వాణిజ్య పన్ను.. రికార్డుపై కన్ను

21 Mar, 2016 02:26 IST|Sakshi
వాణిజ్య పన్ను.. రికార్డుపై కన్ను

♦ ఫిబ్రవరి వరకు వసూలైన పన్నులు రూ.28,787 కోట్లు
♦ 2015-16లో రెవెన్యూ లక్ష్యం రూ.32,617 కోట్లు
♦ ఈ నెలలో రూ.4 వేల కోట్లతో 100 శాతం లక్ష్యం పూర్తి!
 
 సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నులు రికార్డుస్థాయిలో వసూలవుతున్నాయి. వంద శాతం వసూళ్లకు ఆ శాఖ అడుగుదూరంలో ఉంది. కట్టుదిట్టమైన చర్యలు ఫలిస్తున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, అన్ని డివిజన్ల అధికారుల నిఘా, జీరో దందా వ్యాపారుల నుంచి పన్నులు రాబట్టడంతో మెరుగైన ఫలితాలు వచ్చాయి. రాష్ట్రం ఏర్పడిన 2014తో పోలిస్తే 2015-16 ఆర్థిక సంవత్సరంలో రెట్టింపునకుపైగా వాణిజ్య పన్నులు వసూలు కావడం గమనార్హం. 2014 జూన్ నాటికి వాణిజ్యపన్నుల శాఖ ఆదాయం రూ.18 వేల కోట్లు మాత్రమే. 2015-16 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖలో సవరించిన వార్షిక లక్ష్యం రూ.32,617 కోట్లు. ఫిబ్రవరి నెలాఖరుకు రూ.28,787 కోట్లు వసూలు చేసింది. ఈ మార్చిలో మరో రూ.4 వేల కోట్లు వసూలైతే వంద శాతం లక్ష్యానికి చేరుకున్న ప్రభుత్వ విభాగంగా రికార్డు నెలకొల్పనుంది. ఈ నేపథ్యంలో 2016-17 బడ్జెట్‌లో వాణిజ్య పన్నుల శాఖ పన్ను వసూళ్ల లక్ష్యాన్ని ప్రభుత్వం రూ.42,073 కోట్లుగా నిర్ణయించింది.  

 మద్యం, పెట్రో ఉత్పత్తులపైనే రూ.13,225 కోట్లు
 వాణిజ్యపన్నుల శాఖ ఆదాయంలో మద్యంతోపాటు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వచ్చే పన్ను దాదాపు 50 శాతం ఉంది. ఫిబ్రవరి వరకు ఈ రెండింటి ద్వారా రూ.13,225 కోట్లు(మద్యం 7269, పెట్రో 5956) వసూలైంది. పెట్రోల్, డీజిల్ ధరల హెచ్చుతగ్గులు, మద్యం అమ్మకాల్లో ఆశించిన వృద్ధి లేకపోవడంతో గత సంవత్సరం వసూలైన పన్ను(13070) కన్నా ఒక శాతం మాత్రమే ఫిబ్రవరి నెలాఖరు నాటికి అధికంగా వసూలైంది. ఇక సిగరెట్ల అమ్మకాలు, సింగరేణి, బీహెచ్‌ఈఎల్ తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బడా ప్రైవేట్ కంపెనీల నుంచి వసూలు చేసిన పన్నులతో కలిపి 12 డివిజన్లలో రూ.14,648 కోట్లు వసూలయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం నుంచి సీఎస్‌టీ బకాయిలు రూ. 913.5 కోట్లు రావడంతో మొత్తం రూ.28,787 కోట్ల ఆదాయం సమకూరింది. పన్ను వసూళ్లలో వాణిజ్యపన్నుల శాఖ ఫిబ్రవరి నాటికే వార్షిక లక్ష్యానికి చేరువ కావడంపట్ల ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా అన్ని వ్యాపార సంస్థల నుంచి పన్నులు వ సూలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. సినిమా థియేటర్లలో ఆన్‌లైన్ టికెట్ విధానం, విలాసపన్ను వసూళ్లను కట్టుదిట్టం చేయడం వంటి కార్యక్రమాలు త్వరలో మొదలవుతాయన్నారు.

మరిన్ని వార్తలు