రేషన్ డీలర్లకు రుణాలు | Sakshi
Sakshi News home page

రేషన్ డీలర్లకు రుణాలు

Published Sun, Dec 15 2013 4:53 AM

Loans for civil supply shops dealers

 ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో పౌర పంపిణీని సక్రమంగా నిర్వహించేందుకు చౌకడిపో డీలర్లకు బ్యాంకు రుణాలను  మం జూరు చేసేందుకు ప్రణాళికను అమలు చేస్తామని జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు అన్నారు. ఏలూరు ఐఏడీపీ హాల్‌లో శనివారం ఏలూరు డివిజన్ చౌకడిపో డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యావసర వస్తువుల పంపిణీలో భాగంగా డీడీలు చెల్లించేందుకు డీలర్ల ఆర్థికస్థితి సరిగా లేనందున రేషన్ సరుకులన్నీ ఒకేసారి అందించలేకపోతున్నారని చెప్పారు. ఒక్కో డిపో నిర్వహణకు నెలకు కనీసం రూ.లక్ష వరకు పెట్టుబడి అవసరం అవుతుందని.. ఇందులో సగం బ్యాం కు రుణంగా ఇప్పించేందుకు చౌకడిపో డీలర్ల సంఘాలను నెలకొల్పాలని నిర్ణయించినట్టు తెలిపారు. జనవరి నుంచి ఈ సంఘాల ద్వారా రుణాలు అందజేసే విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు.
 
 లోపాలు సరిదిద్దాలి
 పౌర పంపిణీలో లోపాలను సరిదిద్దేం దుకు ఆన్‌లైన్ పద్ధతి ప్రవేశపెట్టామని జేసీ తెలిపారు. నారేషన్ కార్యక్రమంలో డీలర్లపై పెద్దగా ఫిర్యాదులేమీ లేవని.. అయినా లబ్ధిదారులతో మా ట్లాడే విధానంలో మార్పు రావాలని సూచించారు. ఆధార్ సీడింగ్ ప్రక్రియలో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో ఉందని నెలాఖరుకు వంద శాతం అనుసంధానం పూర్తిచేయాలని కోరారు. వృత్తినైపుణ్యాన్ని పెంచుకుని సమయపాలన, సక్రమమైన తూకం తో వినియోగదారులకు సేవలందించాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సలీంఖాన్ మాట్లాడుతూ అమ్మహస్తం పథకం అమలులో జిల్లా కొన్ని సరుకుల పంపిణీలో ముందున్నా.. పసుపు, కారం, చింతపండు, ఆటా, గోధుమల పంపిణీలో వెనుకబడి ఉందన్నారు. దీనిని సరిచేసేందుకు డీలర్లు కృషిచేయాలని కోరారు. డీఎస్‌వో డి.శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాల మేరకు  డీలర్లు పనిచేయాలన్నారు. 
 
 తరుగు నివారించండి
 సమావేశంలో డీలర్లు 750 మందికిపైగా హాజరైనా వారి సమస్యలను అధికారులు తెలుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. అయితే ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద బియ్యం 50 కిలోల బస్తాకు కిలోన్నర తరుగు వస్తోందని, నూనె, చింతపండు ప్యాకెట్లు నిర్దేశిత సంఖ్య కన్నా తక్కువ వస్తున్నాయని జిల్లా చౌక డిపో డీలర్లు సంఘం అధ్యక్షుడు గాజులపాటి గంగాధరరావు జేసీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఏలూరు ఆర్డీవో  బి.శ్రీనివాస్ మాట్లాడుతూ వినియోగదారులతో గౌరవంగా మాట్లాడాలని, దుకాణాల వద్ద తప్పనిసరిగా స్టాక్‌బోర్డులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. తహసిల్దార్ ఏజీ చిన్నికృష్ణ, పి.సోమశేఖర్, ఏలూరు డీటీ ఎల్.విద్యాసాగర్, డీలర్లు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement