ఆచూకీ చెప్పమంటే.. ప్రాణాలు తీసుకున్నాడు! | Sakshi
Sakshi News home page

ఆచూకీ చెప్పమంటే.. ప్రాణాలు తీసుకున్నాడు!

Published Fri, Jul 15 2016 4:28 AM

accused died in police enquiry

రెండు రోజుల కిందట పోలీసుస్టేషన్ పైనుంచి దూకిన యువకుడు
తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
మృతుడు పరారైన జీవిత ఖైదీకి స్వయూనా తమ్ముడు
అన్న ఆచూకీ చెప్పమన్నందుకే తమ్ముని అఘాయిత్యం..

మార్కాపురం : హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ పెరోల్‌పై బయటకొచ్చి తప్పించుకుని తిరుగుతున్న కురుకుందు శ్రీనివాసులు తమ్ముడు వెంకట్రావును రెండు రోజుల కిందట మార్కాపురం రూరల్ పోలీసులు విచారణ కోసం పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లగా పైనుంచి కిందకు దూకటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనను పోలీసులు గోప్యంగా ఉంచి క్షతగాత్రుడికి గుంటూరులో చికిత్స చేయిస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకట్రావు గురువారం సాయంత్రం మృతి చెందాడు. వివరాలు.. పలు హత్య కేసుల్లో మార్కాపురం మండలం అమ్మవారిపల్లెకు చెందిన కురుకుందు శ్రీనివాసులు నిందితుడు.

నెల్లూరు సెంట్రల్ జైలులో జీవిత కాల శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఏడాది మే 31న శ్రీనివాసులు సోదరుడు చిన్న వెంకటేశ్వర్లు మతి చెందటంతో పెరోల్‌పై స్వగ్రామం వచ్చాడు. ముద్దాయి వెంట ముగ్గురు పోలీసులు ఎస్కార్ట్‌గా ఉన్నారు. అంత్యక్రియల అనంతరం శ్రీనివాసులు పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. ముద్దాయి శ్రీనివాసులును ఇటీవల అమ్మవారిపల్లెకు వచ్చినట్లు రూరల్ పోలీసులకు సమాచారం అందటంతో రెండు రోజుల కిందట అక్కడికి వెళ్లి ఆయన మరో తమ్ముడు వెంకట్రావును విచారణ కోసం పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసుస్టేషన్‌పైకి ఎక్కి భవనం నుంచి కిందకు దూకాడు.

కాళ్లు, చేతులు, తలకు బలమైన గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే గుంటూరు వైద్యశాలకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మతి చెందాడు. ఈ విషయంపై మార్కాపురం డీఎస్పీ శ్రీహరిబాబును వివరణ కోరగా ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి పరారైన ముద్దాయి కురుకుందు శ్రీనివాసులు అమ్మవారిపల్లె ప్రాంతంలో సంచరిస్తున్నాడనే సమాచారం అందటంతో పోలీసులు అక్కడికి వెళ్లారని, అక్కడ ఉన్న ముద్దాయి తమ్ముడు వెంకట్రావును తీసుకొచ్చి విచారణకు ప్రయత్నించారని చెప్పారు. ముద్దాయి ఫోన్ నంబర్‌ను అడగ్గా తప్పించుకునే ప్రయత్నంలో పోలీసుస్టేషన్ భవనం పైకి ఎక్కి దూకటంతో గాయాలయ్యాయని, చికిత్స పొందుతూ మతి చెందాడని డీఎస్పీ వివరణ ఇచ్చారు.

Advertisement
Advertisement