‘కోటి లింగాల’కు కోటి కష్టాలు!

20 Jul, 2016 04:49 IST|Sakshi
‘కోటి లింగాల’కు కోటి కష్టాలు!

- చారిత్రక నగరానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ముప్పు
- జలాశయాన్ని ఈసారి పూర్తిగా నింపాలని సర్కారు నిర్ణయం
- పురాతన నగరమున్న ప్రాంతంలో కొంతమేర మునిగే అవకాశం
- నీరు చేరకుండా భారీ రక్షణ గోడ ఏర్పాటు యోచన
- సర్వే చేసిన నిపుణులు..త్వరలో పనులు!
 
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే మూడోవంతు ప్రాంతాన్ని ఏలిన శాతవాహనుల చారిత్రక మహా నగరం ‘కోటి లింగాల’ ఆనవాళ్లకు ముప్పు వచ్చింది. దశాబ్దాల పాటు తీవ్ర నిర్లక్ష్యానికి గురై.. ఇంతకాలానికి వెలుగు చూడబోతోందనగా మరో సమస్య వచ్చి పడింది. ఎల్లంపల్లి ప్రాజెక్టును ఈసారి పూర్తిస్థాయిలో నింపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ చారిత్రక నగరం ఆనవాళ్లున్న ప్రదేశంలో కొంతభాగం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో మునిగిపోయే అవకాశముంది.

 దేశంలోనే తొలిసారిగా..
 కోటిలింగాలలో దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల నగరం ఆనవాళ్లున్నట్లు 1978లో జరిపిన తవ్వకాల్లో గుర్తించారు. కానీ ఇంతకాలం దానిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ వంద ఎకరాల స్థలంలో తవ్వకాలు జరిపి నగరాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ ప్రదేశానికి ఉత్తరం వైపు గోదావరి నది ఉంది. అక్కడికి కొద్ది దూరంలో కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈసారి 20 టీఎంసీల మేర నీటిని నిల్వచేయాలని తాజాగా సర్కారు నిర్ణయించింది. ఆ మేర నిల్వచేస్తే ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ కోటిలింగాల ప్రాంతంలో కొంతభాగం మునిగిపోయే అవకాశముంది.

అదే జరిగితే తవ్వకాలు జరపడం సాధ్యం కాదు. ఎండాకాలంలో నీటిమట్టం తగ్గినప్పుడు తవ్వినా.. తిరిగి వానాకాలంలో ముంపు తప్పదు. ఈ నేపథ్యంలో శాశ్వత పరిష్కారంగా నదికి వారగా భారీ రక్షణ గోడను నిర్మించాలని పురావస్తుశాఖ నిర్ణయించింది. నీటిని ఇవతలివైపు రానీయని విధంగా విదేశాల్లో నదీముఖంగా అలాంటి గోడలు నిర్మిస్తుంటారు. మనదేశంలో తొలిసారిగా ఓ చారిత్రక కట్టడానికి రక్షణగా ఆ గోడను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి నిపుణుల బృందం ఇటీవల సర్వే చేసింది. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా ఖర్చు అంచనాలు రూపొందించి, ప్రభుత్వం అనుమతితో పనులు చేపట్టాలని పురావస్తుశాఖ భావిస్తోంది. ఇదంతా సెప్టెంబర్‌లోపు పూర్తి చేయాలని భావిస్తున్నారు.
 
 కర్ణమామిడి లోనూ తవ్వకాలు
 గోదావరి నదికి అవతలి భాగంలో ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే కర్ణమామిడి వద్ద కూడా పురావస్తు శాఖ తవ్వకాలు జరపనుంది. అయితే ఆ ప్రాంతం పూర్తిగా ప్రాజెక్టు నీటిలో మునిగిపోనుంది. అందువల్ల నీళ్లు చేరేలోపే తవ్వకాలు జరిపి అధ్యయనం చేయనున్నారు. ఈ ప్రాంతం శాతవాహనుల కంటే ముందు రాజుల ఏలుబడిలో ప్రాధాన్యమున్న ప్రాంతంగా పురావస్తు శాఖ భావిస్తోంది. దాని విస్తీర్ణం స్వల్పంగానే ఉంటుందని అంచనా. అది పూర్తిగా మునిగిపోయే ప్రాంతం కావడంతో.. కట్టడాల ప్రాధాన్యాన్ని బట్టి మరో ప్రాంతానికి తరలించే యోచనలో ఉన్నారు. ఇక్కడ ఆగస్టు చివరికల్లా తవ్వకాలు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు