అప్పట్లో 'పోచారం'తో రాజీనామా కోరినట్లే...

10 Mar, 2016 20:04 IST|Sakshi
అప్పట్లో 'పోచారం'తో రాజీనామా కోరినట్లే...

-రాజధానిలో భూముల కుంభకోణంపై వార్తలొస్తే మంత్రుల రాజీనామాలేవీ?
-సీఎం చంద్రబాబును ప్రశ్నించిన సి.రామచంద్రయ్య


హైదరాబాద్ : కేవలం రూ.75 లక్షల కుంభకోణంపై పత్రికలో వచ్చిన వార్తకు అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో రాజీనామా కోరినట్లే.. ప్రస్తుతం రాజధానిలో వేల కోట్ల భూ కుంభకోణాలపై పత్రికలో వార్తలొస్తే వాటికి సంబంధం ఉన్న మంత్రులతో రాజీనామా కోరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  తన నిజాయితీ నిరూపించుకోవాలని మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు.

గురువారం శాసన మండలి మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నిజాయితీగా లేనందున రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. విచ్చలవిడి అవినీతి వల్లే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదన్నారు. అవినీతిపై సభలో ప్రశ్నిస్తే ఆధారాలు ఇవ్వండి అంటూ ప్రతిపక్ష సభ్యులపై ఎదురు దాడి చేయడం సమంజసం కాదన్నారు. ఆధారాలు నిరూపించేది ప్రజాప్రతినిధులు కాదని, ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తే వాటికి సంబంధించిన ఆధారాలు అధికారులు సేకరిస్తారనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలన్నారు.

తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు నిజాయితీని నిరూపించుకునేందుకు విచారణ చేయించాల్సింది పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు విరుద్ధంగా ఏమాత్రం సిగ్గులేకుండా విచారణకు ఆదేశించేది లేదని తేల్చి చెప్పడం సమంజసం కాదన్నారు. నూతన రాజధాని నిర్మాణానికి ఒక ఇటుక కూడా పెట్టకముందే అవినీతి రాజధాని అయ్యిందని సి.రామచంద్రయ్య ఆరోపించారు. భూముల కుంభకోణంలో కేంద్రం జోక్యం చేసుకొని విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇసుక అక్రమార్కులను వెనకేసుకొస్తున్న ప్రభుత్వం ఇసుకను అక్రమంగా రవాణా చేసుకొని సొమ్ము చేసుకున్నవారిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం రక్షిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, డి.చిన్న గోవిందరెడ్డిలు ఆరోపించారు.

శాసన మండలి మీడియా పాయింట్‌లో వారు మాట్లాడుతూ.. రాజమండ్రి బ్రిడ్జిలంక సొసైటీలో అక్రమాలు జరిగినట్లు గుర్తించినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అధికారికంగా 10 ట్రిప్పుల ఇసుక చూపి అనధికారికంగా 100 ట్రిప్పులను రవాణా చేసి కోట్లాది రూపాయలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. నది నుంచి ఇసుకను తీసుకొస్తున్న బోట్ మెన్‌కు ఇవ్వాల్సిన డబ్బులు కూడా బ్రిడ్జిలంక సొసైటీ సభ్యులు ఇవ్వడంలేదని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని మంత్రి పీతల సుజాత దృష్టికి తీసుకెళ్లగా విచారణ చేసి మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు.

ఉమ్మడి సర్వీస్ రూల్స్ వెంటనే అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలి :
 
పంచాయితీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్‌పై రాష్ట్ర విద్యాశాఖ పంపిన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించి వెంటనే ఉత్తర్వులు తెప్పించేలా తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు పీఆర్టీయూ ఎమ్మెల్సీలు బచ్చల పుల్లయ్య, గాదె శ్రీనివాసులు నాయుడు, ఎ.ఎస్.రామకృష్ణలు తెలిపారు.

వారు మాట్లాడుతూ.. ఉమ్మడి రూల్స్‌కు సంబంధించిన ఫైల్ కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఉపాధ్యాయుల పదోన్నతులు ఆగిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 2014 సెప్టెంబర్ నుంచి ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానం కాకుండా పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలని కోరినట్లు వారు తెలిపారు.

మరిన్ని వార్తలు