నూతన ప్రభుత్వానికో ప్రేమలేఖ!

4 Dec, 2023 05:07 IST|Sakshi
తెలంగాణ సచివాలయం

అభిప్రాయం

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలుస్తాయా? లేదా ప్రజలు గెలుస్తారా? ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే రాబోయే ఐదేళ్ళు రాజకీయం, పౌరసమాజం మధ్య వైరుద్ధ్యాలు తలెత్తకుండా మరిన్ని విజయాలు సాధించవచ్చు. రాబోయే లోక్‌సభ, స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకోకపోతే దేశవ్యాప్త అపజయానికి దారి తీసినట్టే!

ఓట్లు వేయించుకునేది రాజకీయ నాయకులు. వేసేది ప్రజలు. ఒక్కోసారి ఒక్క ఓటు కూడా ప్రభావం చూపుతుంది. అంతటి ప్రాధాన్యం ఓటుకు ఉంది. అందుకే ప్రజల పాత్రకు విలువ. పార్టీల జయాపజయాలను నిర్ణయించేది ప్రజలే! అటువంటి ప్రజలను విస్మరించిన పార్టీలకు అపజయం తప్పదు. తప్పటడుగులు వేస్తే, అధికారం హక్కుభుక్తమని విర్రవీగితే... ఇవాళ గెలిచిన పార్టీకి కూడా రేపు ఇదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే విజయానంతర పరిస్థితి రాబోయే విజయానికో, అపజయానికో భూమిక అవుతుంది.

గతం నాస్తి కాదు. అది దారి దీపం. ఈ దీపం వెలుగుతూనే ఉండాలంటే సుపరిపాలన, ప్రజా దృక్పథం, జన సంక్షేమం అనే చమురు నిరంతరం పడుతుండాలి. తెలంగాణ ప్రజాకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలతో పాటు నడిచిన నాయకత్వానికి ప్రజలు అండదండలు అందించారు. 1200 మంది బలిదానాల పునాది మీద అధికారం చేజిక్కించుకుని వారి పాత్రను, ముఖ్యంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ లాంటి అనేకమంది పాత్రను కావాలని విస్మరించి తామే తమ కుటుంబం త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించామని విర్రవీగుతూ ప్రజలనూ, పౌర సమాజాన్నీ అవమానించినందుకు నిశ్శబ్ద నిరసనే తాజా తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల సరళిగా భావించాలి.

గమనిస్తే... ఏక కుటుంబ పాలన తెలంగాణ ప్రజలను అసహ్యించుకునేలా చేసింది. అంతేకాదు. తాము చేసిన ప్రతి తప్పునూ ఆ నలుగురు మైకుల ముందు, పత్రికా ప్రకటనల రూపంలో ఊదరగొట్టడం అసహ్యించుకున్నారు. అలాంటి ధోరణికి దూరంగా ఉండాలి. తాము చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టుగా విర్రవీగే తత్వం ప్రజలను దాదాపుగా ప్రతిఘటించేట్లుగా చేసింది. అయితే ఊరిలో దొర మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే తమను వ్యతిరేకించే వారు పుట్టి ఉండరు అని అనుకుంటారు.

ప్రజలు కట్టిన డబ్బును పట్టుకొని... తమ సొంత డబ్బు ఇస్తున్నట్టుగా సంక్షేమ పథకాల పంపిణీలో ప్రతిబింబించింది. ఆ పథకాల గురించి వేల కోట్ల రూపాయల ప్రకటనలు గుప్పించడంలో కూడా తమ ఫోటోలు, వ్యక్తిగత ప్రచారాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిసి కూడా వ్యక్తిగత అహంభావం వల్ల సవరించుకోలేదు.

కొత్త ప్రభుత్వం ఏర్పాటులో, తదనంతర పాలనలో... దళితుల, ఆదివాసీల, వెనకబడిన వర్గాల ప్రయోజనాలను నెరవేర్చాలి. ఎందుకంటే ఈ పదేళ్ళ పాలనలో వారు వంచించబడ్డారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్న దగ్గర నుండి, ‘దళిత బంధు’ స్కీమ్ వరకు అడుగడుగునా మోసగింపునకు గురయ్యారు. వోటు బ్యాంక్‌గా వారిని వాడుకున్నారు. దళితులలో గల రెండు ప్రధాన కుల సమాజాలను విడదీసి ఒక వర్గాన్నే చేరదీసిన ఫలితమే... ఎస్టీ నియోజకవర్గాలలో ఫలితాలు!

అలాగే ఆదివాసుల బతుకులు ఆగమాగం చేయబడ్డాయి. ఆదివాసీ తెగల మధ్య వైషమ్యాలు తలెత్తినప్పుడు ఒక తెగ వైపే మద్దతునిచ్చి మిగతా 17 తెగ, ఉప తెగలను వంచించారు. పోలీసు, అటవీ శాఖల వంటివి వారిని అగౌరవపరిచాయి. వారి భూములను లాక్కున్నాయి. బతికే స్వేచ్ఛను హరించింది ప్రభుత్వం. నాలుగేళ్ల క్రితం అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ నుండి అడవులకు వెళ్లి ప్రత్యక్ష పరిశీలన జరిపి పోడు సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన అధినాయకుడు తీరా వారి గురించి మాట్లాడడం మరిచాడు.

