రైళ్లన్నీ రద్దీ!

25 Oct, 2016 00:12 IST|Sakshi
రైళ్లన్నీ రద్దీ!

సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరాది రైళ్లు  ప్రయాణికులతో పోటెత్తుతున్నాయి. దీపావళి, చత్‌ పూజల దృష్ట్యా  నగరవాసులు  భారీ  సంఖ్యలో  సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. దీంతో  హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వైపునకు వెళ్లే  రైళ్లలో భారీ రద్దీ నెలకొంది. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా అదనపు రైళ్లను ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే అన్ని రైళ్లలో రిజర్వేషన్ బెర్తులు నిండిపోయాయి. కొన్నింటిలో వెయిటింగ్‌ లిస్టు వందల్లోకి చేరుకోగా,  మరికొన్ని రైళ్లలో రిగ్రెట్‌ దర్శనమిస్తోంది. ఒక్క సికింద్రాబాద్‌–పట్నాల మధ్య మాత్రమే వారానికి ఒక అదనపు రైలును ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి తత్కాల్‌ బోగీల్లో కూడా వెయిటింగ్‌ లిస్టు   50 నుంచి 100 వరకు పెరిగింది. ఉత్తరాది ప్రజలు ఎంతో ఘనంగా చేసుకొనే దీపావళి పర్వదినం, చత్‌ పూజల కోసం ప్రతి సంవత్సరం  నగరం నుంచి లక్షలాది మంది తరలివెళ్తారు. కానీ అందుకు తగిన విధంగా రైళ్లు అందుబాటులో లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

మరిన్ని వార్తలు