భూమా పార్టీలోనే కొనసాగుతారు

21 Feb, 2016 02:28 IST|Sakshi
భూమా పార్టీలోనే కొనసాగుతారు

వైవీ సుబ్బారెడ్డి, సజ్జల వెల్లడి

 సాక్షి, హైదరాబాద్ : భూమా నాగిరెడ్డి తమ పార్టీలోనే కొనసాగుతారని వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వీరిద్దరూ  శనివారం పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డితో పాటు భూమా నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. భూమా పార్టీని వీడుతున్నట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వారు ఆయన వద్దకు వెళ్లారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... నాగిరెడ్డి తమ పార్టీ సీనియర్ నాయకుడని, ఆయన పార్టీలోనే కొనసాగుతున్నారని స్పష్టంచేశారు.

భూమా పార్టీని వీడుతున్నట్లు మీడియా సృష్టించిన వార్తలపై స్పష్టత కోసమే ఆయన వద్దకు వచ్చామని వారు మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను తన కుమార్తె  నిశ్చితార్థం పనుల్లో బిజీగా ఉంటే ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయో తనకూ తెలియడం లేదని ఆయన తమతో చెప్పారని తెలిపారు. నంద్యాలలో శుక్రవారం పార్టీ కార్యకర్తలు సమావేశమైనపుడు, స్థానిక మీడియా ప్రతినిధులు అడిగినపుడు పార్టీ వీడుతున్నట్లు భూమా చెప్పారని ప్రతినిధులు ప్రశ్నించగా... అసలు అక్కడ కార్యకర్తల సమావేశం గాని, విలేకరుల సమావేశం గానీ జరుగనే లేదని వైవీ వివరించారు. వాస్తవానికి భూమా నంద్యాలకు వెళ్లింది కోర్టు కేసు పనులపైనని తెలిపారు.

టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఎలా కేసులు పెట్టి వేధిస్తోందో అనే విషయం కూడా భూమా తమకు చర్చల సందర్భంగా చెప్పారని పేర్కొన్నారు. పార్టీ వీడుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని భూమా ఎందుకు ఖండించలేదని ప్రశ్నించగా... తాను పార్టీని వీడుతున్నట్లు భూమా ఎక్కడ చెప్పలేదని, అలాంటపుడు ఖండించే అవసరం ఏముందన్నారు. ఈ సమస్యకు ఇంతటితో పుల్‌స్టాప్ పడినట్లేనా? అని ప్రశ్నించగా... ‘అసలిక్కడ ఎలాంటి సమస్యా లేదు... పుల్‌స్టాప్ పడటానికి. అంతా మీరే సృష్టించారు అంతే’ అని రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ వీడుతున్నట్లు వచ్చిన ప్రచారాన్ని ఐజయ్య, జయరామయ్య తీవ్రంగా ఖండించారని గుర్తుచేశారు. దీన్ని బట్టే ఇలాంటి వార్తల్లో నిజమెంతో తెలుస్తోందన్నారు. ఇవాళ కర్నూలు ఎమ్మెల్యేలు జగన్‌కు కలిసిన నేపథ్యంలో భూమా కూడా ఆయనను కలుసుకునే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ఈ రోజని కాదు, వైఎస్సార్‌సీపీ నేతగా నాగిరెడ్డి జగన్‌ను ఎపుడైనా కలుసుకోవచ్చునని ఆయన సమాధానం ఇచ్చారు.

మరిన్ని వార్తలు