వైద్య అనుబంధ వృత్తి విద్య బలోపేతం | Sakshi
Sakshi News home page

వైద్య అనుబంధ వృత్తి విద్య బలోపేతం

Published Mon, Mar 21 2016 2:21 AM

వైద్య అనుబంధ వృత్తి విద్య బలోపేతం - Sakshi

♦ ఏడు కోర్సుల్లో ప్రమాణాల పెంపు
♦ అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేలా సిలబస్
♦ కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్: వైద్య అనుబంధ ఆరోగ్య వృత్తి విద్యా కోర్సులకు దశలవారీగా ప్రమాణాలను పెంచాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సిలబస్‌ను దశలవారీగా మార్పు చేయాలని భావిస్తోంది. వైద్య అనుబంధ ఆరోగ్య రక్షణ వ్యవస్థలో దాదాపు 50 వరకు ఆరోగ్య వృత్తి కోర్సులున్నాయి. వాటిల్లో ప్రధానంగా డయాలసిస్ థెరపి, మెడికల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్, మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, ఫిజియోథెరపి, రేడియో థెరపి టెక్నాలజీల్లో ప్రమాణాలను పెంచాలనేది లక్ష్యంగా పేర్కొంది.

 అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా...
 అంతర్జాతీయంగా వైద్య రంగంలో అనేక మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చి చేరుతున్నాయి. దీనికి అనుగుణంగా మారకపోతే వెనుకబడిపోయే ప్రమాదముందని కేంద్రం భావిస్తోంది. పైన పేర్కొన్న వైద్య వృత్తి కోర్సుల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది. వైద్యంలో రోగ నిర్దారణ కీలకమైన అంశం. రోగ నిర్దారణ ఆధునిక టెక్నాలజీపై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో వైద్య చికిత్స విజయవంతం కావాలంటే అనుబంధ ఆరోగ్య వృత్తి నిపుణుల పాత్ర కీలకం. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలంటే వీరి సామర్థ్యంపైనే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య వృత్తి నిపుణులకు అందుతున్న విద్య, శిక్షణపై దృష్టి సారించాలని కేంద్రం నిర్ణయించింది. కానీ దేశంలో అందుకు తగ్గట్లుగా ఆరోగ్య వృత్తి నిపుణుల వ్యవస్థ బలంగా లేదని కేంద్రం భావిస్తోంది. డాక్టర్ల చుట్టూనే హెల్త్‌కేర్ వ్యవస్థ తిరుగుతోందని పేర్కొంది.

 ప్రైవే టీకరణతో జేబులు గుల్ల
 వైద్య, ఆరోగ్య అనుబంధ రంగాలు ప్రైవేటీకరణ బాటలోనే నడుస్తున్నాయి. వైద్య చికిత్స కంటే కూడా రోగ నిర్దారణ, చికిత్స అనంతరం అందే వైద్యసేవలు ఖర్చు తో కూడిన వ్యవహారంగా మారింది. వైద్యులు కూడా అవసరం ఉన్నా లేకున్నా రోగ నిర్దారణ పరీక్షలు చేయించాలని రోగులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో రోగులు అప్పులు చేసి పరీక్షలు చేయించుకుంటున్నారు. అందువల్ల అనుబంధ ఆరోగ్య వృత్తి కోర్సుల్లో అనేక మార్పులు చేయనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement