110 కిలోమీటర్లు సైక్లింగ్ చేసిన రాజీవ్ త్రివేది

20 Dec, 2015 19:54 IST|Sakshi

ధారూరు (రంగారెడ్డి) : రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేది తన ఇద్దరు కుమారులతో కలసి చేపట్టిన 110 కిలోమీటర్ల సైక్లింగ్ ఆదివారం హైదరాబాద్ నుంచి ధారూరు మీదుగా తాండూర్ వరకు కొనసాగింది. ఈ సైక్లింగ్‌లో రాజీవ్‌త్రివేదితో పాటు ఆయన కుమారులు ప్రసూన్, ప్రశాంత్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం సైక్లింగ్ నడక, పరుగు, శారీరక వ్యాయామాలు అలవాటుగా చేసుకున్నందున ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ఆరోగ్యమే సంపదగా భావించాలనీ, ఆరోగ్యం ఉంటే కోట్లు సంపాదించినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. నేటి సమాజంలో మాంసం, మద్యం వలన వివిధ రకాల రోగాలు వచ్చి ప్రజలు ఆనారోగ్యంతో ఆర్థికంగా నష్టపోతున్నారని, వీటికి దూరంగా ఉండాలనీ ఆయన సూచించారు.

రాష్ట్రంలోని వరంగల్, నల్గొండ జిల్లాల్లో రోడ్లు బాగున్నాయని, రంగారెడ్డి జిల్లాలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ధారూరు నుంచి అడవి మీదుగా తాండేర్ వైపు వెళుతున్న ఆయనకు రోడ్డు పక్కనే పేపర్ ప్లేట్లు, పాలిథిన్ కవర్లు గమనించిన ఆయన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ, చెత్తాచెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయరాదని అన్నారు. తాను 1982లో ఉద్యోగంలో వచ్చానని, చిన్ననాటి నుంచి ఇలాంటి నడక, పరుగు, సైక్లింగ్ చేయడం అలవాటుగా వస్తుందని, దీని వలన తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు.

మరిన్ని వార్తలు