పాలమూరు, డిండిలో ఉల్లంఘనలు లేవు

10 Jul, 2015 02:18 IST|Sakshi
పాలమూరు, డిండిలో ఉల్లంఘనలు లేవు

సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాలను వినియోగించుకుంటూ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడటం లేదని, ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు ఉన్న ఈ ప్రాజెక్టులను అర్థవంతంగా పూర్తి చేసే కసరత్తు మొదలుపెట్టామని రాష్ట్ర నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ కార్యదర్శికి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయనకు ఈ రెండు ప్రాజెక్టులపై స్పష్టతనిస్తూ నాలుగు పేజీల లేఖ రాశారు.

కృష్ణాలో 70 టీఎంసీల నీటి వినియోగంకోసం పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013 ఆగస్టు 8న అప్పటి ప్రభుత్వం జీవో 72ను, అలాగే 30 టీఎంసీల నీటి వినియోగంకోసం డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టేందుకు 2007 జూలై7న ఇచ్చిన జీవో 159లను ఉమ్మడి రాష్ట్రంలోనే ఇచ్చిన విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు.

కరువు పీడిత ప్రాంతాలైన మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటిని అందించేందుకు పాలమూరు ఎత్తిపోతలు, ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొంటున్న దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సురక్షిత నీటిని అందించేందుకు డిండి ప్రాజెక్టును తలపెట్టినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పరిపాలనా అనుమతులు మంజూరైన ఈ ప్రాజెక్టుల నుంచి కృష్ణా బేసిన్‌లోని ప్రాంతాలకు నీరిచ్చే స్వేచ్ఛ తమకుందని స్పష్టం చేశారు. బచావత్ అవార్డు ప్రకారం నికర, మిగులు జలాలను ఉపయోగించుకొనే స్వేచ్ఛ సైతం తమకుందని లేఖలో వివరించారు.

ఈ ప్రాజెక్టులకు చట్టబద్ధమైన వ్యవస్థల నుంచి అవసరమైనప్పుడు తగిన సమయంలో అన్ని రకాల అనుమతులు తీసుకుంటామని వివరించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చట్టంలోని 84(8)ఏ నిబంధన ప్రకారం బోర్డు కేవలం నీటి సరఫరాను నియంత్రిస్తుంది తప్పితే, ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించింది కాదన్నారు. ట్రిబ్యునట్ చేసిన కేటాయింపులు, ప్రస్తుతం చేసుకున్న అంత ర్రాష్ట్ర ఒప్పందాలను గౌరవించాలని ఇప్పటికే రెండు రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని గుర్తుచేస్తూ,  నికర, మిగులు జలాల్లో ఉన్న హక్కుల మేరకే నీటిని వాడుకుంటున్నామని ఆయన పునరుద్ఘాటించారు.
 
పాలమూరుపై మంత్రి సమీక్ష..
కాగా ఇదే విషయమై నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు గురువారం అధికారులతో సమావేశమయ్యారు. ఏపీకి పాలమూరు -రంగారెడ్డి విషయమై లేఖ రాసిన విధంగానే కేంద్రానికి అన్ని రకాల ఆధారాలతో లేఖ పంపాలని సూచించారు. ప్రాజెక్టు పరిధిలో అవసరమయ్యే భూసేకరణ ప్రక్రియను వేగిరం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు