డిటో...

22 Mar, 2016 03:37 IST|Sakshi
డిటో...

2009లో ఖాద్రీ... 2016లో అభయ్ కారణాలు వేరైనా ఒకే నేర విధానం  రెండూ జరిగింది  బుధవారమే


దక్షిణ మండల పరిధిలోని శాలిబండ ప్రాంతంలో 2009లో జరిగిన ఖాద్రీ... పశ్చిమ మండల పరిధిలోని షాహినాయత్‌గంజ్ ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకున్న అభయ్... ఈ రెండు ఉదంతాల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. వీరి అపహరణలు జరగడానికి కారణాలు వేరైనా... హత్యలు జరిగిన విధానం మాత్రం ఒక్కటే. ఈ కేసుల్లోనూ ముగ్గురేసి చొప్పునే నిందితులు ఉండగా... బుధవారమే కిడ్నాప్‌లు, అదే రోజు హత్యలు జరిగాయి. ఈ కేసుల్లో నిందితులు తప్పించుకునే ప్రయత్నాల్లో రాష్ట్రం దాటిన వారే.  ఈ రెండు కిడ్నాప్, హత్యల మధ్య సారూప్యతలు ఇలా...   - సాక్షి, సిటీబ్యూరో

 

హతుడు   సయ్యద్ ఉస్మాన్ మహ్మద్ ఖాద్రి (10) 
నివాసం      పాతబస్తీలోని శాలిబండలో ఉన్న ఖాజీపుర జరిగింది: 20.05.2009 (బుధవారం)
నిందితులు వ్యాపార భాగస్వామి, బాలుడి తండ్రైన సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాద్రీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తనను మోసం చేస్తున్నాడని భావించిన అనీసుద్దీన్

 

కిడ్నాప్ ఇలా
ఖాదర్ ఇంట్లో చనువు ఉన్న అనీస్... ఖాద్రీకి బైకు డ్రైవింగ్ నేర్పిస్తానని చెప్తూ వల్లో వేసుకున్నాడు. బంధువుల ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలుడిని డ్రైవింగ్ నేర్పుతాన ంటూ తన పల్సర్ వాహనంపై ఎక్కించుకుని కిడ్నాప్ చేశాడు.

 

హతమైందిలా
శంషాబాద్ వైపు వెళ్లే మార్గంలో జతకట్టిన మిగిలిన ఇద్దరు నిందితులూ... ఖాద్రీని మారుతీ వ్యాన్‌లోకి మార్చారు. మార్గం మధ్యలో పోలీసుల చెక్‌పోస్ట్ ఉండటంతో వారి కంట పడకూడదని భావించారు. దీనికోసం అప్పటికే గొడవ చేస్తున్న ఖాద్రీని ఆ పాయింట్ దాటే వరకు నోరు మూసి వాహనం కిటికీల్లోంచి కనపడనంత కిందకు ఉంచాలని భావించిన నిందితులు... పొరపాటున నోరు కూడా మూసేయడంతో చనిపోయాడు.


మృతదేహాన్ని ఏం చేశారంటే
చెకింగ్ పాయింట్ దాటిన తర్వాత ఖాద్రీని గమనించిన నిందితులు అతడు చనిపోయినట్లు గుర్తించారు. దీంతో మృతదేహాన్ని మాయం చేయాలనే ఉద్దేశంతో షాద్‌నగర్ ప్రాంతంలో పూడ్చి పెట్టారు.

 

చంపేశాక డిమాండ్లు
కిడ్నాప్ చేసిన గంటలోపే బాలుడిని చంపేసిన దుండగులు ఆపై బోగస్ వివరాలతో తీసుకున్న సిమ్‌కార్డులు వినియోగించి అతడి తండ్రికి ఫోన్లు చేసి,ఎస్సెమ్మెస్‌లు ఇచ్చి డబ్బు డిమాండ్ చేశారు.

 

చిక్కే ముందు హై‘డ్రామా’
పదో తరగతి మాత్రమే చదివిన అనీస్ నేరం చేశాక తెలివిగా వ్యవహరించాడు. అరెస్టుకు ముందు శాలిబండ పోలీసులు అదుపులోకి తీసుకునేసరికి... తనకు అనేక రుగ్మతలు ఉన్నాయని, ఇంటరాగేషన్ చేయకూడదంటూ నకిలీ పత్రాలు చూపించి బయటపడ్డాడు. వెంటనే తన తండ్రి సహాయంతో తానే కిడ్నాప్ అయినట్లు డ్రామా ఆడించాడు.హైదరాబాద్ నుంచి పరారైన నిందితులు మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్‌ల్లో తిరిగారు. ఎట్టకేలకు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు.

 

హతుడు    అభయ్ మోదాని (15)
నివాసం      షాహినాయత్‌గంజ్ పరిధిలోని జ్ఞాన్‌బాగ్‌కాలనీ   జరిగింది: 16.03.2016 (బుధవారం)
నిందితులు ఇందుగుగమల్లి శేషుకుమార్ అలియాస్ సాయిరామ్, పొందర రవి, నంబూరి మోహన్
కారణం         సినిమాల్లో చేరేందుకు నటనా పాటవంతో పాటు డబ్బు కూడా అవసరమని భావించిన ముగ్గురు నిందితులు

 

కిడ్నాప్ ఇలా
అభయ్ ఇంటికి సమీపంలోని ఇంట్లో పని చేసిన సాయికి బాలుడితో చనువు ఉంది. టిఫిన్ తీసుకురావడానికి వచ్చిన అభయ్‌ను లిఫ్ట్ ఇవ్వమని కోరి అతడి వాహనం పైనే కిడ్నాప్ చేసి రూమ్‌కు తీసుకువెళ్లాడు.

 

హతమైందిలా
బాలుడిని హిందీనగర్‌లోని తమ ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత కిడ్నాప్ చేస్తున్నట్లు చెప్పారు. దీంతో అతడు వద్దని చెప్పడంతో గలాభా చేస్తారని భయపడ్డారు. అలా కాకుండా ఉండాలని చేతులకు, నోటికి ప్లాస్టర్ వేయడానికి ఉపక్రమించారు. ఆ ప్లాస్టర్ పొరపాటున నోటితో పాటు ముక్కుకూ పడటంతో అభయ్ చనిపోయాడు. పది నిమిషాల తర్వాత నిందితులు ఈ విషయాన్ని గుర్తించారు.

 

మృతదేహాన్ని ఏం చేశారంటే
ఫ్రిజ్‌కు చెందిన అట్టపెట్టే, ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్స్‌లో పార్శిల్ చేసి ఆటో ట్రాలీ, ప్యాసింజర్ ఆటోల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు తీసుకువెళ్లారు. రైలులో వదిలేద్దామని భావించినా... సాధ్యంకాకపోవడంతో ఆల్ఫా హోటల్ వద్ద విడిచిపెట్టేశారు.

 

చంపేశాక డిమాండ్లు
కిడ్నాప్ జరిగిన గంటలోనే అనుకోకుండా హత్య జరగడంతో పారిపోయేందుకు సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన దుండగులు రైలు నుంచే బేరసారాలు మొదలెట్టారు.

 

చిక్కే ముందు హై‘డ్రామా’
పదో తరగతి మాత్రమే చదివిన ప్రధాన నిందితుడు సాయి... పరారైన నాటి నుంచి మీడియాను గమనిస్తూ పోలీసుల కదలికలు తెలుసుకున్నాడు. ఎలాగైనా దొరికిపోతానని భావించి ఆత్మహత్యాయత్నం చేశాడు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు పారిపోయిన నిందితులు పొరుగున ఉన్న ఒడిశాలోకీ ఎంటర్ అయ్యారు. టాస్క్‌ఫోర్స్ బృందాలకే చిక్కారు.

మరిన్ని వార్తలు