పంచాయతీల వివరాలు తెలపాలి

18 Jan, 2018 07:07 IST|Sakshi

జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి

ఆదిలాబాద్‌ అర్బన్‌: జిల్లాలో కొత్తగా ఏర్పడనున్న, ప్రస్తుత గ్రామపంచాయతీల వివరాలు ఈ నెల 25లోగా అందజేయాలని జెడ్పీ సీఈవో, ఇన్‌చార్జి డీపీవో జితేందర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ కలెక్టర్లు, డీపీవోలతో నిర్వహించిన సమావేశంలో చర్చించిన అంశాలను సీఈవో అధికారులకు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడున్న పంచాయతీల వారీగా జనాభా, పంచాయతీ సరిహద్దులు, సంవత్సరాల వారీగా పంచాయతీలకు వస్తున్న ఆదాయం, పంచాయతీ పరిధిలోని వ్యవసాయ భూములు, పంచాయతీ ల్యాండ్‌మార్క్‌ తదితర వివరాలు పంపాల్సిందిగా సూచించారు.

కొత్తగా ఏర్పడే గ్రామపంచాయతీలో ఎంతమంది జనాభా ఉన్నారు.. పాత దానికి, కొత్తదానికి ఎంత దూరముంది.. పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన 500 జనాభా ఎన్ని గ్రామ పంచాయతీలకు ఉంది.. 500 జనాభా కన్నా తక్కువగా ఎన్ని గ్రామ పంచాయతీలున్నాయనే వివరాలను అందజేయాల్సి ఉంటుందన్నారు. సుమారు ఒక జీపీ నుంచి మరో జీపీకి 1.5 కిలోమీటర్ల దూరం ఉండాలనే ఆదేశాలు పాటించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో కొత్తగా 225 గ్రామపంచాయతీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సీఈవో తెలిపారు. డీపీవో ఏవో రమేశ్, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలు పాల్గొన్నారు.

కొత్త ప్రతిపాదనలు పంపాలి : కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌
ఎదులాపురం(ఆదిలాబాద్‌): కొత్త గ్రామపంచాయతీల కోసం తండాలు, శివారు గ్రామాలను ఎంపిక చేసి ఈనెల 25లోగా ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గిరిజన తండాలు, గూడేలు, హ్యాబిటేషన్‌ల పరిధిలో 500 జనాభా కలిగి రెండు కిలో మీటర్లు, అంతకన్న ఎక్కువ గల దూరంలో ప్రస్తుత గ్రామపంచాయతీలే కాకుండా కొత్త గ్రామపంచాయతీకి ప్రతిపాదించాలని సూచించారు.

గుట్టలు, నదులు అడ్డుగా ఉన్న ప్రాంతాలు, అసౌకర్యాలు గల ప్రాంతాల్లో 500 జనాభా కంటే తక్కువ కలిగి ఉండి, 300 జనాభా ఉన్న గ్రామాలను కొత్త గ్రామపంచాయతీగా ప్రతిపాదించాలన్నారు. గ్రామపంచాయతీగా ప్రతిపాదించే ముందు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఏవైన సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈనెల 19న జరిగే కేస్లాపూర్‌ నాగోబా దర్బార్‌కు తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఉదయం 9గంటలకు హాజరుకావాలని, దర్బార్‌లో వచ్చిన అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించేలా చూడాలన్నారు. జేసీ కృష్ణారెడ్డి, డీపీవో జితేందర్‌రెడ్డి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఈవోపీఆర్డీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు