నత్తనడకన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం

13 Aug, 2017 03:07 IST|Sakshi
నత్తనడకన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
పీఎంఏవై కింద 1.51 లక్షల ఇళ్లు మంజూరు.. 
పనులు మొదలైంది 40 వేలే
కేంద్రం దండిగా నిధులు ఇచ్చింది
- వాటిని సద్వినియోగం చేసుకుని నిర్మాణపనుల్ని వేగం చేయాలి
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) కింద కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ పథకానికి దండిగా నిధులిస్తోందని... కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను సరైన పద్ధతిలో వినియోగించుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పథకం అమలు తీరును నిరంతరం పర్యవేక్షించి వేగాన్ని పెంచాలని సూచించారు. శనివారం ఈఎస్‌ఐసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘పీఎంఏవై కింద కేంద్రం రాష్ట్రానికి 1.51 లక్షల ఇళ్లు మంజూరు చేసింది.

ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 70,764 ఇళ్లు, పట్టణ ప్రాంతానికి 80,481 ఇళ్లు నిర్మించుకునే వెసులుబాటు కల్పించింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా నిర్మించుకునే వీలుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రూ.398 కోట్లు కూడా విడుదల చేసింది. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రం లోని ప్రతి పేదకు డబుల్‌ బెడ్‌రూం ఇంటిని ఉచితంగా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి గెలిచింది. ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ఇది సాగడం లేదు. ఇప్పటివరకు 1.39 లక్షల ఇళ్ల నిర్మాణానికిగాను  85 వేల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి టెండ ర్లు ఫైనల్‌ అయ్యాయి. ఇందులో 40 వేల ఇళ్లను ప్రారంభించారు.

ఈ పథకం పురోగతిపై రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్‌తో త్వరలో సమావేశం నిర్వహిస్తాం‘ అని అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని సీఎం పలుమార్లు చెప్పినప్పటికీ... ఇక్కడి పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌ ఆస్పత్రులను మరింత అభివృద్ధి చేయాలని దత్తాత్రేయ సూచించారు. ఎంఎంటీఎస్‌ రెండోదశ పనులను వచ్చే ఏడాది చివరికల్లా పూర్తి చేస్తా మని రైల్వే అధికారులు చెప్పినట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో కొత్తగా కరీంనగర్‌– ముంబై రైలును త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు