స్త్రీలు పిల్లల్ని కనే యంత్రాలేనా?

30 Aug, 2018 00:38 IST|Sakshi

ప్రపంచం ఆర్థికవృద్ధి రేటు లెక్కల్లో తలమునకలవు తోంది. వృద్ధి  కొలబద్దలతోనే అభివృద్ధిని లెక్కి స్తోంది. స్త్రీల భాగస్వామంతో స్థూల జాతీయోత్పత్తి పెంచుకోవడంపై రకరకాల విశ్లేషణలు జరుపుతోంది. పలు సంస్థలు ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెంచడంలో, అభివృద్ధి చర్చలో  స్త్రీల పాత్ర ఎంత కీలకమో లెక్కలేసి చెబుతున్నాయి. ఇంకోవైపు– స్త్రీలను ఇంటికే పరిమితం చేసే, ఆమె చోటును కుదించే కుట్రలూ అంతే స్థాయిలో జరుగుతున్నాయి. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ అయిన జపాన్‌ రాజధాని టోక్యోలో అలాంటి ఓ పెద్ద కుట్ర జరిగిందిప్పుడు. పథకం ప్రకారం వేలాది మంది మహిళల్ని వైద్యవిద్యకు నిరాకరించిన ఆ కుట్ర రాజకీయంపై అంతర్జాతీయ మీడియాలో చర్చ జరుగు తోంది.

పెళ్లి తర్వాత లేదా  బిడ్డలు పుట్టాక చాలామంది స్త్రీలు ఉద్యోగాలు మానేస్తుంటారు కాబట్టి, వైద్యవిద్య కోర్సుల్లో చేరకుండా వారిని సాధ్యమైనంత మేరకు కుదిస్తోంది టోక్యో మెడికల్‌ యూనివర్సిటీ.  ప్రవేశ పరీక్షల్లో వారిని తప్పిస్తోంది. అమ్మాయిల ప్రవేశా లకు 30 శాతం మేర గండికొడుతోంది. అర్హతతో నిమిత్తం లేకుండా అబ్బాయిల సంఖ్యను పని గట్టు కుని మరీ పెంచుతోంది. లంచం తీసుకుని కొందరికి  49 పాయింట్ల్ల వరకూ కలిపింది. మూడుసార్లు తప్పిన విద్యా మంత్రిత్వ శాఖాధికారి కొడుక్కి ప్రవేశం కల్పించినట్టు వచ్చిన ఆరోపణలపై వర్సిటీ జరిపించిన దర్యాప్తులో ఈ కుంభకోణం బట్టబయ లైంది. 2006 లేదా అంతకంటే ముందు నుంచీ ఈ కుట్ర రాజకీయం కొనసాగుతున్నట్టు తేలింది. మొదట అక్రమాలేవీ జరగలేదని బుకాయించిన అధి కారులు.. తర్వాత జనాగ్రహానికి తలొగ్గారు. స్కూలు మేనేజింగ్‌ డైరెక్టర్‌ టెట్సో యుకియోకా విలేకరుల సమావేశం పెట్టి  క్షమాపణ కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని మొత్తం 81 మెడికల్‌ స్కూళ్ల ప్రవేశ తీరుతెన్నులపై విద్యాశాఖ విచారణ చేప ట్టింది. గత ఆరేళ్ల దరఖాస్తుల తాలూకూ డేటా రాబట్టే పనిలో పడింది. ప్రవేశాల్లో స్త్రీ పురుష నిష్పత్తి కోణం నుంచీ పరిశీలన జరుపుతామంటున్నారు విద్యాశాఖ అధికారులు. జపాన్‌లో ఇలాంటి విచా రణ దేశవ్యాప్తంగా జరగడం ఇదే మొదటిసారి.

