రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన ఉందా!

25 Jul, 2017 01:11 IST|Sakshi
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన ఉందా!
ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స
 
సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన చూస్తూంటే రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేక ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏమైనా అమలు చేస్తున్నారా! అనే అనుమానం కలుగుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా సెక్షన్‌ 30, సెక్షన్‌ 144 విధిస్తున్నారని...  కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉందని తెలిపారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, మరో నేత కొట్టు సత్యనారాయణతో కలిసి విలేకరుల తో మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా కాపు నేతలపై పోలీసులు బైండోవర్‌ కేసులు పెట్టడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తోంటే ప్రభుత్వం కుట్రలు చేసి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని, అసలు ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచడం ఏమిటి? పద్మనాభం ఏమైనా దేశ ద్రోహా? అని బొత్స ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కాశ్మీర్‌లో కూడా ఉండవన్నారు. 
 
ఎవరేం చేసినా జగన్‌పైనే విమర్శలా!
రాష్ట్రం ఎక్కడ ఏం జరిగినా వైఎస్సార్‌సీపీపై అపవాదులు వేయడం వాటి వెనుక తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఉన్నారని నిందలు మోపడం టీడీపీ నేతలకు అలవాటైందని బొత్స మండిపడ్డారు. ముద్రగడ పాదయాత్ర చేసినా, మంద కృష్ణ ఏం మాట్లాడినా, ఐవైఆర్‌ కృష్ణారావు ఏం చెప్పినా జగన్‌పైనే నిందలు వేస్తారా? అని నిలదీశారు. 
మరిన్ని వార్తలు