ఆసిఫ్‌ది హత్యే | Sakshi
Sakshi News home page

ఆసిఫ్‌ది హత్యే

Published Thu, Jan 22 2015 11:56 PM

ఆసిఫ్‌ది హత్యే

నిర్ధారించిన పోలీసులు
తోటి బాలుడే నిందితుడు

 
సిటీబ్యూరో:  సైదాబాద్‌లోని ప్రభుత్వ బాలుర గృహం (జువెనైల్ హోమ్)లో బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాలుడు ఆసిఫ్ (12)ది హత్యగా పోలీసుల విచారణలో తేలింది. తాను లైంగికదాడికి యత్నించిన విషయాన్ని జువైనల్ హోం అధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆసిఫ్ బెదిరించడంతో గొంతు పిసికి చంపేశానని అదే హోమ్‌లో ఉంటున్న హరీష్ (16..పేరు మార్చబడింది) వెల్లడించాడు. వివరాలు... సైదాబాద్‌లోని ప్రభుత్వ బాలుర గృహం (జువెనైల్ హోమ్)లో ఆసిఫ్ 2013 ఆగస్టు నుంచి ఉంటున్నాడు. కాగా,  మంగళవారం రాత్రి  హోంలోని మెడికల్ వార్డులో ఆసిఫ్, హరీష్‌లతో పాటు మరో ఏడుగురు పడుకున్నారు. అర్ధరాత్రి ఆసిఫ్‌ను హరీష్ నిద్రలేపి లైంగికదాడికి యత్నించాడు. ఆసిఫ్ ప్రతిఘటించడంతో పాటు విషయాన్ని హోం అధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. దీంతో తన బండారం బయట పడుతుందని భావించిన హరీష్..  నీళ్లు తాగుదామని ఆసిఫ్‌ను వంట గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ దాడి చేసి గొంతుపిసికి చంపేశాడు. తర్వాత మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నించాడు. వీలు కాలేక పోవడంతో శవాన్ని లాక్కొచ్చి అతని బెడ్‌పై పడేశాడు. బుధవారం ఉదయం ఆసిఫ్ నిద్రలేవకపోవడంతో సూపర్‌వైజర్లు శివశంకర్‌రెడ్డి, నరేందర్ అతడిని లేపేందుకు యత్నించారు. చలనం లేకపోవడంతో చనిపోయాడని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో హరీష్ తన నేరాన్ని అంగీకరించాడు.  బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావు గురువారం ఉదయం హోంను సందర్శించి అక్కడి పిల్లల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడు హరీష్‌ను శుక్రవారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు. ఆసిఫ్ మృతదేహానికి పోలీసులు ఉస్మానియాలో పోస్టుమార్టం చేయించి తండ్రికి అప్పగించారు.
 
ఇద్దరు సూపర్‌వైజర్ల సస్పెన్షన్...

 హోమ్ సూపర్‌వైజర్లు శివశంకర్‌రెడ్డి, జి.నరేందర్‌లు విధులపై నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ దారుణం జరిగిందని విచారణలో తేలడంతో అధికారులు వారిద్దరినీ విధుల నుంచి సస్పెండ్ చేశారు.
 

Advertisement
Advertisement