ఏపీపీఎస్సీ కార్యదర్శిగా గిరిధర్!

28 Jul, 2015 04:11 IST|Sakshi
ఏపీపీఎస్సీ కార్యదర్శిగా గిరిధర్!

* ఈ నెల 1 నుంచి సెలవులో ఉన్న గిరిధర్
* రాజధాని పనుల్లో ప్రభుత్వ విధానాలు నచ్చక కినుక
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎ. గిరిధర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా గిరిధర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అనుసరిస్తున్న విధానాలు, తీరు నచ్చక గిరిధర్ ఈ నెల 1 నుంచి సెలవులో ఉన్నారు.

తనను మున్సిపల్ శాఖ బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా ఆయనే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖలో కీలక పోస్టులో ఉన్న గిరిధర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కార్యాలయ ముఖ్యకార్యదర్శిగా తొలుత నియమించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తొలి రోజుల్లో సీఎం కార్యాలయం ముఖ్యకార్యదర్శిగా గిరిధర్ అలుపెరగక రాత్రింబగళ్లు పనిచేశారు. కష్టపడి పనిచేసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత మంది వందిమాగధుల చెప్పుడు మాటలను విని గిరిధర్‌ను సీఎం కార్యాలయం నుంచి మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు.

కొత్త రాజధాని నిర్మాణం, సింగపూర్ కంపెనీలతో మాస్టర్ ప్రణాళిక రూపకల్పన అంశాల్లో గిరిధర్ కీలక భూమిక పోషించారు. మాస్టర్ ప్రణాళికలోని అంశాలపైన, మాస్టర్ డెవలపర్ ఎంపిక, స్విస్ చాలెంజ్‌పై ప్రభుత్వ విధానాలు గిరిధర్‌కు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో ఆయన ఈ నెల 1 నుంచే సెలవులో ఉన్నారు. గిరిధర్‌ను బదిలీ చేసినప్పటికీ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం ఆ బాధ్యతలను మున్సిపల్ శాఖ కార్యదర్శి జయలక్ష్మి చూస్తున్నారు.
 
పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా కరికాల వలవన్
యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శిగా పని చేస్తున్న కరికాల వలవన్‌ను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్‌గా కూడా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇదివరకు పౌరసరఫరాల కమిషనర్‌గా ఉన్న బి.రాజశేఖర్ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.

రెండు రోజుల క్రితమే పి.ఎస్. గిరీష్‌ను అనంతపురం జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్‌గా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించి ఆయనకు నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్‌గా నియమిం చింది.డిప్యుటేషన్‌పై వచ్చిన ఐఆర్‌ఎస్ అధికారి  గోపీనాధ్‌ను రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వుల జారీ చేశారు.

మరిన్ని వార్తలు