సలహా ఇస్తున్నారు. నిజం. వీట న్నింటి గురించి కొంచెం ఆలోచించి మాట్లాడుకోవడానికి మనకి వ్యవధి లేదు.

ఒక దేశ భక్తుడు. ఒక తెలుగువాడు దేశ ముఖ్యమైన మూడు కళ్లల్లో ఒకటైన న్యాయ వ్యవస్థలో తేనెపట్టులో ఉన్నన్ని రంధ్రాలున్నాయని ఎత్తిచూపుతుంటే– మన మేధావులకు గళం ఎత్తే తీరికలేదు. ధర్మపీఠం బీటలు వారుతోందని సాక్షాత్తూ ఒక న్యాయమూర్తి పదే పదే హెచ్చరిస్తుంటే– ఎవరూ పలకరేం? ఇంత ఉదాసీనత దేశ దౌర్బల్యమేమోనని భయంగా ఉంది. రెండు వారాలపాటు దేశ పార్లమెంటులో ఒక తీర్మానం బరిమీదకు రాకుండా చేశారే? చాలా ఘోరం! మన ప్రియతమ ప్రధాని తొలినాడు పార్లమెంటు భవన సోపానాలకు భయభక్తులతో శిరసువంచి నమస్కరించడం నిన్న మొన్నటి దృశ్యంలా ప్రజల కళ్లముందు కదుల్తోంది. అందుకే మోదీపట్ల ఒక విశ్వాసాన్ని అభిమానాన్ని జనం పెంచుకున్నారు. 

గొప్ప ప్రధాని మెజార్టీ చూసి పొంగిపోడు. బలవంతులు ఎందరున్నా, తల్లి బలహీనుడైన బిడ్డమీదే మమకారం చూపుతుంది. తప్పిపోయిన గొర్రె కోసమే కాపరి తపిస్తాడు. మోదీ తెలుగు ప్రజని అంచనా వేయడంలో పొరపాటు పడలేదు కదా? నాడు తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన అల్లూరి ఈ భూమి పుత్రుడే.భారత జాతిని సమైక్యం చేసి నడిపిస్తున్న మన త్రివర్ణ జాతీయ పతాకాన్ని రూపుదిద్దిన అమృతమూర్తి పింగళి వెంకయ్య ఇక్కడివాడే. ఇంకా వివరాలు తెలుసుకోండి– సకాలంలో సరైన నిర్ణయం తీసుకోండి.


-శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు