అప్పులోళ్ల కూటమికి చుక్కెదురు

9 Jul, 2015 01:10 IST|Sakshi
అప్పులోళ్ల కూటమికి చుక్కెదురు

గ్రీస్ ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ ఉన్నా, ఒక ప్రధాన నిర్ణయంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని రిఫరెండం నిర్వహించడం గొప్ప సాహసం. ప్రభుత్వ ప్రతిపాదన వీగిపోతే గద్దె దిగుతామని సైతం అది ప్రకటించింది. ప్రపంచంలోనే అరుదైన రాజకీయ ప్రయోగమిది. గతంలో కమ్యూనిస్టు పార్టీలు అవలంబించిన విధానాలకు ఇది భిన్నమైనది. సోషలిజం, ప్రజాస్వామ్యం జమిళిగా నడవాలనే ఆలోచనకు కార్యరూపం. సోషలిజానికి నియంతృత్వమే మార్గమనే దృక్పథానికి గ్రీస్ రిఫరెండం తెరదించింది, చరిత్రను తిరగరాసింది.
 
 ‘‘ఈ రిఫరెండంలో విజేతలు, పరాజితులు లేరు. దానికదే గొప్ప విజయం. ఆధునిక యూరప్ చరిత్రలో ఇది ఒక అరుదైన ఘట్టం. ఈ రోజు ప్రజాస్వామ్య ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని వంచ నకు గురిచేయవద్దు. సామాజిక న్యాయం ప్రాతిపదికగా పేదల, అణగారిన వర్గాల భారాన్ని ఆర్థికంగా శక్తివంతంగా ఉన్న వాళ్ళు భరించాలి. అటువైపుగా గ్రీస్ సమాజం పయనించాలి.’’ గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ అన్న మాట లివి. గత ఆదివారం జరిగిన రిఫరెండంలో ప్రభుత్వ ప్రతిపాదనకు గ్రీస్ ప్రజ బ్రహ్మరథం పట్టింది. అధికారంలోని సిరిజా ప్రభుత్వానికి దాదాపు 61 శాతం ప్రజలు మద్దతుగా నిలిచారు. గత జనవరి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ సాధించినది 36.3 శాతం ఓట్లు మాత్రమే. ఈ ఆరు నెలల్లో ప్రజా మద్దతు రెట్టింపు కావడం విశేషం.
 
 ‘షరతులకు’ చెంప పెట్టు
 పెట్టుబడిదారీ విధానానికి పుట్టినిల్లు అయిన యూరప్‌లోని ఒక చిన్న దేశం గ్రీస్ ప్రజలు గత జనవరిలో అనూహ్యంగా సోషలిస్టు, ప్రజాస్వామ్యశక్తులైన వామపక్షాలకు మద్దతు పలికారు. యూరోపియన్ యూనియన్, యూరోపి యన్ సెంట్రల్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)లతో లేదా ‘అప్పులోళ్ల కూటమి’తో గత ప్రభుత్వాలు కుదుర్చుకున్న అసమాన ఒప్పం దాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అంగీకరించేది లేదని వామపక్ష ఐక్య ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలపైన పన్నుల భారం పెంచి, సంక్షేమ కార్యక్రమాలకు కత్తెర వేయాలనే రుణదాతల ఒత్తిడులకు తలవంచేది లేదని తేల్చిచెప్పింది, అదే విధానాన్ని అనుసరిస్తోంది. అయితే ఇటీవల గ్రీస్ ప్రభు త్వానికి అప్పులోళ్ల కూటమి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఒక వేళ తమ షర తులను అంగీకరించకపోతే, యూరోపియన్ యూనియన్ నుంచి, ఉమ్మడి కరెన్సీ అయిన యూరో నుంచి వైదొలగవలసి వస్తుందని అది అంతిమ హెచ్చరికలు సైతం చేసింది. ఈ పరిస్థితుల్లో గ్రీస్ వామపక్ష ప్రభుత్వం నిజ మైన ప్రజాస్వామ్య పద్ధతిని అనుసరించింది. అప్పులోళ్ల కూటమి విధిస్తున్న షరతులకు అంగీకరించడమా? లేక తిరస్కరించడమా? అనే కీలక నిర్ణయం తీసుకునే బాధ్యతను ప్రజలకే అప్పగించింది. ప్రజా వ్యతిరేకమైన ఆ షరతు లను తిరస్కరించాలనే సిరిజా ప్రభుత్వ వైఖరికి జూలై 5 రిఫరెండంలో ప్రజ లు భారీ ఎత్తున మద్దతు పలికారు.
 