జపనీయ సమాజంలో పాతుకుపోయిన తీవ్ర వివక్షకు టోక్యో వర్సిటీ  కుంభకోణం ఒక పెద్ద ఉదాహరణ. లింగ సమానత్వ మంత్రిత్వ శాఖ, సమాన ఉద్యోగావకాశాల చట్టం అక్కడ అలంకార ప్రాయమే. జాతీయ వైద్య పరీక్షల్లో నెగ్గుతున్న మహిళలు గత ఇరవై ఏళ్లలో 30 శాతం మించక పోవడం వెనుక,  మహిళా వైద్యులు నమ్మదగినవారు కాదనే భావన వ్యాపించడం వెనుక ఉన్నది కచ్చి తంగా వ్యవస్థాగత కుట్రే. స్త్రీలకు పనులివ్వడంలో, వారి నైపుణ్యాలను గుర్తించడంలో తీవ్ర వివక్ష కనబరుస్తున్న కంపెనీలను కట్టడి చేయగల వాతావరణమూ లేదక్కడ. ఓవైపు– స్త్రీల జీవితాలను వెలిగించగల దేశంగా, వ్యవస్థలో వారి భాగస్వామ్యం పెంచే దిశగా జపాన్‌ను తీర్చి దిద్దుతామంటున్నారు ప్రధాని షింజో అబే. మరో వైపు – స్త్రీ పురుషుల మధ్య అంతరాలు మరింతగా పెరుగుతున్నాయి.  వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ రూపొందించిన జండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌ ప్రకారం– పదేళ్ల కిందట 144 దేశాల్లో 80వ స్థానంలో ఉన్న జపాన్‌.. 2017లో 114వ స్థానానికి దిగజారింది. రాజకీయ సా«ధికారత విషయంలో క్షీణత నమోదైంది. సామాజిక విశ్లేషకుల ప్రకారం–ఆర్థిక కార్యకలాపాల్లో స్త్రీల  భాగస్వామ్యం పెరిగినప్పటికీ, పదోన్నతుల్లో, వేతనాల్లో వివక్ష కొనసాగుతోంది. పురుషులతో పోల్చుకుంటే స్త్రీలకు సగటున 33 శాతం తక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్టు ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాన్ఫెడరేషన్‌ తాజా నివేదిక చెబుతోంది. దాదాపు ఏ ఒక్క దేశమూ ఈ అణచివేతకు అతీతం కాదని అధ్యయనాలు చెబు తున్నాయి.

ఐక్య రాజ్యసమితి ప్రకారం – నాలుగు కోట్లకు పైగా జనాభా వున్న 32 దేశాల్లో అతి తక్కువ పిల్ల లున్న దేశం జపాన్‌ (12.3%). ఈ లోటు ఆర్థిక వృద్ధిని దెబ్బ తీస్తుందంటున్న ప్రభుత్వం–  జననాల రేటు పెంచాల్సిన అతి పెద్ద కర్తవ్యాన్ని స్త్రీలపై మోపింది. ఒంటరి స్త్రీలు ఆర్థిక వ్యవస్థకు భార మంటున్నారు అధికార పార్టీ ఎంపీ కంజి కటో. స్త్రీలు కనీసం ముగ్గురు పిల్లల్ని కని తీరాలని చెబు తున్నారు. గతంలో ఆరోగ్యమంత్రిగా పనిచేసిన హకువో యనజినవా.. స్త్రీలను ‘పిల్లల్ని కనే యంత్రాలు’గా వ్యాఖ్యానించారు. పిల్లల సంరక్షణ చూసుకునే డే కేర్‌ సెంటర్లు పెంచడంపై ఇటీవల కాలం వరకూ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. 2017 ఏప్రిల్‌ నాటికి 26000 మంది పిల్లలు అ«ధీకృత డే కేర్‌ సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నట్టు జపాన్‌ పత్రికలు చెబు తున్నాయి. మొత్తంగా మార్కెట్‌ యావలో కొట్టుకు పోతున్న దేశాలకు మహిళల హక్కులూ అవసరాల గురించిన స్పృహే లేకుండాపోతోందని ఈ పరిణా మాలు రుజువు చేస్తున్నాయి. అసమానతల్ని పెంచు తున్న ఇలాంటి అభివృద్ధి నమూనాల్ని దేశాలు సమీ క్షించుకోవాల్సివుంది.
వి. ఉదయలక్ష్మి, సాక్షి ప్రతినిధి
 

మరిన్ని వార్తలు