నీటి లభ్యతపై దేశవ్యాప్త మదింపు

3 Nov, 2016 04:30 IST|Sakshi
నీటి లభ్యతపై దేశవ్యాప్త మదింపు

► ‘సాక్షి’తో  కేంద్ర జల సంఘం చైర్మన్ జీఎస్ ఝా
► 1993 తరువాత మదింపు ఇదే తొలిసారి
►వచ్చే ఏడాదికల్లా పూర్తయ్యే అవకాశం
► రైతులు పొదుపుగా నీటిని వాడాలని సూచన
 
 సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న నీటి వనరుల మదింపు కోసం కేంద్ర జల సంఘం చేస్తున్న ప్రయత్నాలు తుదిదశలో ఉన్నాయని సంస్థ చైర్మన్ జీఎస్ ఝా వెల్లడించారు. అత్యాధునిక సాఫ్ట్‌వేర్ సాయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాదికల్లా పూర్తవుతుందని చెప్పారు. 1993 తరువాత ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఇదే మొదటిసారని తెలిపారు. గత అంచనాల ప్రకారం దేశంలో మొత్తం 4,000 బీసీఎం (శతకోటి ఘనపు మీటర్లు) నీటి వనరులు అందుబాటులో ఉండగా.. అందులో 1,860 బీసీఎం నీరు ఆవిరిగా మారుతున్నట్లు లెక్కించారని చెప్పారు. వాతావరణ మార్పులపై జరిగిన ఒక సదస్సులో పాల్గొనేందుకు బుధవారం హైదరాబాద్ వచ్చిన జీఎస్ ఝా ‘సాక్షి’తో మాట్లాడారు. రెండేళ్ల వర్షాభావం తరువాత ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లలో సంతృప్తికరమైన స్థాయిలో నీరు అందుబాటులో ఉందని ఆయన చెప్పారు.

గతేడాది ఇదే సమయంతో పోలిస్తే రెట్టింపుగా, గత పదేళ్ల సగటు స్థాయికి సమానంగా జలాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయంపై తీవ్రంగా ఉండబోతోందన్న అంచనాల నేపథ్యంలో... రైతులు నీటిని వీలైనంత పొదుపుగా, సమర్థవంతంగా వాడుకోవాలని సూచించారు. భవిష్యత్తులో నీటి లభ్యత తగ్గే పరిస్థితులు వస్తే.. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చి సాగుకు వాడుకోవచ్చునని... ఇజ్రాయెల్, మధ్యప్రాచ్య దేశాలు ఇప్పటికే ఆ దిశగా ప్రగతి సాధించాయని తెలిపారు.
 
 పూడిక చేరకుండా చర్యలు
 
 శ్రీశైలం, తుంగభద్రలతోపాటు అనేక రిజర్వాయర్లలో పేరుకుపోయిన పూడికను తీయడం పెద్ద సమస్య కాకపోయినా.. తీసిన మట్టిని ఏం చేయాలన్నది కూడా చూడాలని జీఎస్ ఝా పేర్కొన్నారు. చాలా రిజర్వాయర్లలోని పూడిక సారవంతమైన మట్టి ఉన్నా.. కొన్నింటిలో ఇసుక మాత్రమే ఉందన్నారు. అయితే భవిష్యత్తులో రిజర్వాయర్లలో పూడిక చేరకుండా కొన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. వాతావరణ మార్పు ల కారణంగా హిమనీ నదాల (గ్లేసియర్స్) పరిమాణం తగ్గిపోతోందన్న వార్తల నేపథ్యంలో తాము హిమాలయాల్లోని దాదాపు 500 హిమనీనదాలపై అధ్యయనం చేశామన్నారు.

గత కొన్నేళ్లలో వాటిలో కొన్నింటి పరిమాణం తగ్గగా.. కొన్నింటి పరిమాణం 15 శాతం నుంచి 20 శాతం వరకూ పెరిగిందని చెప్పారు. దీని ఫలితంగా హిమనీనదాల పరిమాణం తగ్గుదలకు, వాతావరణ మార్పులకు ప్రత్యక్ష సంబంధం ఉందని కచ్చితంగా చెప్పలేకపోతున్నామని అన్నారు.

మరిన్ని వార్తలు