 ఆ సందర్భంగా గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ హుందాగా చేసిన ప్రకట నను మొదటే ఉల్లేఖించాం. అది ఒక పరిణతి చెందిన వ్యవస్థ దృక్పథానికి అద్దం పట్టింది. రిఫరెండం తమకు పోరాడే శక్తిని ఇచ్చిందంటూనే, నిజాయి తీతో తమ ప్రభుత్వం చేస్తున్న సమంజసమైన ఆర్థిక వాదనలకు యూరోపి యన్ యూనియన్ అంగీకరిస్తే, ఉమ్మడి కరె న్సీ ‘యూరో’ నుంచి వైదొలగే ఉద్దేశం లేదన్నారు. గ్రీస్ తీసుకోబోయే నిర్ణయం ఈయూ వైఖరిపైనే ఆధార పడి ఉందని సిప్రాస్ తేల్చి చెప్పారు. సుప్రసిద్ధ ఆర్థిక వేత్తలు జోసఫ్ స్టిగ్‌లిట్జ్, పాల్ క్రుగ్‌మెన్‌లుసహా వంద మందికిపైగా సామాజిక, రాజనీతి నిపుణులు గ్రీస్ ప్రజా తీర్పును కొనియాడారు. ఇప్పటికీ సోషలిస్టు విధానాలను అవలం బిస్తున్న చైనా, రష్యా, క్యూబా, అర్జెంటీనా, వెనెజులా లాంటి దేశాలు గ్రీస్‌కు పూర్తి మద్దతును ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామిక, సోషలిస్టు, కమ్యూనిస్టు, విప్లవ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు పెద్ద ఎత్తున గ్రీస్ ప్రజలను అభినందించారు. సిర్జియా ప్రభుత్వానికి మద్దతు పలికారు.
 
 సోషలిస్టు, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు ప్రాతిపదిక
 పెట్టుబడిదారీ విధానం వల్ల ప్రజల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు, కార్పొరేట్ కంపెనీల దురాశ వల్ల నూటికి ఎనభై శాతం మంది ప్రజలు ఒకపూట తిండికి నోచుకోలేకున్నారు. అటు వంటి దుర్మార్గ వ్యవస్థను ఎదిరించడమే గ్రీస్ నేడు చేస్తున్నది. 2,500 ఏళ్ల కిం దటే ప్రజాస్వామ్య భావనకు పురుడుపోసిన గ్రీస్ ఈ రోజు కూడా ప్రజా స్వామ్య పరిణతికి ప్రతినిధిగా నిలిచింది. గ్రీస్ వామపక్ష కూటమి ప్రభుత్వా నికి పార్లమెంటులో మెజారిటీ ఉంది. కాబట్టి ప్రజలను సంప్రదించకుండానే అది నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఒక ప్రధాన నిర్ణయంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలనుకోవడం, రిఫరెండం నిర్వహించడం గొప్ప సాహసం.
 
 అంతేకాదు, రిఫరెండంలో ప్రభుత్వ ప్రతిపాదన వీగిపోతే అధికా రం నుంచి  తప్పుకుంటామని సైతం అది ప్రకటించింది. ప్రపంచంలోని ఏ దేశమూ, ఏ ప్రభుత్వమూ, ఏ పార్టీ చేయలేని అరుదైన రాజకీయ ప్రయోగ మిది. అంటే గతంలో కమ్యూనిస్టు పార్టీలు అవలంబించిన విధానాలకు ఇది భిన్నమైనది. సోషలిజం, ప్రజాస్వామ్యం జమిళిగా నడవాలనే ఆలోచనకు ఇది కార్యరూపం. సోషలిజం అమలుకు నియంతృత్వమే మార్గమనే పాత దృ క్పథానికి గ్రీస్ రిఫరెండం తెరదించింది. చరిత్రను తిరగరాసింది. అదేవిధం గా అంతర్జాతీయంగా సోషలిజం, ప్రజాస్వామ్యం, సమగ్రాభివృద్ధి కాంక్షిస్తు న్న శక్తులు ఒకే వేదికపైకి రావడానికి గ్రీస్ రిఫరెండం ఆరంభమవుతుంది. చైనా, రష్యాలతోపాటు లాటిన్ అమెరికా దేశాల్లోని విప్లవ, వామపక్ష ప్రజా స్వామ్య ప్రభుత్వాలు ఒక్కతాటిపైకి వచ్చి ప్రజాస్వామ్య సోషలిస్ట్ బ్లాక్ ఏర్ప ర్చుకోవడానికి ఇది బలమైన పునాదిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
 
