డిగ్రీ సిలబస్ మార్పుల అమలెప్పుడు?

10 Jul, 2015 01:41 IST|Sakshi
డిగ్రీ సిలబస్ మార్పుల అమలెప్పుడు?

* పట్టించుకోని ప్రధాన యూనివర్సిటీలు
* ఇప్పటికే ప్రారంభమైన తరగతులు
* ఇంకా ముద్రణకు నోచుకోని పుస్తకాలు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మార్పులపై ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టినా ప్రధాన యూనివర్సిటీలు మాత్రం వాటి అమలుపై దృష్టి సారించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1,200 వరకు డిగ్రీ కాలేజీలు ఉంటే ప్రధానమైన ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలోనే 800కు పైగా కాలేజీలున్నాయి.

సిలబస్ మార్పు అమలుపై ఆ రెండు యూనివర్సిటీల నిర్లక్ష్య వైఖరి కారణంగా వాటి పరిధిలోని సిలబస్ మారుతుందా లేదా అన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఇప్పటికే డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే ఎక్కువ డిగ్రీ కాలేజీలు ఉన్న ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు స్పందించకపోవడంతో మార్పు చేసిన సిలబస్‌కు అనుగుణంగా తెలుగు అకాడమీ పుస్తకాలను రూపొందించలేకపోతోంది.

ఆ యూనివర్సిటీలు తమ అకడమిక్ కౌన్సిళ్లలో మార్పు చేసిన సిలబస్ అమలుకు తీర్మానం పంపితేనే కొత్త పుస్తకాలు ముద్రణకు నోచుకుంటాయని తెలుగు అకాడమీ పేర్కొంటోంది. ఇప్పటివరకు 300కు పైగా కాలేజీలు ఉన్న శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీలు మాత్రమే సిలబస్ మార్పుల అమలుకు తమ అకడమిక్ కౌన్సిళ్లలో తీర్మానం చేశాయి. అంతేకాదు ఈ మార్పులు ప్రథమ సంవత్సరలోనే చేసినందున ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లోనూ ఏపీకి సంబంధించిన కొన్ని అంశాలను తొలగించి, తెలంగాణ అంశాలను చేర్చుకునేందుకు ఉన్నత విద్యా మండలి అనుమతి ఇచ్చింది.
 
పోటీ పరీక్షలకు ఇవే ప్రామాణికం
రాష్ట్రంలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలోని సోషియాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిజిక్స్, తెలుగు, కామర్స్, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల సిలబన్‌ను మార్పు చేసింది. ఏపీకి సంబంధించిన అంశాలను తొలగించి, తెలంగాణకు సంబంధించిన అంశాలపై సిలబస్‌ను రూపొందించింది. భవిష్యత్తులో టీఎస్‌పీఎస్‌సీ పోటీ పరీక్షల్లో తెలంగాణపై ప్రశ్నలు ఉండనున్నాయి. గ్రూపు-1లో తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేకంగా పేపరునే పెట్టబోతోంది. ఈ నేపథ్యంలో సిలబస్ మార్పులకు యూనివర్సిటీలు అన్నీ ఆమోదం తెలపకపోవడంతో గందరగోళం ఏర్పడింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు కొత్త సిలబస్ అందక ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు