సర్కారీ బడికి డబుల్ ధమాకా!

15 Jul, 2016 03:55 IST|Sakshi
సర్కారీ బడికి డబుల్ ధమాకా!

- పక్కాగా నిర్వహణ, పరిశుభ్రత కోసం గ్రాంటు రెట్టింపు చేసిన ప్రభుత్వం
- విద్యార్థులను బట్టి ఉన్నత పాఠశాలలకు రూ.లక్ష వరకు..
- ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.30 వేల వరకు నిధులు
- వర్కర్లను, నైట్ వాచ్‌మన్‌లను నియమించుకునేందుకు అవకాశం
- చాక్‌పీసులు కొనేందుకూ పడిన ఇబ్బందులు ఇక దూరం
- డిప్యూటీ సీఎం కడియం ప్రత్యేక చొరవ.. డీఈవోలకు ఆదేశాలు

 
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులే తరగతి గదులను ఊడ్చుకోవడం.. ఆవరణను శుభ్రపరచుకోవడం.. చివరికి మరుగుదొడ్లు పరిశుభ్రం చేసుకోవడం వంటి వాటికి కాలం చెల్లనుంది. స్కూళ్లలో చాక్‌పీసులు కొనేందుకూ డబ్బుల్లేని దుస్థితిని దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలల నిర్వహణకు అవసరమైన కొంతడబ్బు స్కూల్‌లో ఉండేలా చూడడంతోపాటు వర్కర్లను నియమించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం ఇప్పటి వరకూ స్కూళ్లకు ఇస్తున్న గ్రాంటును ఏకంగా రెండింతలకు పైగా పెంచింది. విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఏటా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు.. ఉన్నత పాఠశాలలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది.
 
 గతంలో రూ.15 వేల లోపే..
 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం... 25 వేల స్కూళ్లలో లక్ష డ్యుయల్ డెస్కు (విద్యార్థులు కూర్చోవడంతోపాటు పుస్తకాలు పెట్టుకుని రాసుకునేందుకు వీలైన టేబుల్)లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇకపై ప్రభుత్వ బడుల నిర్వహణ పక్కాగా చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు సరిపడా నిధులివ్వడంతోపాటు వర్కర్ల నియామకం ద్వారా పాఠశాల పరిశుభ్రత, మరుగుదొడ్లను శుభ్రం చేయడం, రాత్రివేళల్లో పాఠశాలలకు రక్షణ వంటి చర్యలు చేపట్టనుంది. ఇప్పటివరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఏటా స్కూల్ గ్రాంటు, నిర్వహణ గ్రాంటు పేరుతో రూ.12 వేలు మాత్రమే ఇచ్చే వారు. దీనిని తాజాగా రూ.25 వేలకు పెంచింది.

విద్యార్థుల సంఖ్యను బట్టి మరింత ఎక్కువ ఇవ్వనున్నారు. ఇక ఉన్నత పాఠశాలకు ఇప్పటివరకు రూ.15 వేల వరకు ఇస్తుండగా... తాజాగా విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.లక్ష వరకు అందజేయనున్నారు. ఈ అంశంపై ప్రత్యేక చొరవ చూపిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యా అధికారులను ఆదేశించారు.
 
 దీంతో పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ మార్గదర్శకాలను రూపొందించి డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం... ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 40మందిలోపు విద్యార్థులుంటే రూ.25 వేలు గ్రాంట్‌గా ఇస్తారు. 40 కంటే ఎక్కువగా ఉంటే రూ.30 వేలు ఇస్తారు. ఉన్నత పాఠశాలల్లో 40 మందిలోపు విద్యార్థులుంటే రూ.50 వేలు, 100 మందికంటే ఎక్కువ ఉంటే రూ.లక్ష గ్రాంటు అందిస్తారు. అవసరమైతే ఇద్దరు వర్కర్లు: పాఠశాలల నిర్వహణ కోసం వర్కర్లను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాల సమయంలో పనిచేసే పార్ట్‌టైం వర్కర్, రాత్రివేళల్లో నైట్ వాచ్‌మెన్‌ల నియామకానికి ఓకే చెప్పింది. ఏడాదిలో 10 నెలలపాటు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒక్కొక్కరి చొప్పున, 100 మందికంటే ఎక్కువగా విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో ఇద్దరి చొప్పున వర్కర్లను నియమించుకోవచ్చని పేర్కొంది.
 
 40 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో నెలకు రూ.2 వేలు, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులుంటే రూ.2,500 వేతనంగా ఇవ్వవచ్చని సూచించింది. 40 మందిలోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో రూ.2,500, 40 నుంచి 100 మంది వరకున్న స్కూళ్లలో రూ.3 వేలు, అంతకంటే ఎక్కువ మంది ఉన్న స్కూళ్లలో రూ.3,500 చెల్లించవచ్చని పేర్కొంది. వారి వేతనాలను స్కూల్ గ్రాంటు నుంచి చెల్లించాలని సూచించింది.
 
 వర్కర్లు చేయాల్సిన పనులివే: ఉదయం 7:30 గంటలకు పాఠశాల తెరవాలి. ఆవరణ, తరగతి గదులు, టాయిలెట్లు శుభ్రం చేయాలి. మొక్కలకు నీళ్లు పోయాలి. టాయిలె ట్లలో నీటి సదుపాయం ఉండేలా చూడాలి. పాఠశాల సమయం ముగిసే వరకు ఉండాలి. నైట్ వాచ్‌మన్ అయితే సాయంత్రం 4:30 గంటలకు పాఠశాలకు వచ్చి ఉదయం 9 వరకు ఉండాలి.
 
 ఎందుకీ గ్రాంట్

 ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన చాక్‌పీసులు, పెన్నులు, నోట్‌బుక్‌ల వంటి స్టేషనరీ సామగ్రి కొనుగోలు.. పాఠశాలను శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఈ నిర్వహణ గ్రాంట్‌ను వినియోగిస్తారు. తరగతి గదులను, ఆవరణను ఊడ్వడం, మరుగుదొడ్లు శుభ్రం చేయించడం కోసం నియమించుకునే వర్కర్లకు దీని నుంచే వేతనాలు చెల్లిస్తారు. పాఠశాలలకు వివిధ అవసరాలకు ప్రభుత్వం నిధులు ఇస్తుంది. అవిగాకుండా మిగతా అవసరాలకు ఈ గ్రాంట్ నిధులను వాడుకోవచ్చు.
 
 నిర్వహణ పక్కాగా ఉంటుంది
 ‘‘ఇటీవలే ఇంగ్లిషు మీడియం ప్రారంభానికి చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. స్కూల్ గ్రాంట్ పెంచడం అభినందనీయం. దీంతో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ పక్కాగా ఉండటంతోపాటు ప్రైవేటు స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దవచ్చు..’’
 - సరోత్తంరెడ్డి, పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్షుడు
 
 ప్రభుత్వ చొరవ అభినందనీయం
 ‘‘ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ విషయంలో సర్కారు చొరవ అభినందనీయం. ప్రస్తుత  చర్యలతో ఎంతో ఉపయోగం ఉంటుంది. చాక్‌పీసులు, ఇతర పనులకు డబ్బు సమస్య ఉండదు. గతంలో ఎప్పుడో డిసెంబర్, జనవరి నెలల్లో ఇచ్చే వారు. ఇప్పుడు జూలైలోనే ఇస్తామంటున్నారు. ముందుగానే ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది..’’
 - మల్లికార్జున శర్మ,
 రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు

 
 ఇది మంచి పరిణామం

 ‘‘ఇది మంచి పరిణామం. అస్తవ్యస్తంగా ఉండే పాఠశాలల నిర్వహణ ఇకపై బాగుంటుంది. అయితే దీనిని పక్కాగా నిర్వహించాలి. టాయిలెట్ల క్లీనింగ్ కోసం ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ఒకరిని నియమించాలి..’’
 - రవి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి

మరిన్ని వార్తలు