మీకు మీరే.. మాకు మేమే..!

13 Mar, 2017 03:17 IST|Sakshi
మీకు మీరే.. మాకు మేమే..!

పింఛన్‌ లబ్ధిదారులకు తన వాటా సొమ్మును నేరుగా ఇవ్వనున్న కేంద్రం

ఏప్రిల్‌ 1 నుంచి అమలుకు నిర్ణయం
లబ్ధిదారుల ఆధార్‌ వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన


సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ కార్యక్రమాల అమల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి తెర తీసింది. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలకు చెల్లింపుల విష యంలో.. ‘మా దారి మాదే..’ అంటోంది. ఈ మేరకు రాష్ట్రానికి సూచనలు ఇచ్చినట్లు తెలు స్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధి హామీ, ఆసరా పింఛన్లు.. తదితర సంక్షేమ, అభివృద్ధి కార్య క్రమాలకు కేంద్రం తన వాటాగా ఇవ్వా ల్సిన నిధులను ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తోంది. ఇకపై ఈ పథకాలకు సంబంధించి తమ వాటాగా లబ్ధిదారులకు చెల్లించాల్సిన సొమ్మును నేరుగా అందించాల ని నిర్ణయించింది.

గత జనవరి 1 నుంచి ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన వేతనాలను కేంద్రం నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమచేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు కేంద్రం నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ మేనేజ్‌మెం ట్‌ వ్యవస్థ(ఎన్‌ఈఎఫ్‌ఎంఎస్‌)ను ఏర్పాటు చేసుకుంది. ఇదే విధానాన్ని ఆసరా పింఛన్‌ సొమ్ము పంపిణీకీ వర్తింపచేయాలని తాజాగా నిర్ణయించింది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం(ఎన్‌ఎస్‌ఏపీ)కింద కేంద్రం రాష్ట్రా నికి 6.32 లక్షల పింఛన్లు మంజూరు చేసింది. లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీకి ఏటా రూ.209 కోట్లు రాష్ట్ర ఖాతాకు జమ చేస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచి కేంద్ర ఖాతా నుంచే లబ్ధిదా రులకు నేరుగా చెల్లింపులు జరపాలని నిర్ణ యించినందున, లబ్ధిదారుల ఆధార్, మొబైల్‌ నంబర్ల వివరాలను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పింఛన్‌ సొమ్ము జమ కాగానే లబ్ధిదారుల మొబైల్‌ నంబర్‌కు సంక్షిప్త సమాచారాన్ని పంపుతుంది.

పింఛన్‌ సొమ్ము వేర్వేరుగా జమ
రాష్ట్రంలో ఆసరా పింఛన్ల పంపిణీలో కొద్ది పాటి మార్పులు చోటు చేసుకోను న్నాయి. పింఛన్ల సొమ్మును కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాల కింద వేర్వేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నాయి. రాష్ట్రంలో ఆసరా పెన్షనర్లు 36 లక్షల మంది ఉండగా.. కేంద్ర ప్రభుత్వం 6.32 లక్షల మందికి ఎన్‌ఎస్‌ఏపీ కింద పింఛన్లు మంజూరు చేసింది. కేంద్రం తమ నిబంధనల మేరకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు మాత్రమే పింఛన్‌ ఇస్తుండగా... రాష్ట్రం ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు కూడా ఆసరా పథకం కింద ఆర్ధిక భృతిని అందిస్తోంది.

వికలాంగులకు రూ.1,500, మిగిలిన కేటగిరీ పెన్షనర్లకు రూ.1,000 చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తోంది. కేంద్రం మాత్రం 80 ఏళ్లలోపు వృద్ధులకు రూ.200, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500, వికలాంగులు, వితంతువులకు రూ.300 చొప్పున అందజేస్తోంది. కేంద్రం ఇచ్చిన సొమ్ముతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తోంది. అయితే కేంద్రం నుంచి కొంత సొమ్ము వస్తున్న సంగతి లబ్ధిదారులకు తెలియడం లేదు. ఎన్‌ఎస్‌ఏపీ కింద పింఛన్లకు కేంద్రం కొంత మేరకు నిధులు ఇస్తున్నా.. ఆ క్రెడిట్‌ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకే చేరుతోంది. అంతేకాకుండా.. ఆసరా లబ్ధి దారులకు పింఛన్‌ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విడుదల చేయక పోతుండడం కూడా కేంద్ర తాజా నిర్ణయానికి కారణంగా కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు