రక్షణం.. ఇక తక్షణం!

29 Jul, 2016 02:27 IST|Sakshi
రక్షణం.. ఇక తక్షణం!

* రక్షక్‌లకు ‘రెస్పాన్స్ టైమ్’.. నగరంలో అమలు
* ‘డయల్ 100’తో పెట్రోలింగ్ వ్యవస్థ అనుసంధానం
* జీపీఎస్‌తో ‘తెరపైకి’ అన్ని గస్తీ వాహనాలు  
* గొడవలు జరిగినా, ప్రమాదం సంభవించినా తక్షణమే ఘటనాస్థలికి..

సాక్షి, హైదరాబాద్: గస్తీ విధానంలో జవాబుదారీతనం పెంచడం.. వీలైనంత త్వరగా ఘటనాస్థలికి చేరుకోవడం.. నేరాలు జరిగే ప్రాంతాల్లోనే పెట్రోలింగ్ ఉండేలా చూడటం.. ఇవే ప్రధాన ఎజెండాగా రక్షక్‌లకు ‘హైదరాబాద్ రెస్పాన్స్ టైమ్’ నిర్ధారించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికోసం ప్రస్తుతం ఉన్న గస్తీ వాహనాలను ‘డయల్-100’తో అనుసంధానించారు. ఈ అత్యాధునిక జీపీఎస్ ఆధారిత విధానం గురువారం నుంచి అమలులోకి వచ్చింది.

ప్రతి ఠాణాకు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో) సైతం తమ గస్తీ వాహనాల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేలా చర్యలు తీసుకున్నారు. దీని అమలు కోసం కమిషనరేట్‌లోని ప్రతి గస్తీ వాహనానికీ ఓ ట్యాబ్ అందించారు. ఈ తరహాలో ‘డయల్-100’ను రక్షక్‌లతో అనుసంధానించి, యాప్ రూపంలో ట్యాబ్‌ల్లోకి చేర్చడం దేశంలోనే తొలిసారి. ఈ అత్యాధునిక విధానం ఎలా పనిచేస్తుందన్న అంశంపై కథనం...
 
1. తెరపై కనిపించే ‘రక్షక్’లు..

బాధితులు ‘100’కు ఫోన్ చేసి సహాయం కోరిన వెంటనే సిబ్బంది.. బాధితుడు ఉన్న ప్రాంతాన్ని అడిగి తెలుసుకుంటారు. గస్తీ వాహనాలను జీపీఎస్‌తో అనుసంధానిస్తున్న నేపథ్యంలో ‘100’ సిబ్బందికి ఏ వాహనం ఎక్కడుందో కంప్యూటర్ తెరపై కచ్చితంగా తెలుస్తుంది. దీంతో బాధితుని కాల్‌ను అతనికి సమీపంలో ఉన్న పెట్రోలింగ్ వాహనానికి డైవర్ట్ చేస్తారు. వాహనంలోని సిబ్బందికి ‘100’ నుంచి డైవర్డ్ అయిన కాల్ వస్తే.. ప్రత్యేక రింగ్‌టోన్ ద్వారా ట్యాబ్‌లో రింగ్ వస్తుంది.

ఫోన్ ఎత్తిన వెంటనే ట్యాబ్ తెరపై ఓ నోటిఫికేషన్ ప్రత్యక్షమవుతుంది. అందులో బాధితునికి సంబంధించిన అంశాలు, ఫిర్యాదు ఏమిటన్నవి కనిపిస్తాయి. గస్తీ వాహనంలోని సిబ్బంది ‘రిసీవ్డ్’ అనే బటన్ నొక్కడం ద్వారా ఫిర్యాదు అందుకున్నట్లు ఎక్నాలెడ్జ్ చేయాలి.
 
2. ‘నొక్కితే’ టైమ్ మొదలైనట్లే..
ఎక్నాలెడ్జ్ చేసినప్పటి నుంచి ‘రెస్పాన్స్ టైమ్’ ప్రారంభమవుతుంది. వెంటనే ఘటనాస్థలికి చేరుకునే వాహనాలు ఫిర్యాదు తీరును బట్టి అవసరమైన రీతిలో స్పందిస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగినట్లైతే క్షతగాత్రులకు అవసరమైన సహాయం అందించడంతో పాటు ఆధారాల కోసం ఫొటోలు తీస్తారు. పబ్లిక్ ప్లేసుల్లో గొడవలు, ఇతర నేరాలకు సంబంధించిన ఫిర్యాదైతే స్థానిక పోలీసుల్ని అప్రతమత్తం చేసి.. ఘటనాస్థలాల్ని వీడియోలో చిత్రీకరించి తదుపరి చర్యలు తీసుకుంటారు. సహాయక చర్యలు పూర్తయిన వెంటనే సదరు ఫొటోలు, వీడియోలను రక్షక్ సిబ్బంది ఆన్‌లైన్ ద్వారా సంబంధిత ఎస్‌హెచ్‌వోకు పంపిస్తారు.

ఈ తతంగం పూర్తయిన తర్వాత తొలుత వచ్చిన నోటిఫికేషన్‌ను మళ్లీ ఓపెన్ చేయాలి. అందులో ఉండే ‘కాల్ క్లోజ్’ బటన్ నొక్కడంతో ‘రెస్పాన్స్ టైమ్’ పూర్తవుతుంది. ఈ బాధ్యతను ఎస్‌హెచ్‌వోకే అప్పగించారు. కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది ప్రతి ఉదంతానికి సంబంధించి గస్తీ వాహనాలు ‘రిసీవ్డ్’ బటన్ నొక్కడానికీ, ‘కాల్ క్లోజ్డ్’ బటన్ నొక్కడానికి మధ్య కాలాన్ని లెక్కిస్తారు.
 
3. ఇలా పర్యవేక్షిస్తారు
ప్రతి డివిజన్, జోన్ వారీగా ఎన్ని కాల్స్ వచ్చాయి? ఎన్ని క్లోజ్ అయ్యాయి? ఎంత సమయం పట్టింది? అనే అంశాలను నిత్యం ఉన్నతాధికారులు ‘డాష్‌బోర్డ్’ ద్వారా పర్యవేక్షించే అవకాశం ఉంది. ఇలా ఏ వాహనానికి ఆ వాహనం ‘రెస్పాన్స్ టైమ్’తో పాటు నగర వ్యాప్తంగా అన్ని వాహనాల సరాసరినీ తీసుకుని ‘హైదరాబాద్ రెస్పాన్స్ టైమ్’ను నిర్ధారిస్తారు. ఇది ఎంత తక్కువగా ఉంటే అంత మెరుగైన సేవలు అందిస్తున్నట్లు లెక్క. టైమ్ ఎక్కువ తీసుకున్న వాహనాల్లోని సిబ్బంది నుంచి ఆలస్యానికి కారణం తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటారు.

మరిన్ని వార్తలు