ఆర్టీసీలో మరో ఇంటిదొంగ

15 Dec, 2013 05:02 IST|Sakshi
ఆర్టీసీలో మరో ఇంటిదొంగ

రాణిగంజ్ డిపోలో రూ.10 లక్షలు స్వాహా
  కాంట్రాక్ట్ ఉద్యోగి ఘనకార్యం

 
సాక్షి,సిటీబ్యూరో: ఆర్టీసీలో మరో ఇంటిదొంగ గుట్టు రట్టయింది. ఉద్యోగుల జీతాల సొమ్ములోంచి ఏకంగా రూ.10 లక్షలు స్వాహా చేశారు.  రాణిగంజ్-1 డిపోలో జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఆఫీస్‌క్లర్క్‌గా పనిచేస్తున్న ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి శివాజీ సంస్థ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతం డబ్బును నొక్కేశాడు.  గతంలో మిధానీ డిపోలో జరిగిన ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి రావడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.

నగరంలోని అన్ని డిపోల్లోని అకౌంట్లను తనిఖీలు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ ఎ. కోటేశ్వరరావు ఆదేశించారు. గతంలో ఆర్టీసీలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఉద్యోగులూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులే కావడం గమనార్హం. ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన కొందరిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ కేటగిరీల్లో  వినియోగించుకుంటున్నారు. అలా విధులు నిర్వహిస్తున్న వారే ఇలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

గతనెలలో మిధాని డిపోకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి.. వాణిజ్య కార్యక్రమాల ద్వారా ఆర్టీసీకి లభించిన రూ.40 లక్షలను స్వాహా చేశాడు. స్టాళ్ల ద్వారా వచ్చిన ఆదాయానికి తప్పుడు లెక్కలు చూపించి అతను సొమ్ము కాజేశాడు.  ఈ ఘటనపై డిపో అధికారులు వెంటనే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తాజాగా, రాణిగంజ్-1 డిపో లో పని చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగి శివాజీ కూడా ఉద్యోగుల జీతాల కోసం విడుదల చేసిన చెక్కుల్లో అంకెలను మార్చేసి ఎక్కువ డబ్బు డ్రా చేసినట్టు డిపో మేనేజర్ గుర్తించారు. ఇతను విడతల వారీగా మొత్తం రూ.10  లక్షల వరకు స్వాహా చేసినట్టు అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అన్ని డిపోల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు...

 వరుసగా  జరుగుతున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని అన్ని డిపోల్లోనూ ఆదాయ,వ్యయాలపై కచ్చితమైన లెక్కలను సమర్పించాల్సిందిగా డిపో మేనేజర్‌లను ఆదేశించినట్లు ఈడీ చెప్పారు. ఆర్టీసీ సొమ్ము కాజేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, వారి నుంచి మొత్తం డబ్బు వసులు చేస్తామని ఆయన చెప్పారు.
 

మరిన్ని వార్తలు