అండా సెల్‌ నుంచి అమ్మకు..!

11 Jan, 2018 03:51 IST|Sakshi

అమ్మా నాకోసం దుఃఖించకు నువ్వు నన్ను చూడటానికి వచ్చినపుడు ఫైబర్‌ గాజుకిటికీలో నుంచి నీ ముఖం నేను చూడలేకపోయాను .నువ్వు నా వైకల్యం చెందిన దేహాన్ని చూడగలిగి ఉంటే నేనింకా బతికే ఉన్నానని నువ్వు నిజంగా నమ్మి ఉండేదానివి అమ్మా నేను నీ దగ్గర లేనందుకు దుఃఖించకు నేను ఇంట్లో ఉన్నప్పుడు బయట ప్రపంచంలో నాకు చాలామంది మిత్రులున్నారు

నేనీ జైల్లో అండా సెల్‌లో బంధించబడినాక విశ్వమంతా నాకింకెంతో మంది నేస్తాలు లభించారు. అమ్మా క్షీణిస్తున్న నా ఆరోగ్యం గురించి దిగులుపడకు నా బాల్యంలో నాకొక కప్పు పాలు కూడ నువ్వు సమకూర్చలేనప్పుడు నువ్వు నీ శక్తితో, ధైర్యంతో కూడిన మాటలతో నన్ను కుడిపావు ఇప్పుడీ బాధలో వేదనలో నువ్విచ్చిన ఆశ్వాసంతోనే నేను మరింత శక్తిమంతుణ్ణవుతున్నాను

అమ్మా నీ ఆశల్ని వదులుకోకు జైలు నాకు మరణం కాదు పునర్‌ జననం అని నేను అర్థం చేసుకున్నాను నేను ఇంటికి తిరిగి వస్తాను నాకు ఆశను ధైర్యాన్ని ఇచ్చి పోషించిన నీ ఒడిలోకి

అమ్మా
నా స్వేచ్ఛ గురించి భయపడకు నేను పోగొట్టుకున్న స్వేచ్ఛ ఎంతోమందిని పొందిన స్వేచ్ఛ అభాగ్యజీవులకు అండగా నాతోపాటు నిలబడటానికి వస్తున్న ప్రతి ఒక్కరిలో నేను నా స్వేచ్ఛను పొందుతున్నాను

(2017 నవంబర్‌ 14న ములాఖత్‌లో నువ్వు వచ్చి జైలు కిటికీ దగ్గర నిలబడిపోయాక)
నీకోసం ఇది ఎవరైనా అనువదిస్తారని ఆశిస్తాను. అమ్మా నువు అర్థం చేసుకోలేని విదేశీ భాషలో రాస్తున్నందుకు క్షమించు. నన్నేం చేయమంటావు? నా శిశుత్వంలో నీ ఒడిలో నాకు నువ్వు నేర్పిన తియ్యని భాషలో రాయడానికి నాకు ఇక్కడ అనుమతి లేదు.

ప్రేమతో నీ శిశువు, 
జి.ఎన్‌. సాయిబాబా, 
అండాసెల్, కేంద్ర కారాగారం, 
నాగపూర్‌
– తెలుగు సేత: వరవరరావు

మరిన్ని వార్తలు