బోగస్ సర్టిఫికెట్‌లపై సీబీసీఐడీ విచారణ!

22 Jan, 2015 23:53 IST|Sakshi

రవాణా శాఖ ప్రిన్సిపల్
కార్యదర్శికి సీఎం ఆదేశాలు
గుర్తింపు లేని వర్సిటీ సర్టిఫికెట్‌లతో
 ఆర్టీఏలో పదోన్నతులు

 
సిటీబ్యూరో: రవాణా శాఖలో గత సంవత్సరం తీవ్ర  కలకలం సృష్టించిన రాజస్థాన్ వర్సిటీ సర్టిఫికెట్‌ల ఉదంతంపై  తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మకు ఈ నెల 19వ తేదీన స్పష్టమైన  ఆదేశాలు జారీ చేసినట్లు  తెలిసింది. చెల్లుబాటు కాని ఆటోమోబైల్ డిప్లొమా సర్టిఫికెట్‌ల ఆధారంగా కొందరు ఆర్టీఏ కానిస్టేబుళ్లు  సహాయ మోటారు ఇన్‌స్పెక్టర్‌లుగా (ఏఎంవీఐలు) పదోన్నతులు పొందడమే కాకుండా, ప్రస్తుతం మోటారు వాహన ఇన్‌స్పెక్టర్లుగా (ఎంవీఐలు) కూడా మరోసారి  పదోన్నతిని పొం దేందుకు సిద్ధంగా ఉన్నారు. రవాణా శాఖలో ఏడాది కాలంగా వివిధ స్థాయిల్లో చర్చనీయాంశంగా మారిన ఈ ఉదంతంపై ఇటీవల కొందరు నిరుద్యోగులు, ‘తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రివెన్షన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ’ ప్రతినిధులు ఇటీవల సీఎంను కలిసి ఈ అక్రమ పదోన్నతులపై ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను సైతం సీఎంకు అందజేయడంతో ఆయన దీనిపై సమగ్రమైన విచారణ  కోరినట్లు  తెలిసింది.

చెల్లుబాటు కావు....

ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అప్పటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి సంస్థలు రాజస్థాన్ వర్సిటీ సర్టిఫికెట్‌లు చెల్లబోవని ఏడాది క్రితమే తేల్చిచెప్పాయి. ఈ క్రమంలోనే  రాజస్థాన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ డీమ్డ్ వర్సిటీ (ఐఏఎస్‌ఈ) అందజేసే  ఈ ఆటోమోబైల్ డిప్లొమా సర్టిఫికెట్ ఆధారంగా గతంలో ఏఎంవీఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న జితేందర్ అనే ఓ నిరుద్యోగి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం ఏపీపీఎస్సీ వాదననే బలపరిచింది. అయినప్పటికీ ఈ సర్టిఫికెట్ల ఆధారంగానే 50 మందికి పైగా ఆర్టీఏ కానిస్టేబుళ్లు పదోన్నతి పొందారు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులుమారినట్లు సమాచారం.
 
 
 

మరిన్ని వార్తలు