హోదా.. యోధ | Sakshi
Sakshi News home page

హోదా.. యోధ

Published Sat, Apr 7 2018 1:21 AM

YS Jaganmohan Reddy always fights for AP Special Status from the beginning - Sakshi

ప్రత్యేక హోదా.. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. అది పార్లమెంట్‌ సాక్షిగా దేశ ప్రధాని ఇచ్చిన హామీ.దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేశాయి. అయితే.. ప్రత్యేక హోదా ఉంటేనే హైదరాబాద్‌ను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరుగుతుందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మారు. ‘ప్యాకేజీలతో మోసం చేయొద్దు.. ప్రత్యేక హోదా మా హక్కు’ అని నినదించారు. ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరవని, రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావని, రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ప్రజల్లో చైతన్యం రగిలించారు. కాగా.. ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేదు.. అదేమీ సంజీవని కాదు అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాకు ఆర్థిక సంఘం అడ్డు చెబుతోందని ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వమూ గొంతుకలిపింది. అయితే.. ప్రత్యేక హోదా సంజీవనే అని, అదే మా ఊపిరి అంటూ జగన్‌ దృఢంగా నిలబడ్డారు. ఐదు కోట్ల మంది భవితవ్యానికి అదొక్కటే మార్గమని గట్టిగా విశ్వసించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టకముందే ఆయన్ను జగన్‌ కలుసుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నిటినీ నెరవేర్చాలని అభ్యర్థించారు. నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదా కోసం అనేక రూపాల్లో జగన్‌ పోరాడుతూ వస్తున్నారు. ధర్నాలు, దీక్షలు, రాస్తారోకోలు, కలెక్టరేట్ల ముట్టడి, రాష్ట్ర బంద్‌లు నిర్వహించారు. చివరకు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. పలుమార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలుసుకుని వినతి పత్రాలు అందించారు. వివిధ నగరాల్లో యువభేరి సదస్సులు నిర్వహించి యువతలో చైతన్యం రగిలించారు. తుదిదశ పోరాటంలో భాగంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం, అన్ని పక్షాలనూ ఏకం చేయడం, అంతిమంగా ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం వరకు కొనసాగింది.

ప్రత్యేక హోదా మన హక్కు.. అది ఎవరో వేసే భిక్ష కాదు. హోదా వస్తే రాష్ట్రం ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన పని లేదు. దేశంలోనే నెంబర్‌ 1గా నిలుస్తాం. అందుకే మనం అందరం సమిష్టిగా పోరాడి ప్రత్యేక హోదా సాధిద్దాం.

కేంద్ర పెద్దలకు వినతులు
ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ నాలుగేళ్లుగా దశల వారీగా ఉద్యమాన్ని నడిపించారు. హోదా ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోయే నరేంద్రమోదీని 2014, మే 19న పార్టీ ఎంపీలతో కలసి.. ఏపీకి 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలన్నీ నెరవేర్చాలని, రాజధానికి అధిక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 10 నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ అలక్ష్యం వల్ల హోదా, విభజన హామీల అమలులో ఆలస్యం జరుగుతుండటంతో మళ్లీ 2015, మార్చి 30న, 2017 మే 10న ప్రధానిని కలిశారు. 2015 జూన్‌ 11న ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని, 2016 ఏప్రిల్‌ 26న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ని కలసి విభజన హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని వినతిపత్రాలు సమర్పించారు.

రాష్ట్రపతితో భేటీలు
కేంద్ర ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని సైతం (జూన్‌ 9, 2015, ఫిబ్రవరి 23, 2016, ఆగస్టు 8, 2016) మూడుసార్లు కలసి.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే మూడేళ్లలో పూర్తి చేసేలా చూడాలని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

ధర్నాలు, దీక్షల బాట
ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో వైఎస్‌ జగన్‌ ధర్నాలు, దీక్షల బాట పట్టారు. మొదటగా 2014 డిసెంబర్‌ 5న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. విశాఖలో జరిగిన ధర్నాలో జగన్‌ స్వయంగా పాల్గొన్నారు. తర్వాత 2015 జూన్‌ 3న మంగళగిరిలో రెండు రోజుల సమరదీక్ష చేపట్టారు. బాబు పాలనపై ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు. అదే ఏడాది ఆగస్టులో ఢిల్లీలో తొలిసారిగా జగన్‌ ఒక రోజు ధర్నా చేశారు. మళ్లీ ఆగస్టు 29న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునివ్వగా ప్రజలందరి మద్దతు లభించింది.

ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన వేళ..
ప్రత్యేక హోదా కోసం అవిశ్రాంతంగా పోరాటం సాగిస్తున్న జగన్‌ 2015 అక్టోబర్‌లో ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ప్రధాని మోదీ ఏపీకి రానుండడంతో..  ఏపీ ఆకాంక్ష గురించి ఆయన గ్రహిస్తారని అంతా భావించారు. కానీ ఏడో రోజున రాష్ట్రప్రభుత్వం జగన్‌ను బలవంతంగా ఆస్పత్రికి తరలించి దీక్షను భగ్నం చేసింది.

ఆ తర్వాత జగన్‌ పిలుపుతో అక్టోబర్‌ 17 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు రిలే దీక్షలు చేశాయి. మలిదశ పోరులో భాగంగా 2016, మే 10న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశారు. కాకినాడలో జరిగిన నిరసనలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ స్వయంగా పాల్గొన్నారు. అదే ఏడాది ఆగస్టు 2న, సెప్టెంబర్‌ 10న రాష్ట్రబంద్‌ నిర్వహించారు. 

యువతలో చైతన్యం నింపేందుకు..
హైదరాబాద్‌ను కోల్పోయిన రాష్ట్ర యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కోల్పోయింది. ప్రత్యేక విమానాల్లో రూ.కోట్లు వెచ్చించి దేశాలు తిరగడమే తప్ప ఒక్క పరిశ్రమనూ చంద్రబాబు తీసుకురాలేకపోయారు. ప్రత్యేక హోదా ఉంటే వచ్చే రాయితీలను చూసి పరిశ్రమలు వాటంతటవే తరలివస్తాయని జగన్‌ యువతకు అర్థమయ్యేలా వివరించారు. ముఖ్య పట్టణాలన్నిటిలోనూ యువభేరి సదస్సులు నిర్వహించారు. దీంతో చంద్రబాబు బెంబేలెత్తిపోయారు. యువభేరి సదస్సులకు విద్యార్థులను పంపితే అరెస్టులు చేయిస్తామని తల్లిదండ్రులను బెదిరించారు. పీడీ యాక్టులు పెడతామన్నారు. అయినా వెరవక యువత భారీ స్థాయిలో యువభేరి సదస్సులకు పోటెత్తింది.

పార్లమెంటులో వైఎస్సార్‌సీపీ ఎంపీల పోరాటాలు..
పార్టీ ఎంపీలు రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్,  అవినాశ్‌రెడ్డి, మిథున్‌ రెడ్డి, విజయసాయిరెడ్డిలు పార్లమెంటులో జరిగిన చర్చల్లో హోదా ఆకాంక్షను వెలిబుచ్చారు. 2014 జూన్‌ 12న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చల్లో హోదా ఇవ్వాల్సిందేనని కోరారు. తర్వాత 2015 ఫిబ్రవరి 16న బడ్జెట్‌పై జరిగిన చర్చల్లోనూ ఎంపీలు చురుగ్గా పాల్గొన్నారు. 2016 జూలై 23న ఏపీకి 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రతిపాదించారు. 2017 మార్చిలో మరోసారి ప్రైవేటు బిల్లు పెట్టారు. 2017 మార్చి 28న ఎన్‌ఐటీపై, 30న ఆర్థిక బిల్లుపై, ఏప్రిల్‌ 6న జీఎస్టీపై జరిగిన చర్చల్లో హోదాను డిమాండ్‌ చేశారు. జూలైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ ఇదే అంశాన్ని లేవనెత్తారు. 

తుది పోరు..
హోదా సాధనలో చంద్రబాబు విఫలం కావడంతో జగన్‌ కార్యాచరణ ప్రకటించారు. 2018, మార్చి 1న కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. మార్చి 5న ఢిల్లీలో పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. జగన్‌ సూచనల మేరకు ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో మార్చి 15న అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. ప్రత్యేక హోదా సాధనకు సహకరించాలని అన్ని పార్టీల నేతలకు జగన్‌ లేఖలు రాశారు. అన్ని పార్టీల మద్దతు కూడగట్టడంతోపాటు హోదా పోరుకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేలా చేశారు. కానీ సభ సజావుగా లేదన్న సాకుతో స్పీకర్‌ అవిశ్వాస నోటీసులను అనుమతించలేదు. ఈ తంతు ఏప్రిల్‌ 6 వరకు కొనసాగింది. ప్రతిరోజూ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం, సభలో గందరగోళాన్ని సాకుగా చూపుతూ స్పీకర్‌ వాయిదా వేయడం షరా మామూలుగా మారింది. వైఎస్సార్‌సీపీ ఎంపీలు మొత్తం 13 సార్లు అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదించారు. చివరికి చర్చ జరగకుండానే సభ నిరవధికంగా వాయిదా పడడంతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేశారు. 

ఉక్కుపాదానికి ఎదురొడ్డి నిలిచి..
ప్రత్యేక హోదా అంశం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడం, ప్రభుత్వ తీరును అందరూ ప్రశ్నిస్తుండడంతో తట్టుకోలేని చంద్రబాబు హోదా పోరుపై ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా విశాఖలో 2017 జనవరి 26, 27 తేదీల్లో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలకు హాజరవడానికి వెళ్తున్న వైఎస్‌ జగన్‌ను అప్రజాస్వామికంగా విశాఖ ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా రన్‌వేపైనే జగన్‌ బైఠాయించారు. అదే ఏడాది నవంబర్‌లో వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించగా.. ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులను, శ్రేణులను అరెస్టు చేసింది.

‘‘హోదా ఉంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశాలు, ఇతర రాష్ట్రాలు, ప్రముఖ సంస్థలు క్యూ కడతాయి. రూ. లక్షల కోట్ల పెట్టుబడులు,వేల సంఖ్యలో పరిశ్రమలు, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రంలో ఎక్కడా నో వేకెన్సీ బోర్డులు కనబడవు. ఎక్కడ చూసినా ఇక్కడ ఉద్యోగాలున్నాయి దరఖాస్తు చేసుకోండి అన్న వాంటెడ్‌ బోర్డులే కనిపిస్తాయి. ప్రతి జిల్లా ఒక హైదరాబాద్‌ అవుతుంది.’’ 

ప్రత్యేక హోదాపై వైఎస్‌ జగన్‌
11 ఆగస్టు 2015: ఢిల్లీ ధర్నా 
బీజేపీ సభ్యులతో ఉన్న మీరే కదయ్యా.. ఇదే పార్లమెంట్‌ నుంచి ఐదేళ్లు ప్రత్యేక హోదా సరిపోదు.. పదేళ్లు కావాలీ అని, మేం అధికారంలోకి వస్తే పది సంవత్సరాలు ఇస్తాం అని చెప్పింది. మీరు కాదా అని అడుగుతున్నా. 
 
15 సెప్టెంబర్‌ 2015: తిరుపతి యువభేరి 
ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే మాత్రం... ఇక ప్రజలతో పనైపోయింది, ఓట్లతో పనైపోయింది, హోదాను గాలికి వదిలేయండనే మాటలు మాట్లాడుతున్నారు.  

22 సెప్టెంబర్‌ 2015: విశాఖ యువభేరి 
హోదా ఉంటే మన రాష్ట్రంలో పరిశ్రమలు పెడతారు. లక్షల కోట్లు పెట్టుబడిగా తెస్తారు. పెట్టుబడిగా లక్షల కోట్లు తెచ్చి లక్షల ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ప్రత్యేక హోదా వల్ల వస్తుంది. ఇది తెలిసినా చంద్రబాబు మాత్రం పట్టించుకోవటం లేదు.  

27 జనవరి 2016: కాకినాడ యువభేరి 
అందరూ కలసికట్టుగా ఒక్కటై ప్రత్యేక హోదా ఇస్తాం అనే హామీ ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టారు.  

2 ఫిబ్రవరి 2016: శ్రీకాకుళం యువభేరి 
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రమైతే పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చేందుకు చంద్రబాబు ఎక్కడెక్కడికో పోవాల్సిన పనిలేదు. సింగపూర్‌ తిరగాల్సిన పనిలేదు. చైనా తిరగాల్సిన పనిలేదు. ప్రత్యేక హోదా మనకు ఇస్తే ఇక్కడ జాబులూ ఉంటాయి. దరఖాస్తు చేసుకోండి అనే బోర్డులూ కనిపిస్తాయి.  

10 మే 2016: కాకినాడ ధర్నా 
ఏ రోజైతే చంద్రబాబు ఢిల్లీకి అల్టిమేటం ఇస్తాడో, ప్రత్యేక హోదా మాకు ఇవ్వకపోతే కేంద్రంలో ఉన్న మా మంత్రులతో రాజీనామాలు చేయిస్తాం అని చంద్రబాబు ఏ రోజైతే చెబుతాడో ఆరోజు ఢిల్లీ కదులుతుంది. ప్రత్యేక హోదా మన వాకిటి దగ్గరకు వస్తుంది. 

4 ఆగస్టు 2016: నెల్లూరు యువభేరి 
హోదా కలిగిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చి లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది.  
 
7 అక్టోబర్‌ 2016: గుంటూరు నిరాహార దీక్ష 
చంద్రబాబు పైనున్న దేవుడిని నమ్ముకోవడం లేదు. అధికారంలో ఉన్న ప్రధాని కాళ్లు పట్టుకోవటమే మేలు అని ఇవాళ బాబు హోదాను తాకట్టుపెట్టారు.  
  
22 సెప్టెంబర్, 2016: ఏలూరు యువభేరి 
ప్రత్యేక హోదా అన్నది ఏమైనా మీ నాయన గారి సొత్తా? మీ అత్తగారి సొత్తా? ఐదు కోట్ల మంది జీవితాలు దానితో ముడిపడి ఉంటే, మాకెవ్వరికీ ఇష్టం లేకపోయినా కూడా నువ్వెవరివయ్యా స్వాగతించటానికి? అని గట్టిగా ప్రశ్నిస్తున్నా. 
(అరుణ్‌జైట్లీ ప్యాకేజీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించటంపై) 
 
25 అక్టోబర్‌ 2016: కర్నూలు యువభేరి 
బడ్జెట్‌ సమావేశాల్లో కూడా మన గొంతు వినిపించే కార్యక్రమం చేస్తాం. పార్లమెంట్‌ను స్తంభింపచేసే విషయంలో ఎంపీలు ముందుంటారు. ఇవన్నీ చేసినా కూడా వాళ్లు వినకపోతే, హోదా ఇవ్వకపోతే ఎంపీలు రాజీనామాలు చేస్తారు.

6 నవంబర్‌ 2016: జై ఆంధ్రప్రదేశ్‌ సభ – విశాఖ 
ఉద్యమాలంటే వెరుపు లేదు. జైళ్లంటే భయం లేదు. ప్రాణాలు పోతాయన్న బాధా లేదు. మన పిల్లల భవిష్యత్తు కోసం హోదా ఉద్యమాన్ని ఇంకా ఏ స్థాయికైనా తీసుకుపోతాం.  
 
19 డిసెంబర్‌ 2016: విజయనగరం యువభేరి
ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రానికి ఏదైనా పెట్టుబడులు వస్తాయి తల్లీ.. కచ్చితంగా పూర్తిగా నూటికి నూరు శాతం మేలు జరిగేలా చర్యలు తీసుకుంటాం.  
 
13 ఫిబ్రవరి 2018 కలిగిరి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు  
మా ఎంపీలు లోక్‌సభ స్థానాలకు రాజీనామాలు చేసి ఏప్రిల్‌ 6న వాళ్ల మొహాన పడేసి వస్తారు. హోదా అన్నది మన ఊపిరి. ఊపిరి ఉన్నంతవరకూ హోదా కోసం పోరాడుతూనే ఉంటాం. 
 
18 ఫిబ్రవరి 2018 (ప్రజా సంకల్ప యాత్ర) కందుకూరు, ప్రకాశం జిల్లా 
ప్రత్యేక హోదా కోసం, రాష్ట్రానికి మంచి జరుగుతుంది కాబట్టి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారని ఇవాళ ప్రకటిస్తున్నాం.  

31 మార్చి 2018 (ప్రజా సంకల్ప యాత్ర) పేరేచర్ల, గుంటూరు జిల్లా 
పార్లమెంట్‌ నిరవధికంగా వాయిదాపడిన వెంటనే మా ఎంపీలు రాజీనామాలు చేస్తారు. ఆవెంటనే ఆంధ్రుల ఆస్తి అయిన ఏపీభవన్‌కు వెళ్లి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటారు. ఎంపీలకు మద్దతుగా విద్యార్థులు, యువకులు కదలిరావాలి. విద్యార్థులు కాలేజీల్లోనే రిలేదీక్షలు చేపట్టాలి.

ప్రత్యేక హోదా మా ఊపిరి.. రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు
పార్లమెంటు సాక్షిగా దక్కిన హామీ. హైదరాబాద్‌ వంటి నగరం మాకు లేకుండా పోతున్నప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారు. ఈ రోజు చెన్నైతో కూడిన తమిళనాడుతో గానీ, బెంగళూరుతో కూడిన కర్ణాటకతో గానీ, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణతో గానీ పోటీపడాలంటే మౌలిక వసతులు లేకుండా ఎలా సాధ్యం? 

Advertisement
Advertisement