ఈ ఏడాది మినహాయించండి

17 May, 2016 02:29 IST|Sakshi
ఈ ఏడాది మినహాయించండి

♦ ‘నీట్’పై మరోసారి కేంద్రానికి రాష్ట్రం విన్నపం
♦ కనీసం రెండేళ్ల సమయం కావాలన్న ఆంధ్రప్రదేశ్
♦ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కేంద్రం
 
 సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: నీట్ కథ రోజుకో మలుపు తిరుగుతోంది! ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరే విద్యార్థులను మరింత గందరగోళ పరిచేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ‘నీట్’ ద్వారానే ప్రవేశాలు నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పినా.. అనేక రాష్ట్రాలు  తమ అభ్యంతరాలను తెలియజేస్తూనే ఉన్నాయి. సుప్రీం తీర్పును గౌరవిస్తామని, అయితే ఈసారికి మినహాయింపు ఇస్తే వచ్చే ఏడాది నుంచి నీట్‌కు సిద్ధమవుతామని అంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ హాజరయ్యారు.

నీట్ నుంచి ఈ ఏడాదికి మినహాయింపు ఇవ్వాలని ఆయన ద్వారా తెలంగాణ ప్రభుత్వం మరోసారి విన్నవించింది. ఒకవేళ నీట్ తప్పనిసరైతే తెలుగులో ప్రశ్నపత్రం ఉండాలని కోరింది. నీట్ నుంచి తమకు కనీసం రెండేళ్ల మినహాయింపు కావాలని ఈ సమావేశానికి హాజరైన ఏపీ ఆరో గ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు కూడా కేంద్రాన్ని కోరారు. దాదాపు 20కిపైగా రాష్ట్రాలు ఈ ఏడాది మినహాయింపు కోరినట్లు ఆయన వివరించారు.  ఇలా పలు రాష్ట్రాలు విన్నవిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించింది. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది.

రాష్ట్రాల అభ్యంతరాలు, ఆందోళనలపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని సుప్రీంకోర్టుకు చెబుతామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా సమావేశం అనంతరం విలేకరులకు తెలిపారు. కేంద్రం మళ్లీ సుప్రీంను ఆశ్రయిస్తే న్యాయస్థానం ఏం తీర్పు చెబుతుందోనన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలు ‘నీట్’ ద్వారా జరుగుతాయా? లేక ఎంసెట్ ద్వారా జరుగుతాయా? అన్న ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి.

 ఎంసెట్-2 తప్పదా..?
 కేంద్ర ప్రభుత్వం కూడా నీట్ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాల విన్నపాలను, ఎంపీల మొరను పరిశీలిస్తోంది. నీట్‌పై జరిగిన సమావేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చెప్పినట్లు సమాచారం. సుప్రీంకోర్టు రాష్ట్రాల అభ్యంతరాలను పునరాలోచిస్తే సరేసరి! అలా కాకుండా మళ్లీ పాత తీర్పునే పునరుద్ఘాటిస్తే కేంద్రం ఈ ఏడాదికి నీట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా ఆర్డినెన్స్‌ను తీసుకొస్తుందన్న చర్చ జరుగుతోంది. అలా ఆర్డినెన్స్ తీసుకొస్తే నీట్ నుంచి ఈ ఏడాదికి మినహాయింపు వచ్చే అవకాశాలుంటాయని అంటున్నారు.

అలాగైతే తెలంగాణలో ఎంసెట్ ద్వారానే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే ఎంసెట్ మెడికల్ ప్రవేశ పరీక్ష రెండ్రోజుల క్రితమే జరిగింది. దీన్ని కేవలం ఆయుష్ వైద్య సీట్లకు, వ్యవసాయ కోర్సులకు మాత్రమే నిర్వహించారు. ఈ పరీక్ష ఎంబీబీఎస్, బీడీఎస్‌లకు వర్తించదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేస్తూ ప్రకటన కూడా జారీచేసింది. కాబట్టి ఎంబీబీఎస్, బీడీఎస్‌ల కోసం మరోసారి ఎంసెట్ నిర్వహించే అవకాశాలుంటాయని వైద్య ఆరోగ్య శాఖ అత్యున్నత వర్గాలు చెబుతున్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు మెడికల్ ఎంసెట్-2 రాయక తప్పదన్న చర్చ జరుగుతోంది.

 ఆదివారం జరిగిన మెడికల్ ఎంసెట్‌ను 89,792 మంది రాశారు. ఈ సంఖ్య గతేడాది కన్నా ఎక్కు వ. నీట్‌పై ఇంకా గందరగోళమే నెలకొని ఉండడం వల్లే విద్యార్థులు పెద్ద సంఖ్యలో మెడికల్ ఎంసెట్‌కు హాజరయ్యారంటున్నారు. వాస్తవానికి ఆయుష్, వ్యవసాయ కోర్సుల్లో అడ్మిషన్లకు అంతమంది రాసే అవకాశమే లేదంటున్నారు. ఒకవేళ ఈసారి నీట్ నుంచి మినహాయింపు ఇస్తే మరోసారి ఎంసెట్ మెడికల్ ప్రవేశ పరీక్ష తప్పదని వైద్య, విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.
 
 మినహాయింపు కోరాం
 ఈసారికి నీట్ నుంచి మినహా యింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఢిల్లీ సమావేశంలో పాల్గొన్నారు. నీట్‌లో తెలుగు ప్రశ్నపత్రం అంశాన్ని లేవనెత్తారు. కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించాక న్యాయస్థానం మినహాయింపు ఇస్తే ఎంసెట్-2 తప్పకపోవచ్చు. అయితే ఇప్పటికిప్పుడే ఈ విషయంపై మాట్లాడటం సమంజసం కాదు. ఏం జరుగుతుందో చూద్దాం.
 - లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

>
మరిన్ని వార్తలు