 ప్రపంచ పెట్టుబడికి హెచ్చరిక
 అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు, కార్పొరేట్ శక్తులు తమ విధానాలను మార్చు కోక తప్పదని గ్రీస్ రిఫరెండం హెచ్చరికను పంపింది. ఇప్పటికే ఐఎంఎఫ్ తన విధానాలను సమీక్షించుకుంటూ కొన్ని రోజుల క్రితమే ఒక నివేదికను రూపొందించింది. వివిధ దేశాల ప్రభుత్వాలకు తమ సంస్థ ఇస్తున్న రుణాల వల్ల ఆ దేశాల పేదరికం తగ్గకపోగా మరిన్ని దుష్పరిణామాలకు కారణమవు తున్నాయని పేర్కొంది. పైపై సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తే దేశం అభివృద్ధి చెందుతుందనే ఆలోచన సరైంది కాదని, ప్రజల ప్రాథమిక అవసరాలైన విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆరోగ్యం లాంటి వాటిపై దృష్టి పెట్టక పోతే ఫలితం ఉండదని ఆ నివేదిక తెలిపింది. గ్రీస్ పరిణామాలు, యూరప్ రాజకీయ, ఆర్థికవ్యవస్థల మీద కూడా బలమైన ప్రభావాన్ని కలగజేస్తాయని, యూరప్ ప్రజల్లో ప్రజాస్వామ్య చైతన్యాన్ని రగులుస్తాయని రాజకీయ పరిశీ లకులు భావిస్తున్నారు.
 
 ముఖ్యంగా ఈయూ ఆర్థిక విధానాలవల్ల అక్కడి ప్రజ ల్లో పెరుగుతున్న అసంతృప్తికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి ఇది మార్గం చూపుతుందని వారు ఆశిస్తున్నారు. అయితే కొందరు పెట్టుబడిదారీ మద్దతు దారులు మాత్రం గ్రీస్ తలబిరుసుదనం, రిఫరెండం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దుష్పలితాలను కలిగిస్తాయని, ఆర్థిక మాంద్యానికి దారితీసి, తీవ్ర పరిణా మాలు కలుగుతాయని వాదిస్తున్నారు. వీరి దృష్టిలో స్వతంత్రతకు చోటేలేదు. పెట్టుబడికి, దాని ఆధిపత్యానికి దాసోహం అనాలే తప్ప, ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛని కాపాడుకునే ప్రయత్నం చేయడమంటే వీరి దృష్టిలో నేరమే. అదే విధంగా అప్పులోళ్ల కూటమి మద్దతు లేకుండా గ్రీస్ ఒంటరిగా నిలబడి, మనుగడ సాగించలేదని వారు వాదిస్తున్నారు.
 
 క్యూబా స్ఫూర్తితో ముందుకు సాగాలి
 అయితే క్యూబా లాంటి దేశం దాదాపు నలభై ఏళ్ళుగా అమెరికా కుట్రలను, దాడులను, ఆంక్షలను తట్టుకొని ప్రపంచానికే ఆదర్శప్రాయమైంది. వైద్య, ప్రజారోగ్య రంగాల్లో ఈ రోజు క్యూబాయే అందరికీ మార్గదర్శి. అందుకే క్యూబా స్ఫూర్తితో గ్రీస్ ముందుకు సాగాలి. ఎన్ని ఒడిదుడుకులనైనా, అడ్డం కులనైనా ఎదుర్కొని ఆత్మగౌరవంతో తలెత్తుకు నిలవాలి.

చరిత్రలో గ్రీస్ దేశా నికి, జాతికి అటువంటి తాత్విక వారసత్వం ఉండనే ఉంది.  తత్వశాస్త్రంలో ప్రపంచానికే అక్షరాభ్యాసం చేయించిన అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటోల వంటి వారు ఆ నేల తల్లి బిడ్డలే. అటువంటి గొప్ప తాత్విక రాజకీయ పునాదిని కలిగి, ప్రజాస్వామ్య భావనకు జన్మనిచ్చిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న గ్రీస్ ప్రజలు, సిప్రాస్ నేతృత్వంలోని సిరిజా ప్రభుత్వం ప్రపంచ ప్రజల్లో సోషలిజం, ప్రజాస్వామ్యాల పట్ల మరింత విశ్వాసాన్ని నింపుతారని ఆశిద్దాం.
 (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు)
మొబైల్: 97055 66213

 - మల్లెపల్లి లక్ష్మయ్య

whatsapp channel

మరిన్ని వార్తలు