మేడారంలో జరిగే ‘సమ్మక్క – సారక్క’ జాతరకు వెళ్ళి మొక్కులు చెల్లించలేదు. అలాగే గోండుల ఆరాధ్య దైవం ‘నాగోబా’ జాతరకు కూడా వెళ్ళలేదు. తెలంగాణ వచ్చాక, అంతకు ముందు కన్నా వారి జీవితంలో ఎలాంటి మార్పూ లేదు. పైగా అవమానాలు పెరిగాయి. అందుకే ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో గులాబీ జెండా అవనతం అయింది. ఇతర ఆదివాసుల పేరుతో ఎన్నికల్లోనూ, సంక్షేమ పథకాల్లోనూ అన్యాయం జరిగింది.

తెలంగాణ అస్తిత్వ చైతన్యం భావన మరింత పెరుగుతుంటే దాన్ని త్రుంచివేయడం జరిగింది. ప్రపంచ మహాసభల్లో వంద పైగా కోట్ల డబ్బు పంచుకున్నారే తప్ప భాషకూ, సంస్కృతికీ, సాహిత్యానికీ ఒరిగిందేమీ లేదు. భాషా సాంస్కృతిక శాఖ రాజకీయ నేతలకు ఊడిగం చేసింది. కోట్ల రూపాయలతో నిర్వహించిన కార్యక్రమాలు రాజకీయ నాయకుల ప్రాబల్యం పెంచుకోవడానికి పనికొచ్చాయి.

ఏ ఒక్క ప్రజా కళారూపాన్నీ బతికించి దేశవ్యాప్త కీర్తినీ, వైభవాన్నీ చాటలేదు. పనికిరాని పుస్తకాలను అచ్చువేసి రాజకీయ నేతలకు ఉచితంగా పంచిపెట్టారే తప్ప ప్రజలలోకి తీసుకెళ్ళలేదు. వాటికోసం చేసిన ఖర్చు దుబారా చేశారు. ఎన్నో ప్రతులు పంచిపెట్టి ప్రజల సొమ్ముని పట్టపగలు దుర్వినియోగం చేశారు. ఈ దుర్వినియోగంపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కొత్త ప్రభుత్వం ఇలాంటి విషయాల పట్ల జాగరూకత వహించాల్సి ఉంది.

ప్రతి మూడేండ్లకో, ఎక్కువలో ఎక్కువ ఐదేండ్లకో అధికారుల, ఉద్యోగుల బదిలీలు జరగాల్సిందే! అలా జరపకపోవడం వల్ల ప్రజలకు న్యాయం జరగదు. ఒకేచోట తిష్ఠ వేసుకునే ఉద్యోగుల వల్ల ప్రజలు ఎనలేని కష్టాలు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రే కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో ఒకరోజు ప్రజా దర్బారు ఏర్పాటు చేయాల్సిందే! ముఖ్యంగా కలెక్టర్లు కూడా! పౌర సమాజాన్ని సంప్రదిస్తూ పోవాలె తప్ప మేమే గొప్ప అనే భావనను దూరం చేయకపోతే వ్యక్తిగత అహంభావం పెరిగి ప్రభుత్వానికి ప్రజలు దూరం అవుతారు. ‘ధరణి’ వంటి పాపాల పుట్ట పనిపట్టకపోతే చిన్న రైతు, చిన్న ఇళ్ళు కట్టుకునే వారికి న్యాయం జరగదు. ప్రగతి భవన్‌ను ప్రభుత్వాసుపత్రిగానో, ప్రజా కళల మ్యూజియంగానో మార్చాలి.

నీటి ప్రాజెక్టులలో ఆర్థిక దుర్వినియోగాన్నీ, అలసత్వాన్నీ వెలికి తీయాలి. తెలంగాణ ప్రాధికార సంస్థను ఏర్పాటుచేసి ప్రొఫెసర్‌ కోదండరావ్‌ు వంటి వారి సలహా సూచనలనూ, రికమెండేషన్స్‌నూ అమల య్యేలా చూడాలి. ‘తెలంగాణ ఇచ్చింది మేమే’ అని చెప్పుకోవడం కాదు. ‘మాకు అధికారం వచ్చాక చూడండి... ఇంతలా అభివృద్ధి చేశాం’ అని చెప్పుకునే రీతిలో అభివృద్ధి జరగాలి.

ఓట్లు ఏ ఒక్క కులం వారు వేస్తే ప్రభుత్వం గద్దెనెక్కలేదు. అన్ని కులాలకూ ప్రాతినిధ్యం కల్పించాలి. దొరల రాజ్యం పోయి పటేళ్ళ రాజ్యం వచ్చిందని అనుకోకుండా చూడాలి. పెనం మీంచి పొయ్యిలో పడ్డామని ప్రజలు అనుకొనే పరిస్థితి రాకూడదు. కర్నాటక, తెలంగాణల్లో లాగా  కాంగ్రెస్‌ వస్తే ఇలా బాగుపడతాం అని అన్ని రాష్ట్రాల ప్రజలూ చెప్పుకోవాలి. తెలంగాణను దేశ ప్రజలు గర్వించే రీతిలో అభివృద్ధిపరచాలి.
ప్రొ‘‘ జయధీర్‌ తిరుమలరావు 
– వ్యాసకర్త జానపద పరిశోధకుడు, సామాజికవేత్త,  మొబైల్‌ – 9951942242

>
మరిన్ని వార్తలు