పక్క దారిపట్టిందా?

15 Jun, 2017 02:45 IST|Sakshi
- ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య వెనక లీకులు
గతంలో రామకృష్ణారెడ్డి, చిట్టిబాబు వ్యవహారాల్లోనూ ఇదే సీన్‌
 
సాక్షి, హైదరాబాద్‌: సిద్దిపేట జిల్లాలో పది నెలల కాలంలోనే ముగ్గురు ఎస్‌ఐలు ఆత్మహత్య చేసుకున్నారు. ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే వారు బలవన్మరణాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నా.. వాటిని పక్కనపెట్టి ఏవేవో ఇతర కారణాలు తెరపైకి వచ్చాయి. గతేడాది ఆగస్టు 17న జరిగిన ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య వ్యవహారంలో ఉన్నతాధికారుల వేధింపులే కారణమని వెల్లడైనా పట్టించుకోలేదు. పైగా రామకృష్ణారెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని.. ఉన్నతాధికారుల హెచ్చరికలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడంటూ విచారణ పేరిట కేసును పక్కదారి పట్టించారు.

ఈ ఏడాది మార్చి 3న జరిగిన దుబ్బాక ఎస్‌ఐ చిట్టిబాబు ఆత్మహత్య వ్యవహారంలోనూ అదే తరహాలో వ్యవహరించారు. చిట్టిబాబు తన కుమారుడు, కోడలుతో గొడవపడ్డారని.. ఆ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రచారం చేశారు. అయితే అప్పటి డీఐజీ విచారణలో చిట్టిబాబు ఆత్మహత్యకు కోడలు పెట్టిన కేసు కారణం కాదని... సిద్దిపేట పోలీసు ఉన్నతాధికారుల వేధింపులు, అసభ్యకర ప్రవర్తనే కారణమని తేలింది. అయినా సంబంధిత అధికారులపై చర్యలు లేవు. తాజాగా ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి విషయంలోనూ ఉన్నతాధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు, తోటి ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు. అయితే దీనిని పక్కదారి పట్టించేందుకు శిరీషపై అత్యాచారయత్నం లింకు పెడుతూ లీకులు ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మూడు ఘటనల్లోనూ పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
హడావుడేనా.. చర్యలుంటాయా?
వాస్తవానికి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య ఘటనకు సంబంధించి డీఐజీ అకున్‌ సబర్వాల్‌ విచారణ జరిపి పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చారు. డీఎస్పీ, సీఐల వేధింపులు కూడా ఆయన ఆత్మహత్యకు కారణమయ్యాయని అందులో పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఆ ఇద్దరు అధికారులపై క్రిమినల్‌ కేసులు పెట్టారు. కానీ ఆ కేసు ఏమైంది? దర్యాప్తు జరుగుతుందా? అన్న విషయాలను ఇప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఎస్‌ఐల ఆత్మహత్యలపై హడావుడి తప్ప చర్యలేమీ ఉండవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
మరిన్ని వార్తలు