ఏపీ సెక్రటేరియట్ తరలింపునకు కౌంట్ డౌన్!

23 Sep, 2016 20:44 IST|Sakshi

హైదరాబాద్: ఏపీ సెక్రటేరియట్ తరలింపునకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వెలగపూడి సచివాలయం నుంచి పనిచేయడానికి ఇక పది రోజులు మాత్రమే మిగిలింది. ఈ నేపథ్యంలో సచివాలయంలోని అన్ని శాఖలు కంప్యూటర్లు, ఫర్నీచర్ ప్యాకింగ్‌ల్లో నిమగ్నమయ్యాయి. ఈ విషయంలో మున్సిపల్. ఆర్థిక శాఖ ముందంజలో ఉన్నాయి. సచివాలయంలోని మున్సిపల్ శాఖ మంత్రి కార్యాలయంతో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులకు చెందిన కంప్యూటర్లను ఇప్పటికే వెలగపూడికి తరలించేశారు. మరో పక్క కంప్యూటర్లు, ఫర్నీచర్, ఫైళ్ల ప్యాకింగ్‌ను ఆర్థిక శాఖ శుక్రవారమే పూర్తి చేసింది. శని, ఆదివారాల్లో కంప్యూటర్లను వెలగపూడి సచివాలయానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఫర్నీచర్‌తో పాటు కొన్ని రకాల ఫైళ్లను శాఖాధిపతులు కార్యాలయాలున్న ఇబ్రహీంపట్నం తరలించేందుకు ఆర్థిక శాఖ ఏర్పాటు చేసింది. శుక్రవారం ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర కంప్యూటర్లు, ఫర్నీచర్ ప్యాకింగ్ ప్రక్రియను స్వయంగా సెక్షన్లకు వెళ్లి పర్యవేక్షించారు.

వెలగపూడిలో ఆర్థిక శాఖకు కేటాయించిన భవనాల్లో ఇంటర్నెట్ కనక్షన్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సచివాలయం నుంచి వెలగపూడి తరలివెళ్లే కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను అక్కడ దింపుకుని, ఎవరి కంప్యూటర్లను వారి స్థానాల్లో అమర్చే బాధ్యతలను ఉద్యోగులకు అప్పగిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమ మునివెంకటప్ప శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెక్షన్లు వారీగా కంప్యూటర్లు వారి వారి స్థానాల్లో అమర్చే బాధ్యతలను ఆయా ఉద్యోగులకు అప్పగించారు. కంప్యూటర్లను, ఫర్నీచర్ ప్యాకింగ్ పూర్తి చేయడంతో ఆర్థిక శాఖకు చెందిన కార్యకలాపాలు శనివారం నుంచి హైదరాబాద్ సచివాలయంలో నిలిచిపోనున్నాయి. మరో పక్క ఉద్యోగులు, అధికారులు శనివారం నుంచి కుటంబాలను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకునేందుకు సెలవులు తీసుకోనున్నారు. ఈ తరలింపునకు ప్రత్యేకంగా సెలవులను పరిగణించనున్నారు.

మరిన్ని వార్తలు