రాష్ట్రంలో మరో కల్తీ మద్యం కుంభకోణం

10 Jun, 2016 07:25 IST|Sakshi
రాష్ట్రంలో మరో కల్తీ మద్యం కుంభకోణం

* బ్రాండ్ మిక్సింగ్‌కు మద్యం మాఫియా సరికొత్త రూటు
* కేశినేని కార్గో సర్వీసు కేంద్రంగా మద్యం బాటిళ్ల మూతల సరఫరా
* శ్రీకాకుళంజిల్లాలో తీగ లాగితే కదిలిన కల్తీ మద్యం డొంక
* ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్ అదుపులోకి మూతల సరఫరా దారులు, కేశినేని ట్రావెల్స్ నిర్వాహకులు

సాక్షి, హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లాలో తీగ లాగితే మరో భారీ కల్తీ మద్యం కుంభకోణం డొంక కదిలింది. మద్యం బ్రాండ్ మిక్సింగ్ కోసం మూతల్ని ట్యాపింగ్ చేసిన వందల బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో గుర్తించారు.

వెంటనే ఎన్‌ఫోర్సుమెంట్ డైరక్టర్ వెంకటేశ్వరరావుకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి సమగ్ర విచారణ చేయాలని డైరక్టర్ ఆదేశించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్సుమెంట్ విభాగం హైదరాబాద్‌లోని నాచారంలో కేశినేని కార్గో సర్వీసు కేంద్రంగా బాటిళ్ల మూతలు పార్శిల్ చేస్తున్నారని తేల్చారు. వెంటనే నాచారంలోని కేశినేని కార్గో సర్వీస్ కార్యాలయంలో ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు గురువారం తనిఖీలు చేసి మద్యం బాటిళ్ల మూతల బాక్సులు కనుగొన్నారు.

అన్ని ప్రముఖ మద్యం బ్రాండ్లకు సంబంధించిన మూతల్ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు పార్శిల్ చేస్తున్నట్లు తేల్చారు. కేశినేని ట్రావెల్స్ నిర్వాహకుల్ని ప్రశ్నించి మూతల్ని సరఫరా చేస్తున్న సరఫరాదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎంత కాలం నుంచి బ్రాండ్ మిక్సింగ్‌కు మూతలు సరఫరా చేస్తున్నారో.. ఏ ఏ జిల్లాలకు సరఫరా చేశారో.. ఇందులో కేశినేని కార్గో సర్వీసు పాత్ర ఎంతో నిర్ధారించే పనిలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్ విభాగం ఉంది.
 
బ్రాండ్ మిక్సింగ్ అంటే?
బ్రాండ్ మిక్సింగ్ అంటే మద్యాన్ని డైల్యుషన్ చేయడం. ప్రీమియర్ బ్రాండ్లలో కొంత మద్యం తీసేసి చీప్ లిక్కర్ కలపడాన్ని బ్రాండ్ మిక్సింగ్ అంటారు.  ఇలాంటివాటిపై ఎక్సైజ్ అధికారులు విధిగా తనిఖీ చేయాలి. అయితే బ్రాండ్ మిక్సింగ్‌ను తేల్చి చెప్పే సాధనాలు ఏవీ ఎక్సైజ్ శాఖ వద్ద లేవు. అనుమానమున్న మద్యం బాటిళ్లను ఎక్సైజ్ ల్యాబొరేటరీలకు పంపాలి. రాష్ట్రంలో  ప్రయోగశాలలున్నా అవి అలంకార ప్రాయమయ్యాయి.
 
బెల్టుషాపుల ద్వారా విక్రయాలు..
మద్యం మాఫియా  సరికొత్త రూటును ఎంచుకుని ప్రీమియం బ్రాండ్ల మూతలు బాటిళ్లపై టాపింగ్ చేసి బెల్టు షాపుల ద్వారా విక్రయాలు చేస్తున్నారు. మద్యం డైల్యుషన్స్ అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. డైల్యుషన్ మద్యం సేవించి పలు జిల్లాల్లో మందుబాబులు మరణిస్తున్నారు. ఇటీవలే గుంటూ రు, అనంతపురం జిల్లాల్లో డైల్యుషన్ మద్యం తాగి పలువురు మత్యువాత పడ్డారు. ఇలా పలు ఘటనలు జరుగుతున్నా.. ప్రభుత్వం నియంత్రణ దిశగా చర్యలు చేపట్టడం లేదు.

మరిన్ని వార్తలు