పదహారేళ్లకు...

16 Jul, 2015 00:14 IST|Sakshi
పదహారేళ్లకు...

దుబాయికి వెళ్లి ఆచూకీ లేకుండా పోయి నగరంలో ప్రత్యక్షం
కుటుంబ సభ్యులకు అప్పగించిన ఆర్‌పీఎఫ్ పోలీసులు
 

సికింద్రాబాద్: ఉపాధి కోసం దుబాయికి వెళ్లిన యువకుడు పదహారేళ్ల తరువాత అనుకోకుండా కుటుంబ సభ్యులను కలిసిన ఉదంతం ఇది. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం జాగిరి కొండాపూర్ గ్రామానికి దండనేని నర్సయ్య, లింగమ్మ దంపతుల కుమారుడు శేఖర్ (44). అతడడికి భార్య నీల, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 1999లో బతుకుతెరువు నిమిత్తం దుబాయికి వెళ్లిన శేఖర్ అక్కడ హెల్పర్‌గా ఉద్యోగంలో చేరాడు. అయితే ఆ తరువాత ఆరు నెలలు గడిచిందో లేదో...అతడి నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం లేకుండా పోయింది. దీంతో కుటుంబసభ్యులు దుబాయిలో తెలిసిన వారిని వాకబు చేసినా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో వారు అతనిపై ఆశ వదిలేసుకున్నారు. ఇదిలా ఉండగా అతని భార్య నీల  తన పుట్టింటికి వెళ్లి కూలి చేసుకుని జీవనం సాగిస్తూ ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది.  

ఊరివాడి కంటపడి....
ఇదిలా ఉండగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ యార్డులో పని చేస్తున్న అదేగ్రామానికి చెందిన పులి రమేష్ అనే వ్యక్తికి అల్ఫా హోటల్ వద్ద భిక్షాటన చేస్తున్న శేఖర్ కనిపించడంతో అతను ఆర్‌పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వారు శేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తన పరిస్థితిని వివరించాడు

అవిటితనం కారణంగానే....
 అప్పులు చేసి దుబాయి వెళ్లిన తనకు అక్కడికి వెళ్లిన ఆరోనెలలోనే ఒక వ్యక్తి అకారణంగా కత్తితో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డానన్నాడు. అక్కడి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నా అతను తన పలుకుబడి ఉపయోగించి  పెద్దల సహకారంతో రాజీ పేరుతో మోసం చేశాడని, గాయం కూడా మానకముందే పదివేలు చేతిలో పెట్టి హైదరాబాద్ విమానం ఎక్కించాడన్నారు.

అసలే పేదరికం, ఇద్దరు కుమార్తెలు ఉన్న తనకు అవిటితనంతో ఇంటికి వెళ్లడానికి మనస్కరించలేదని, దీంతో  ఎవరికంట పడకుండా సికింద్రాబాద్, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపాడు.
 ఆర్‌పీఎఫ్ ఇన్ స్పెక్టర్ అశ్వినీకుమార్ సమాచారం అందించడంతో బుధవారం సాయంత్రం నగరానికి చేరుకున్న శేఖర్ భార్య నీల, తండ్రి నర్సయ్య కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. శేఖర్ ను గుర్తించి అప్పగించిన పులి రమేష్, ఆర్‌పీఎఫ్ పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు