కాపులపై విషం చిమ్ముతున్న ముఖ్యమంత్రి

17 Jun, 2016 02:35 IST|Sakshi

దాసరి, చిరంజీవి, పల్లంరాజు, బొత్స తదితరుల మండిపాటు
కాపు మంత్రులతో పూటకో మాట మాట్లాడిస్తున్నారని ధ్వజం
ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్

 సాక్షి, హైదరాబాద్: కాపు వర్గీయుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విషపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆ వర్గానికి చెందిన ప్రముఖ నాయకులు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్షను కూడా తప్పుదారి పట్టించే రీతిలో మంత్రుల చేత తప్పుడు విమర్శలు, ఆరోపణలు, విభిన్న ప్రకటనలు చేయిస్తున్నారని కాపు సామాజికవర్గ ప్రముఖులు దాసరి నారాయణరావు, కొణిదల చిరంజీవి, ఎం.పల్లంరాజు, బొత్స సత్యనారాయణ, సి.రామచంద్రయ్య, తోట చంద్రశేఖర్, అంబటి రాంబాబు, కె.కన్నబాబు, ఎం.వి.కృష్ణారావు, గంగయ్యనాయుడులు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటన లో ఖండించారు.

ముద్రగడకు ఇచ్చిన హామీ ల విషయంలో కలెక్టర్, డీఐజీ ఇచ్చిన వివరణకు భిన్నంగా ముగ్గురు కాపు మంత్రులు చేసిన ప్రకటనల పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు మంత్రులు మాట్లాడక ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారని, ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్, డీఐజీల వివరణకు భిన్నంగా ప్రకటనలు చేశారన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు విషపూరిత చర్యగా అనుమానం వ్యక్తం చేశారు.

 ఇంతగా అవమానిస్తారా..: ముద్రగడ కుటుంబీకులను ముఖ్యంగా కుమారుడిని పైశాచికంగా తరిమి కొట్టిన విధానాన్ని, ముద్రగడ కోడలిపై ఉచ్చరించడానికి వీలుగాని పరుష పదజాలం ఉపయోగించి ఆ కుటుంబాన్ని అవమానించిన తీరును తప్పుపట్టారు. ఈ అవమానం ఆయన కుటుంబానికి జరిగినది కాదని, మొత్తం కాపు జాతికి జరిగిందిగా భావిస్తున్నామన్నారు. గతంలో దీక్ష విరమింప చేయడానికి కిర్లంపూడిలో మధ్యవర్తులైన మంత్రులు ఇచ్చిన హామీలను, అమలు పరచకుండా మోసం చేసినట్టుగానే ఇప్పుడూ మోసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని  హెచ్చరించారు.

ముద్రగడ సమక్షంలో కలెక్టర్, డీఐజీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. కాగా, ముద్రగడ దీక్షను సమర్థిస్తూ ఈ నెల 13న కాపు ప్రముఖులు సమావేశమై ప్రభుత్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించి, దీక్షను విరమించే ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేసి ముద్రగడ ప్రాణాలు కాపాడాలని చేసిన డిమాండ్‌కు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఒత్తిడితోనే  ప్రభుత్వం స్పందించిందన్నారు. తామంతా ముద్రగడ దీక్షపై చర్చించేందుకు గురువారం విజయవాడ వెళ్లాల్సి ఉండిందని, అయితే బుధవారం రాత్రి దీక్షపై కలెక్టర్, డీఐజీల ప్రకటన వెలువడిన నేపథ్యంలో పర్యటనను విరమించుకున్నామన్నారు.

మరిన్ని వార్తలు