నైతికత, హేతుబద్ధత ఉందా?

2 Mar, 2016 04:00 IST|Sakshi
నైతికత, హేతుబద్ధత ఉందా?

రూల్స్ కమిటీ నిర్ణయంపై సీపీఐ నేత నారాయణ   

 సాక్షి, హైదరాబాద్: ఇటు తెలంగాణలో, అటు ఏపీలో ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రజలు తగిన తీర్పునివ్వగా.. అధినేతలు దానితో సంతృప్తిపడి ప్రభుత్వాలను సజావుగా నడిపించడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ విమర్శించారు. ప్రత్యర్థులే ఉండకూడదనే మంకుపట్టుతో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు ఏకంగా మంత్రి పదవినిచ్చి టీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అపహాస్యం చేసిందన్నారు.

ఇపుడు ఇదే తంతును టీడీపీ ప్రభుత్వం ఏపీలో చేస్తోందన్నారు. ఒకే తాను ముక్కలే చంద్రబాబు, కేసీఆర్ అని నారాయణ ఒక ప్రకటనలో అన్నారు. ఈ పరిణామాలను ప్రత్యక్షంగా గవర్నర్, ఎన్నికల కమిషన్, స్పీకర్లు చూస్తున్నా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. అలాగే, తెలంగాణ ప్రభుత్వం, రూల్స్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి నైతికత, హేతుబద్దత ఉందా? అని నారాయణ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా హరీశ్‌రావు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని, టేబుల్ ఎక్కి కాగితాలు చించి గవర్నర్ పోడియం వరకు వెళ్లగలిగారని గుర్తుచేశారు. హరీశ్ చేయగా లేనిది తాము చేయకూడదా... అని ఇతర సభ్యులు ప్రశ్నిస్తే ఏం చెబుతారన్నారు.

మరిన్ని వార్తలు