ఐదుకోట్లమంది కోసం ఐదుగురి త్యాగం

7 Apr, 2018 01:21 IST|Sakshi

సందర్భం 

ఐదుకోట్లమంది ప్రజల క్షేమం కోసం ఐదుమంది ఎంపీలు చేసిన పదవీ త్యాగం దేశరాజకీయాల్లో సరికొత్త పరిణామంగా ప్రజలు కొనియాడుతున్నారు. లక్ష్య సాధనలో తమ నిబద్ధతను రాజీనామాలతో ప్రదర్శించిన వైఎస్సార్సీపీ ఎంపీలు చరిత్రాత్మక క్షణాలకు సాక్షీభూతులయ్యారు.

ప్రత్యేక హోదా కోసం వారాల తరబడి దేశరాజధానిలో జరుగుతున్న పోరాటం పార్లమెంటు నిరవధిక వాయిదాతో మూలమలుపు తీసుకుంది. శుక్రవారం ఉదయం లోక్‌సభ స్పీకర్‌కు తమ రాజీనామా పత్రాలను సమర్పించిన వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డి ఏపీ భవన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 2:02 గంటలకు నిరాహార దీక్షను ప్రారంభించారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఆ ఉద్యమ తీవ్రతను నీరు గార్చడానికి పోటీ యాత్రలు మొదలుపెట్టాలని చూస్తున్నా, ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేస్తున్న నిరాహార దీక్షకు ఏపీలోని 3 ప్రాంతాల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించడం విశేషం. ఐదుకోట్లమంది ప్రజల క్షేమం కోసం ఐదుమంది ఎంపీలు చేసిన పదవీ త్యాగం దేశరాజకీయాల్లో సరికొత్త పరిణామంగా ప్రజలు కొనియాడుతున్నారు. 

ప్రత్యేక హోదా ఉద్యమానికి సంబంధించినంతవరకు వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామా ఒక చారిత్రక ఘట్టాన్ని తలపించింది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమ సమయంలో ప్రతిపక్ష సభ్యులు మూకుమ్మడిగా తమ సభ్యత్వాలకు రాజీ నామా సమర్పించిన ఘటన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా నినాదంతో అయిదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించడం ఇదే తొలిసారి. రాష్ట్ర ప్రయోజనాలకోసం పదవులను తృణప్రాయంగా త్యజించిన ఘటన ఏపీ చరిత్రలో అపూర్వమనే చెప్పాలి. ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం, మరోవైపు పచ్చమీడియా ఎన్ని విషప్రచారాలు చేసినా, ఎన్ని అభాండాలు మోపినా చివరివరకూ సహించి లక్ష్య సాధనలో తమ నిబద్ధతను రాజీనామాలతో ప్రదర్శించిన వైఎస్సార్సీపీ ఎంపీలు చరిత్రాత్మక క్షణాలకు సాక్షీభూతులయ్యారు.

కానీ ఈ సందర్భంగా కొన్ని అంశాలను నిక్కచ్చిగా బహిర్గతం చేయాల్సిన అవసరముంది. ప్రత్యేక హోదా సాధనకోసం వైఎస్సార్సీపీ అడుగు ముందుకువేసిన ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం, పచ్చమీడియా సరేసరి... జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తనవంతుగా అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించడం రాష్ట్ర ప్రజలను తీవ్ర అనుమానాల్లోకి నెడుతోంది. హోదా ఉద్యమం కీలకఘట్టం చేరుకున్న ఈ తరుణంలో తెలుగుప్రజలు కలిసికట్టుగా ఉండాల్సిన సమయంలో, హోదా సాధన వైపే ప్రజలను నడిపించాల్సిన సమయంలో, ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలకు మద్దతునివ్వడానికి బదులుగా ఆ చారిత్రక పోరాటం ప్రాధాన్యాన్ని పలుచన చేసేలా పవన్‌ వ్యవహరించడం సబబేనా? అనే ప్రశ్న ప్రజల్లో కలుగుతోంది. వైఎస్‌ జగన్‌ ప్రత్యేక హోదాపై పోరాడు తున్న ప్రతి సందర్భంలోనూ బాబుకు వత్తాసుగా నిలిచిన పవన్‌.. ఇప్పుడు వామపక్షాల మద్దతుతో ఉద్యమ శక్తుల మధ్య అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించడం గమనార్హం. 

మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమ ఎంపీలతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిస్తే తాము మద్దతు పలుకుతామని ప్రకటించిన పవన్‌ తర్వాత వైఎస్‌ జగన్‌ అవిశ్వాస తీర్మానానికి అంగీకరించాక ఉలుకూ పలుకూ లేకుండా మౌనం వహించడంలో మతలబు ఏమిటి? వైఎస్సార్సీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన శుక్రవారమే పవన్‌ విజయవాడలో పాదయాత్రలు చేపట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వైఎస్సార్‌సీపీ చేస్తున్న న్యాయబద్ధమైన పోరాటం విలువను తగ్గించే ప్రయత్నంలో వామపక్షాలు కలవడం ఏమిటి అన్నది సామాన్యుడి ప్రశ్న.

చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు నిజంగా ప్రాధాన్యమిచ్చి ఉంటే కేంద్రానికి ఎదురు నిలిచి ప్రత్యేక హోదాను సాధించడానికి కృషి చేసి ఉండేది. తానే ముందుండి ప్రతిపక్షాలను కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేది. కానీ ప్రపంచంలోనే లేని అపురూపమైన రాజధానిని నిర్మించాలనే కలలలోకంలో పరిభ్రమిస్తూ నాలుగేళ్ల కాలాన్ని వృధా చేయడమే కాకుండా హోదా కోసం తొలి నుంచి పోరాడుతున్న వైఎస్సార్సీపీపై లేనిపోని నిందలు వేస్తూ ప్రజలను వంచిస్తోంది. పైగా అభివృద్ధి కేంద్రీకరణ విధానంతో మిగతా ప్రాంతాల అభివృద్ధి కుంటుపడటం ద్వారా 13 జిల్లాల రాష్ట్రంలో మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. ప్రజలతో, ప్రజాస్వామ్యంతో ప్రభుత్వాలే చెలగాటమాడటం చాలా ప్రమాదం. ఇది చరిత్ర చెప్పిన సత్యం.

డా. ఎనుగొండ నాగరాజనాయుడు, వ్యాసకర్త విశ్రాంత ప్రధానాచార్యులు
మొబైల్‌ : 98663 22172

మరిన్ని వార్తలు