‘స్వైపింగ్’ యంత్రాలకు డిమాండ్!

16 Nov, 2016 00:45 IST|Sakshi
‘స్వైపింగ్’ యంత్రాలకు డిమాండ్!

గిరాకీని కాపాడుకునేందుకు హైదరాబాద్‌లో వ్యాపారుల యత్నం
- మంగళవారం పలు బ్యాంకులకు సుమారు మూడువేల వినతులు
- పది జాతీయ బ్యాంకులు సహా ప్రైవేటు బ్యాంకులను ఆశ్రయిస్తున్న వైనం
- నిబంధనలను సడలించాలని కోరుతున్న వ్యాపారులు  
 
 సాక్షి, హైదరాబాద్: ప్రజల చేతిలో చిల్లర లేదు.. దుకాణాల్లో గిరాకీ లేదు.. దీంతో తమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి దుకాణ నిర్వాహకులు స్వైపింగ్ యంత్రాల కోసం బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులు స్వైపింగ్ చేసే యంత్రాలకు ఇప్పుడు గిరాకీ పెరిగింది. హైదరాబాద్‌లోని వ్యాపారులు గిరాకీని కాపాడుకునేందుకు స్వైపింగ్ యంత్రాలు కావాలంటూ ఎస్‌బీఐ, సెంట్రల్‌బ్యాంక్, ఎస్‌బీహెచ్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర పది జాతీయ బ్యాంకులతో సహా ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌మహీంద్ర వంటి ప్రైవేటు బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు. రోజూ వేల రూపాయల వ్యాపారం నిర్వహించే తినుబండారాల దుకాణదారులు, ఫుట్‌పాత్, వీధి వ్యాపారులు కూడా ఈ యంత్రాలుంటేనే తమ వ్యాపారానికి ఢోకా ఉండదని భావిస్తున్నట్లు సమాచారం.

మంగళవారం ఒకే రోజు ఆయా బ్యాంకులకు సుమారు మూడువేల స్వైపింగ్ యంత్రాలు కావాలంటూ నుంచి విజ్ఞప్తులు అందినట్లు బ్యాంకింగ్ రంగ నిపుణులు తెలపడం గమనార్హం. ఈనెల 8 నుంచి బహిరంగ మార్కెట్‌లో రూ.500, వెరుు్య నోట్ల చలామణి కష్టతరం కావడం, చిల్లర కష్టాలు మొదలైన నేపథ్యంలో ఈ యంత్రాలకు గిరాకీ పెరిగినట్లు తెలిసింది. కాగా ఈ యంత్రాలను పొందడం అందరికీ సాధ్యపడడం లేదు. మూడేళ్ల ఐటీ రిటర్న్స్, పాన్‌కార్డు, చిరునామా ధ్రువీకరణ, వ్యాట్, లేబర్ సర్టిఫికెట్ వంటి ప్రభుత్వ పరమైన గుర్తింపులు, ధ్రువీకరణలు కలిగి ఉన్న కరెంట్ అకౌంట్ వినియోగదారులకు మాత్రమే ఈ యంత్రాలను సరఫరా చేయనున్నట్లు బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు.

వీధి వ్యాపారాల్లో అధికంగా కూరగాయలు, పండ్లు, టీ, బ్యాగులు, ఫ్యాన్సీ ఐటమ్స్, తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు  ఉన్నారుు. వీరిలో 70 శాతం మంది మాత్రమే బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని, ఇందులోనూ ఎక్కువగా సేవింగ్స్ అకౌంట్‌లున్నవారే కావడం గమనార్హం. ఒకవేళ బ్యాంకు అకౌంట్ ఉన్నప్పటికీ ప్రస్తుత బ్యాంకుల నిబంధనల ప్రకారం స్వైపింగ్ యంత్రాలు పొందే అర్హతలున్నవారు సగం మంది మాత్రమే ఉన్నారని ఆయా వ్యాపారాలు నిర్వహించేవారు వాపోతున్నారు. బ్యాంకు అకౌంట్ కలిగిన ప్రతి వ్యాపారికి ఈ యంత్రాలను సరఫరా చేసి నెలవారీ అద్దె వసూలు చేసుకోవాలని ఆయా వ్యాపారులు బ్యాంకర్లను కోరుతున్నారు.

మరిన్ని వార్తలు