22లోగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ దసరా నుంచే కొత్త జిల్లాలు

10 Aug, 2016 01:37 IST|Sakshi
22లోగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ దసరా నుంచే కొత్త జిల్లాలు

కొత్త జిల్లాల కసరత్తుపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఈ నెల మూడో వారంలో లేదా 22వ తేదీలోగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అన్ని అంశాలనూ అధ్యయనం చేసేందుకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అధ్యక్షతన ఐదుగురు మంత్రులతో కేబినేట్ సబ్ కమిటీని నియమించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు ముందే కేబినేట్ భేటీ, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. దసరా పండగ నుంచే కొత్త జిల్లాలు మనుగడలోకి రావాలని సీఎం మరోమారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ లోగా అధికార ప్రక్రియలన్నింటినీ ముగించాలని ఆదేశించారు.

డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తర్వాత ప్రజల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు నెల రోజుల గడువు ఇవ్వాలని సూచించారు. తర్వాత 15 రోజుల వ్యవధిలో వాటిని పరిష్కరించి తుది ప్రకటన జారీ చేయాలని దిశానిర్దేశం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై మంగళవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రదీప్ చంద్ర, రేమండ్ పీటర్, ఎస్‌కే జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వెంటనే మార్గదర్శకాలు రూపొందించాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు.
 
జోన్ల చిక్కుల్లేకుండా నివేదిక ఇవ్వండి
జోనల్ సమస్యలను అధిగమించేందుకు అనుసరించాలని వ్యూహాన్ని ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. దసరా నుంచే కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నందున అధికారుల విభజన, కార్యాలయాల సంసిద్ధత తదితర ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. కొత్త జిల్లాల్లో అధికార యంత్రాంగం ఎలా ఉండాలి? న్యాయాధికార పరిధి ఏ మేరకు ఉండాలి? అధికార వ్యవస్థ ఎలా ఉండాలి? తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ నేతృత్వంలో ఇప్పటివరకు జరిగిన అధ్యయనాన్ని ఈ సమావేశంలో చర్చించారు. ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, వాటిని అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత తీసుకున్న నిర్ణయాలను పరిశీలించారు. జనాభా-భౌగోళిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే రూపొందించిన కొత్త జిల్లాల ప్రతిపాదనలపై విసృ్తతంగా చర్చించారు. రాజకీయ డిమాండ్లను పెద్దగా పట్టించుకోకుండా ప్రజలకు సౌకర్యం, పరిపాలనా సౌలభ్యం, భౌగోళిక నేపథ్యం, వెనుకబాటుతనం తదితర అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు.
 
డిప్యూటీ సీఎం అధ్యక్షతన కమిటీ
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించటంతో పాటు ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలపై చర్చించి ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వడానికి ఈ కమిటీని నియమించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు