మీ వాళ్లు జర పైలం!

10 Nov, 2023 06:50 IST|Sakshi

రౌడీషీటర్ల ఇంటికి వెళ్తున్న ఎస్పీ సునీతా రెడ్డి

సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి నగర కొత్వాల్‌ సందీప్‌ శాండిల్య కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రౌడీషీటర్లపై డేగకన్ను వేశారు. స్థానిక పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ అధికారుల ద్వారా వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడం, బైండోవర్‌లతో పాట వాంటెడ్‌ ఉన్న వారిని కటకటాల్లోకి పంపిస్తున్నారు. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్న వారినీ వెతికిపట్టుకుని జైలుకు తరలిస్తున్నారు. ఓ పక్క ఈ చర్యలు తీసుకుంటున్న పోలీసు కమిషనర్‌ మరోపక్క రౌడీల కుటుంబీకుల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. అసాంఘిక శక్తులుగా ముద్రపడిన ఈ రౌడీలు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా, ఓటర్లను ప్రభావితం చేసేలా అభ్యర్థుల వెంట తిరగకుండా, రాజకీయ పార్టీలకు అనుకూలంగా, ప్రతికూలంగా స్థానికులను భయభ్రాంతులకు గురి చేయకుండా ఉండేలా చేసేందుకు వారి కుటుంబీకుల సహాయం తీసుకుంటున్నారు. ఆయా రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లి, కుటుంబీకులకు కౌన్సెలింగ్‌ చేసే బాధ్యతల్ని మహిళా అధికారులకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారాల కోసం జోన్ల వారీగా డీసీపీ, ఎస్పీ, ఏసీపీ స్థాయి అఽధికారిణులను నియమించారు. వీళ్ళు ప్రతి రోజూ ఉదయం 7–10 గంటల మధ్య, సాయంత్రం 4–7 గంటల మధ్య తమకు కేటాయించిన జోన్లలోని రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లి.. వారి కుటుంబీకులతో మాట్లాడటంతో పాటు ఎన్నికల క్రతువు పూర్తయ్యే వరకు దైనందిన కార్యకలాపాలు ముగిసిన తర్వాత ఇంటికి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ అధికారిణుల వెంట స్థానిక మహిళ ఎస్సైలు, సాయుధ బలగాలు ఉంటున్నాయి. ఈ కార్యక్రమానికి హార్ట్‌ టు హార్ట్‌ అని పేరు పెట్టారు.

జోన్ల వారీగా ఇన్‌చార్జ్‌లు ఇలా...

జోన్‌ అధికారిణి

సెంట్రల్‌ జోన్‌ ఐసీసీసీ డీసీపీ పుష్ఫ

ఈస్ట్‌ జోన్‌ ఉమెన్‌ సేఫ్టీ ఏసీపీ డి.ప్రసన్న లక్ష్మి

నార్త్‌ జోన్‌ స్థానిక డీసీపీ చందనా దీప్తి

సౌత్‌ జోన్‌ సీసీఎస్‌ డీసీపీ కె.శిల్పవల్లి

సౌత్‌ వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ నితిక పంత్‌

సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ ఉమెన్‌ సేఫ్టీ డీసీపీ డి.కవిత

వెస్ట్‌ జోన్‌ టీ–నాబ్‌ ఎస్పీ సునీతా రెడ్డి

మరిన్ని వార్తలు