రోడ్డు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

18 Jan, 2018 07:05 IST|Sakshi

జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.  సత్తెనపల్లిలోని వావిలాలనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరో తరగతి విద్యార్థి రాళ్లబండి విశ్వం మృతిచెందాడు. వినుకొండ మండలం గోకనకొండలో జరిగిన ప్రమాదంలో  వీరాంజనేయులు మృత్యువాత పడ్డాడు.  పొగమంచు కారణంగా  ఆగివున్న లారీని ఢీకొన్న సంఘటనలో ఉద్యోగి విఘ్నేశ్వర్‌ దుర్మరణం చెందాడు.  నకరికల్లులో బంధువుల ఇంటి వెళ్లి వస్తూ యువకుడు మృతిచెందాడు.

సత్తెనపల్లి: పట్టణంలోని వావిలాలనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతిచెందాడు.  30 వ వార్డు వావిలాలనగర్‌కు చెందిన  రాళ్లబండి విశ్వం (12) ఆరో తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉన్నాడు.  మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో అంబేడ్కర్‌ నగర్‌ 2వ లైను నుంచి సైకిల్‌పై ఎడమవైపు ప్రయాణిస్తూ వావిలాలనగర్‌లోని  ఇంటి వద్దకు వస్తున్నాడు. అదే సమయంలో సత్తెనపల్లినుంచి పాకాలపాడువెళ్తున్న యనబర్ల యాకోబు ద్విచక్రవాహనం ఢీకొట్టింది. 

దీంతో విశ్వంకు తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ప్రైవేట్‌ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. అక్కడ రూ.లక్ష ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో తిరిగి జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ విశ్వం బుధవారం మృతిచెందాడు. మృతుని తల్లిదండ్రులు రాళ్లబండి వీరబ్రహ్మం, సుజాత వడ్రంగి పని చేస్తు జీవనం వెళ్లదీస్తారు.

 కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు  కన్నీరుమున్నీరయ్యారు. పండుగ పూట బిడ్డ మృత్యువాతను తట్టుకోలేక కుటుంబ సభ్యులు గుండెలుబాదుకుంటూ రోదిస్తున్నారు. వారి రోదన చూపరులను సైతం కంటతడి పెట్టించింది. విశ్వం మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. 
సత్తెనపల్లి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని 30వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ ఆకుల స్వరూపా హనుమంతరావు సందర్శించి నివాళులర్పించారు.

గోకనకొండ యువకుడు మృతి
వినుకొండ రూరల్,దాచేపల్లి: సంక్రాంతి సెలవులు ముగించుకొని ఉద్యోగానికి వెళ్లూ రోడ్డు ప్రమాదంలో గోకనకొండ గ్రామానికి చెందిన వేల్పుల వీరాంజనేయులు (28) మృతి చెందాడు. గ్రామానికి  చెందిన శ్రీనివాసరావు భార్య హైమావతికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడైన వీరాంజనేయులు కొంతకాలంగా హైదరాబాద్‌లో ప్రైవేట్‌ కంపెనీలో  ఉద్యోగం చేస్తున్నాడు. సంక్రాంతిని పురస్కరించుకొని సెలవులపై ఈనెల 13న ఇంటికి చేరుకున్నారు. సెలవులు ముగించుకొని తిరిగి ఉద్యోగంలో చేరేందుకు బుధవారం ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బయలు దేరాడు.  దాచేపల్లి వద్ద లారీ ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. ఈసంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.   అలుముకున్నాయి. 

కలగా మిగిలిన జీవితం
జీవితంలో స్థిరపడి, వివాహం చేసుకుని తనకాళ్లపై తాను స్థిరపడి  తల్లి దండ్రులను పోషించాలని కలలు కన్నాడు. ముందుగా తమ్ముడికి విహహిం జరిపించాడు. తల్లి దండ్రులను సుఖపెట్టాలనే కోరిక తీరక ముందే ప్రమాదంలో ఆయన మృతి చెందడంపై గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ...
నకరికల్లు : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన నకరికల్లు మండలం అడ్డరోడ్డు వద్ద బుధవారం రాత్రి జరిగింది. క్రోసూరుకు చెందిన గుత్తి గంగయ్య(40), క్రాంతికుమార్, ఝాన్సీలు రొంపిచర్ల మండలం కర్లకుంట గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో అడ్డరోడ్డు సమీపంలోని గోడౌన్స్‌ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో గంగయ్య అక్కడికక్కడే మృతి చెందగా, క్రాంతికుమార్, ఝాన్సీలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ జి.అనీల్‌కుమార్‌ బాధితుల బంధువులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను నరసరావుపేట ప్రైవేటు వైద్యశాలకు తరలిచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.   

పొగమంచుకు ఇంజినీరింగ్‌ విద్యార్థి బలి
పిడుగురాళ్లరూరల్‌: తెల్లవారుజామున పొగమంచు కురుస్తుండటంతో ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో  యువకుడు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామ సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. దాచేపల్లి నుంచి ద్విచక్రవాహనంపై నలుగురు యువకులు పిడుగురాళ్ల వైపు వస్తున్నారు. మార్గం మధ్యలో టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రగాయాలపాలు కాగా క్షతగాత్రులను టోల్‌ప్లాజా అంబులెన్సు ద్వారా పిడుగురాళ్లలోని ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరిలో రాగిడి విఘ్నేశ్వర్‌(20) చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుట్టి చిన్న, గొట్టిముక్కల ప్రేమ్‌చంద్, ఇట్టె బాలాజీలు చికిత్స పొందుతున్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన విఘ్నేశ్వర్‌ నర్సరావుపేట ఎన్‌ఈసీ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 

మరిన్ని వార్తలు