బీమా పరిధిలోకి 40 శాతం పంటలు

19 Apr, 2017 01:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంటల బీమాను రైతులకు మరింత చేరువ చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) ద్వారా మరింత పరిహా రం అందేలా చర్యలు చేపడుతున్నామని.. అందులో భాగంగా 2017–18 వ్యవసా య సీజన్‌లో బీమా కవరేజీ 40 శాతం లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించింది. అలాగే 2018–19 నాటికి 50 శాతానికి చేరుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

ఇటీవల ఢిల్లీలో రెండ్రోజులపాటు జరిగిన రాష్ట్రాల వ్యవసాయ ఉన్నతాధికారుల సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ జగన్‌మోహన్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఏడాది నుంచి బీమాకు ఆధార్‌ను అనుసం ధానం చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 2016–17 ఖరీఫ్‌లో 6.70 లక్షల మంది రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. మొత్తం 14.47 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా చేశారు. అంటే 15 శాతం సాగు భూమికి మాత్రమే బీమా చేయించినట్లయింది. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద పత్తికి ప్రీమియం చెల్లించే గడువును జూలై 15వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతంలో ఈ గడువు జూన్‌ 14 వరకే ఉండేది. ఇక ఇతర పంటలకు జూలై 31ని, వరికి ఆగస్టు 31ని ప్రీమియం చెల్లింపు గడువుగా నిర్ణయించారు.

మరిన్ని వార్తలు