ఏందీ మూకుమ్మడి సెలవులు?

12 Apr, 2015 03:50 IST|Sakshi
ఏందీ మూకుమ్మడి సెలవులు?

హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రి వైద్యులపై సీఎం కేసీఆర్ ఫైర్
ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ముఖ్యమంత్రి
ఆర్‌ఎంవో, సూపరింటెండెంట్ లేకపోవడంతో ఆగ్రహం
ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ లోపంపై మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ‘సీనియర్ వైద్యులంతా ఒకేసారి సెలవులో వెళితే ఎలా..? అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్యం ఎవరు చేస్తారు..?’..

అంటూ హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రి వైద్యులపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడాన్ని గమనించిన ఆయన.. ఇలాగైతే రోగులు ఎలా కోలుకుంటారని మండిపడ్డారు. శనివారం ఉదయం 11.30 సమయంలో సీఎం కేసీఆర్ ఫీవర్ ఆస్పత్రిలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోలతో పాటు ఉండాల్సిన 20 మంది వైద్యుల్లో పది మంది కూడా లేకపోవడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ ఒక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారని, ఆర్‌ఎంవో సెలవులో ఉన్నారని సిబ్బంది చెప్పడంతో.. సీఎం నిర్ఘాంతపోయారు. సీనియర్ వైద్యులంతా శనివారం, ఆదివారం రాగానే సాకులు చెబుతూ ఒకేసారి సెలవు పెడితే... అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన రోగులకు చికిత్స ఎవరు చేస్తారని ప్రశ్నించారు. సకాలంలో వైద్యం అందక రోగులెవరైనా మృత్యువాత పడితే బాధ్యత ఎవరిదంటూ నిలదీశారు. ఈ తనిఖీల సందర్భంగా సీఎం వెంట మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డితో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్మల తదితరులు ఉన్నారు.
 
చర్యలు చేపడతాం..: డీఎంఈ శ్రీనివాస్
అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వైద్యులు, ఇతర సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వైద్య విద్యా డెరైక్టర్ (డీఎంఈ) పుట్టా శ్రీనివాస్ చెప్పారు. శనివారం ఉదయం ఫీవర్ ఆస్పత్రిని సీఎం కేసీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వెళ్లిన అనంతరం మధ్యాహ్నం సమయంలో ఫీవర్ ఆస్పత్రికి డీఎంఈ చేరుకున్నారు. విధులకు హాజరై కూడా బయటకు వెళ్లిన సిబ్బంది ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు చేపడతామని చెప్పారు.
 
పరిశుభ్రత ఏది..?

ఆస్పత్రి ఆవరణలో భారీగా చెత్తాచెదారం ఉండడాన్ని గమనించిన సీఎం.. ఇలాగైతే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఎలా కోలుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి కాంపౌండ్ వాల్‌ను ఆనుకుని ఉన్న ఇళ్లలోంచి జనం చెత్త వేస్తున్నారని సిబ్బంది చెప్పగా.. అలా వేసేవారికి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో ఈస్ట్‌జోన్ పోలీసులతో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి చెత్తాచెదారాన్ని తొలగించాల్సిందిగా అక్కడే ఉన్న డీసీపీ రవీందర్‌కు సూచించారు. అవసరమైనే తాను కూడా తట్టపట్టి చెత్త ఎత్తుతానని సీఎం పేర్కొన్నారు.

అనంతరం ఫైలేరియా, స్వైన్‌ఫ్లూ వార్డులను సీఎం పరిశీలించారు. వైద్యసేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పాత భవనాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీఎం... రోగుల కోసం ఖాళీ స్థలంలో కొత్త భవనాలు నిర్మిస్తామని, ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్‌కు అందజేయాలని సూచించారు. ఈ సందర్భంగా స్టాఫ్ నర్సు పోస్టులన భర్తీ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు కోరగా... పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు